iDreamPost
iDreamPost
తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన మాజీ ఎమ్మెల్యే దివంగత వెన్నా నాగేశ్వరరావు కుమారుడు వెన్నా జగదీష్ జనసేనలో చేరారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న ఆయన జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమక్షంలో పార్టీ తీర్థంపుచ్చుకున్నారు. తెలుగుదేశం పార్టీలో తండ్రి వారసత్వాన్ని కొనసాగించాలని భావించినా పెద్దగా గుర్తింపు లేకపోవడంతో ఆయన జనసేనలో చేరారు.
పిఠాపురం నియోజకవర్గం ఓటర్లు ఎన్నికల్లో విలక్షణమైన తీర్పును ఇస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకతను చాటుకుంటారు. కాంగ్రెస్, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, బీజేపీలతోపాటు స్వతంత్రులుగా పోటీచేసిన వారికి సైతం ఈ నియోజకవర్గం పట్టం కట్టింది. అటువంటి నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నేతగా దివంగత వెన్నా నాగేశ్వరరావు చరిత్ర సృష్టించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భాంతో ఆ పార్టీలో చేరిన ఆయన 1983, 1985, 1994 ఎన్నికల్లో విజయం సాధించారు.
ఆయన దివంగతుడైనా ఆ కుటుంబానికి నియోజకవర్గంలో ఇప్పటికీ మంచి పట్టు ఉంది. ఈ కారణంగానే గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి వెన్నా నాగేశ్వరరావు వారసుడు జగదీష్‌ను టీడీపీ తరపున పోటీ చేయించాలని ఒక వర్గం విశ్వయత్నం చేసింది. నియోజకవర్గంలో అప్పటి ఎమ్మెల్యే ఎస్.వి.ఎస్.వర్మపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అభ్యర్థిని మార్పు చేయాలని భావించినా మాజీ ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు సిఫార్సుతో వర్మ తిరిగి అభ్యర్థిత్వం దక్కించుకున్నారు.
వైరివర్గం చెప్పినట్టుగానే ఎన్నికల్లో వర్మ ఓటమి చెందారు. ఎన్నికల తరువాత వర్మను తప్పించి జగదీష్‌కు ఇన్‌చార్జి ఇవ్వాలని పార్టీలో కొందరు కోరుతున్నా ఫలితం లేకుండా పోయింది. ఇదే సమయంలో తనకు పోటీగా ఉన్న జగదీష్‌కు నియోజకవర్గం పార్టీలో ప్రాధాన్యత లేకుండా చేయడంలో వర్మ విజయవంతమయ్యారు. దీనితో మరో దారిలేని జగదీష్ జనసేనలో చేరారు.
గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థి మాకిరెడ్డి శేషుకుమారి 28 వేల ఓట్లు తెచ్చుకున్నారు. ఎన్నికల తరువాత ఆమె నియోజకవర్గంలో పెద్దగా పట్టుసాధించలేదు. ఈ కారణంగా జనసేన సైతం కొత్త అభ్యర్థి కోసం ఎదురు చూస్తుండగా జగదీష్ వారికి ప్రయత్యామ్నాయంగా కనిపించారు.
Also Read : TDP, Chandrababu, OTS – డ్వాక్రా సంఘాలు, ఓటీఎస్.. ఓ చంద్రబాబు