iDreamPost
iDreamPost
గతంలో దర్శకుడు సినిమాతో పరిచయమై ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయిన హరి ప్రసాద్ జక్కా రెండో ప్రయత్నం ప్లే బ్యాక్ ఇవాళ థియేటర్లలో గట్టి పోటీ మధ్యే అడుగు పెట్టింది. ప్రమోషన్లోనే దీన్నో డిఫరెంట్ కాన్సెప్ట్ గా ప్రొజెక్ట్ చేయడంతో ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగింది. నటీనటులు అంతగా పరిచయం లేనివారైనప్పటికీ కేవలం కంటెంట్ ని నమ్ముకుని దీన్ని తెరకెక్కించారు. టీవీ 5 ఛానల్ మూర్తి దీని ద్వారానే సిల్వర్ స్క్రీన్ డెబ్యూ చేయడం విశేషం. కమ్రన్ సంగీతం అందించగా బుజ్జి కె ఛాయాగ్రహణం బాధ్యతలు తీసుకున్నారు. మరి సుకుమార్ క్యాంప్ నుంచి వచ్చిన హరిప్రసాద్ ఇప్పుడీ ప్లే బ్యాక్ తో మెప్పించాడా లేదా రిపోర్ట్ లో చూద్దాం.
కార్తీక్(దినేష్ తేజ్)ఓ న్యూస్ ఛానల్ లో జర్నలిస్ట్. ఇతను కొత్తగా అద్దెకు దిగిన ఇంట్లో పాత ల్యాండ్ లైన్ ఫోన్ కి సుజాత(అనన్య నాగళ్ళ) అనే అమ్మాయి నుంచి కాల్ వస్తుంది. ఇద్దరి మధ్య అలా ఫోన్ లోనే పరిచయం పెరిగాక కార్తీక్ కు ఆమెకు సంబంధించిన ఒక షాకింగ్ విషయం తెలుసుకుంటాడు. సుజాత 1993 కాలం నుంచి తను వర్తమానంలో ఉంటూ మాట్లడుకుంటున్నట్టు గుర్తిస్తాడు. ఈ క్రమంలో సుజాత ఆ టైంలో హత్య వల్ల చనిపోయిందని తెలుసుకుని ఎలాగైనా ఆమెను కాపాడాలని కొన్ని సూచనలు చేస్తాడు. అసలు ఈ ప్రెజెంట్ పాస్ట్ కి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ఆ ఇద్దరూ ఏమయ్యారు లాంటి ప్రశ్నలకు సమాధానమే సినిమా.
హాలీవుడ్ మూవీ ఫ్రీక్వెన్సీ, కొరియన్ సినిమా ది కాల్ ని స్ఫూర్తిగా తీసుకుని హరిప్రసాద్ జక్కా చేసిన ప్రయత్నం మెచ్చదగినదే. ఎక్కడికక్కడ ఇది కొత్త ప్రయత్నం అనిపిస్తున్నప్పటికీ ఒకదశకు వెళ్ళాక పూర్తి గ్రిప్పింగ్ తో కథనం నడపలేకపోవడంతో చిన్న అసంతృప్తి కలిగిస్తుంది. దాన్ని మినహాయిస్తే ప్లే బ్యాక్ బ్యాడ్ ఛాయస్ గా అయితే నిలవలేదు. ఇంకొంచెం హోమ్ వర్క్ చేసుంటే గొప్పగా వచ్చి ఉండేదన్న ఫీలింగ్ కలిగిస్తుంది. అనన్య ఎక్కువ ఆకట్టుకుంది. మూర్తి,టిఎన్ఆర్, స్పందన, ఆనంద్ చక్రపాణి, సూర్య తదితరులు పాత్రలకు తగ్గట్టు ఉన్నారు. మ్యూజిక్ కెమెరా బాగా కుదిరాయి. రొటీన్ కు భిన్నంగా కొత్తదనం ఉండాలనుకునే ప్రేక్షకులకు గొప్పగా కాదు కానీ ప్లే బ్యాక్ ఓ బాగానే ఉందనే ఫీలింగ్ కలిగిస్తుంది.