iDreamPost
android-app
ios-app

రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా, పీకే కాంగ్రెస్ ప్రచారకుడిలా మారతారా?

  • Published Jun 05, 2021 | 2:47 PM Updated Updated Jun 05, 2021 | 2:47 PM
రాహుల్ గాంధీని పీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా, పీకే కాంగ్రెస్ ప్రచారకుడిలా మారతారా?

జాతీయ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ మొదలవుతోంది. వచ్చే ఎన్నికల్లో మోడీకి పోటీగా ప్రతిపక్షం తరుపున ప్రధాని అభ్యర్థి ఎవరనే అంశంపై ఇప్పటికే మీడియాలో కథనాలు వస్తున్నాయి. ముఖ్యంగా అధికార పక్షం నేతలయితే మోడీని ఢీకొట్టే వారు ఎవరూ లేరని బలంగా చెబుతున్నారు. అయితే ప్రజల్లో వ్యతిరేకత ఇదే రీతిలో కొనసాగితే మోడీకి ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద అడ్డంకి అవుతుందని విపక్షాలు వాదిస్తున్నాయి. ఇదే సమయంలో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ తెరమీదకు వచ్చారు. కాంగ్రెస్ కు తాను ఎన్నికల వ్యూహకర్తగా ఉంటానని ఉంటానని చెబుతున్నారు. దానికో షరతు కూడా పెట్టారు. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీని వచ్చే ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని ఆయన కోరుతున్నారు.

దేశంలో అత్యధికాలం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి ప్రధాని అభ్యర్థిని ప్రకటించే ఆనవాయితీ లేదు. వాస్తవానికి ప్రజాస్వామ్యదేశంలో ఎక్కువ మంది ఎంపీల మధ్దతున్న పార్టీ అధికారంలోకి వస్తుందే తప్ప వ్యక్తులను ప్రధానిగా ప్రకటించాల్సిన అవసరం లేదు. కానీ దానికి విరుద్ధంగా బీజేపీ మొదటి నుంచి ప్రధాని అభ్యర్థిని ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. నెహ్రూ అనంతరం ఇందిరా, ఆమె హత్య తర్వాత హఠాత్తుగా తెరమీదకు వచ్చి రాజీవ్ ఇలా ప్రధాని పదవులు స్వీకరించడమే తప్ప ఎన్నికల్లో పార్టీ తరుపున అధికారిక ప్రకటనలు లేవు. కాబట్టి ఈసారి కూడా కాంగ్రెస్ అలాంటి ప్రయత్నం చేస్తుందని ఆపార్టీ నేతలు విశ్వసించడం లేదు.

2004 ఎన్నికల్లో కూడా సోనియా గాంధీ మీద పలువురు కాంగ్రెస్ నేతలు ఒత్తిడి తెచ్చారు. అయినా తాను దానికి అంగీకరించలేదు. ఆమెను ప్రధానిగా ప్రకటిద్దామని చేసిన ప్రతిపాదనను తోసిపుచ్చి ఎవరైనా ప్రధాని కాగలరంటూ పేర్కొన్నారు. దానికి తగ్గట్టుగానే ఆ తర్వాతి పరిణామాల్లో మన్మోహన్ పీఠం ఎక్కిన సంగతి తెలిసిందే. దాంతో ఇప్పుడు కూడా సోనియా ససేమీరా అంటారని భావిస్తున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ లో రాహుల్ గాంధీ సారధ్యం మీద పూర్తి విశ్వాసం లేదు. అదే సమయంలో ప్రియాంక గాంధీ తాను బాధ్యతలు తీసుకున్న యూపీలో విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దాంతో 2009 ఎన్నికల్లో యూపీ, బీహార్ లో సొంతంగా సుమారు 35 సీట్లు గెలిచిన కాంగ్రెస్ అదే రీతిలో రాణించాలని ఆశిస్తోంది. అదే జరిగితే కేంద్రంలో అధికారానికి చేరువునట్టేనని అంచనా వేస్తోంది.

మొన్నటి బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తాను రాజకీయ వ్యూహకర్తగా ఇక వ్యవహరించబోనని ప్రకటించిన ప్రశాంత్ కిషోర్ హఠాత్తుగా కాంగ్రెస్ కోసం పనిచేస్తానని మాట మార్చడం కూడా ఆసక్తికరమే. గడిచిన కొన్నేళ్లుగా ఆయన మోడీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. అవకాశం దొరికిన ప్రతీ సందర్భంలోనూ ఘాటుగా మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో బెంగాల్ లో మమతా కోసం పనిచేసిన పీకే మొదటి నుంచి చెప్పినట్టుగానే బీజేపీ మూడంకెల సీట్లకు చేరలేకపోయింది. దాంతో కేంద్రంలో కూడా మోడీ ప్రభుత్వానికి ఎసరు పెట్టాలనే లక్ష్యంతో పీకే ఉన్నట్టు కనిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే ఆయన కాంగ్రెస్ కి ఇచ్చిన ఆఫర్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.