కరోనా కట్టడిలో ఇతర దేశాలతో పోల్చితే మనం మెరుగైన స్థితిలోనే ఉన్నామని ప్రధాని మోదీ తెలిపారు. అన్‌లాక్ 1.0 లో నిర్లక్ష్యంగా ఉండడం వల్ల సమస్యలు ఎదుర్కొన్నామని చెప్పారు. ప్రస్తుతం మనం అన్ లాక్ 2.0 లోకి ప్రవేశించామని, ఈ సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రధాని కోరారు. గ్రామ సర్పంచ్ అయినా, ప్రధాని అయినా కరోనా నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రజల నిర్లక్ష్యంతోనే వైరస్ వ్యాప్తి జరుగుతోందని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. భౌతిక దూరం పాటించడం, మాస్క్ ధరించడంలో అలక్ష్యంగా ఉంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇకపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జూలై నెల నుంచి దేశంలో కరోనా ముప్పు చాలా ఎక్కువగా ఉంటుందని ప్రధాని మోదీ హెచ్చరించారు. ఈ సమయంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వ్యాధుల సీజన్ కూడా కావడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. రాబోయే కాలం పండుగ సీజన్ కావడంతో దేశంలోని పేద ప్రజలు పస్తులు ఉండకుండా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జూలై నుంచి నవంబర్ వరకూ ఐదు నెలల పాటు ఇప్పటి వరకూ ఇచ్చినట్లే నెలకు ఐదు కిలోల బియ్యం లేదా గోధుమలు, కిలో శెనగలు పేద ప్రజలకు పంపిణీ చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. ప్రధాని గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ద్వారా దేశంలోని 80 కోట్ల మంది ప్రజలకు ఆహార ధాన్యాలు పంపిణీ చేస్తామన్నారు. ఒన్ నేషన్, ఒన్ రేషన్ కార్డు అమలు చేస్తామని తెలిపారు.
కరోనా నేపథ్యంలో ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రశంగించడం ఇది ఆరోసారి. ఓ వైపు కరోనా వైరస్ వ్యాప్తి మరో వైపు సరిహద్దుల్లో చైనాతో జరుగుతున్న ఘర్షణ వాతావరణ పరిస్థితుల్లో మోదీ ఏమి మాట్లాడబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. నిన్న రాత్రి టిక్‌టాక్, హెలో యాప్ సహా చైనాకు చెందిన 59 యాప్‌లను నిషేధించిన క్రమంలో మోదీ ప్రశంగంపై దేశం అంతా ఉత్కంఠగా ఎదురుచూసింది. అయితే మోదీ మాత్రం కేవలం కరోనా వైరస్‌కే తన ప్రశంగాన్ని పరిమితం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తి గల కారణాలు, ప్రజలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పేదలకు ప్రభుత్వం చేయదల్చుకున్న మేలు క్లుప్తంగా చెప్పి ముగించారు. వస్తుసేవల విషయంలో స్వయం సంవృద్ధి సాధించాలని చెప్పిన మోదీ.. చైనా యాప్‌ల నిషేధంపైన గానీ, చైనాతో సరిహద్దు వివాదం, కల్నల్ సహా 20 మంది జవాన్ల మరణంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు.