iDreamPost
android-app
ios-app

గ్రామాల్లో తలలు పట్టుకుంటున్న వైఎస్సార్ సీపీ నేతలు

గ్రామాల్లో తలలు పట్టుకుంటున్న వైఎస్సార్ సీపీ నేతలు

సంక్రాంతి పండగ నెల ప్రారంభంలో ఆంధ్రప్రదేశ్ గ్రామాల్లో అలజడి నెలకొంది. జగన్ సర్కార్ విడుదల చేసిన పింఛన్ అర్హుల జాబితా గ్రామాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారితో పాటు ఇప్పటికే ఏళ్ల తరబడి పింఛన్ తీసుకుంటున్న వారితో కలిపి సరికొత్త అర్హుల జాబితా విడుదల చేశారు. తాజా నిబంధనలతో ఈ జాబితా రూపొందించారు. ప్రధానంగా మాగాణి 3 ఎకరాల లోపు, మెట్ట భూమి 10 ఎకరాల లోపు, లేదా రెండు కలసి 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారి పింఛన్లకు అర్హులు.

గతంలో ఈ పరిమితి 5 ఎకరాల లోపు మాత్రమే ఉండేది. జగన్ సర్కార్ ఈ పరిమితిని 10 ఎకరాలకు పెంచడంతో మరింత మందికి మేలు చేకూరుతుందని భావించారు. ప్రభుత్వం భావించినట్లు లబ్ది జరిగింది. ఐతే టిడిపి ప్రభుత్వ హయాంలో తెచ్చిన మీ భూమి రైతులకు ఆది నుంచి తిప్పలు తెచ్చిపెట్టింది. అసమగ్రంగా భూములను ఆన్లైన్ చేయడంతో సమస్యలు తలెత్తాయి. ఒకరి భూములు మరొకరి పేరుపై, యజమాని వివరాలు లేని భూములను ఆ గ్రామంలోని, లేదా ఆ మండలంలోని మరో రైతు పేరు తో రెవెన్యూ అధికారులు ఆన్లైన్ చేశారు. ఫలితంగా రెండు ఎకరాలు భూమి ఉన్న రైతుకు 15 ఎకరాలు ఉన్నట్లు మీ భూమిలో చూపిస్తోంది. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరిగింది.

మీ భూమిలో భూముల తప్పుల తడకలు వివరాల వల్ల పింఛన్ తీసుకునే అర్హత ఉన్నా కూడా అనర్హులుగా అధికారులు నిర్ధారిస్తున్నారు. పింఛన్ జాబితాలో.. భూమి 10 ఎకరాల కన్నా ఎక్కువ ఉండడంతో అనర్హులు అంటూ పింఛన్ లబ్ధిదారుల జాబితా నుంచి తొలగించారు. తమకు అంత భూమి లేదని పింఛన్ లబ్ధ్దిదారులు మొత్తుకుంటున్నారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.

పింఛన్ పోవడంతో గ్రామాల్లో వివాదాలు జరుగుతున్నాయి. పార్టీలకు అతీతంగా అందరి పింఛన్లు పోయిన, వైఎస్సార్ సిపి నాయకులే తమ పింఛన్లు తొలగింపజేశారని టిడిపి నేతలు, పింఛన్ లబ్ధిదారులు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. 2014 లో టిడిపి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే వైఎస్సార్ సిపి సానుభూతి పరుల పింఛన్లు తొలగించారు. దీనిపై అప్పటి ప్రతిపక్ష నేత కూడా ఆందోళనలు నిర్వహించారు. కొంత మంది నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గతనాన్ని దృష్టిలో పెట్టుకుని.. అప్పుడు టిడిపి నేతలు, జన్మ భూమి కమిటీలు చేసిన పనే ఇప్పుడు వైఎస్సార్ సిపి నేతలు చేసారని టిడిపి సానుభూతి పరులైన పింఛన్ లబ్ధిదారులు భావిస్తున్నారు.

టిడిపి వారితో పాటు వైఎస్సార్ సిపి వారి పింఛన్లు రద్దు కావడంతో గ్రామస్థాయిలోని వైఎస్సార్ సిపి నేతలు తలలు పట్టుకుంటున్నారు. వారికి సమాధానం చెప్పుకోలేక తిప్పలు పడుతున్నారు. తహశీల్ధార్, ఎంపిడివో కార్యాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. లబ్ధిదారులను అక్కడికి తీసుకెళ్లి సమస్య ను అధికారులతోటే చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు చేసిన తప్పుకు తాము నష్టపోతున్నామని పింఛన్ లబ్ధిదారులు ఫైర్ అవుతున్నారు. ఏళ్ల తరబడి వస్తున్న పింఛన్ రద్దు కావడంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు.

మీ భూమిలో తప్పులు ఇప్పట్లో సరి చేసే పరిస్థితి కానరావడం లేదు. కనీసం ఏడాది సమయం పట్టె అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్ సిపి గ్రామ నేతలు ఆందోళన చెందుతున్నారు. వచ్చే నెల రెండో వారంలోనే పంచాయతీ ఎన్నికలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. పింఛన్ల రద్దు అధికార పార్టీకి పెద్ద నష్టం చేస్తుందని అంచనా వేస్తున్నారు. వైఎస్సార్ సిపి నేతలు కూడా ఇదే భావనలో ఉన్నారు. ఎన్నికల లోపు ప్రభుత్వమే ఈ సమస్య పరిస్కారానికి విధాన పరమైన నిర్ణయం తీసుకుంటే తప్ప రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సమస్య కొలిక్కి వచ్చే అవకాశం లేదు.