iDreamPost
iDreamPost
ఆంధ్రప్రదేశ్ అంధకారం అయిపోయిందంటాడొకరు.. ఏపీని చూస్తే జాలేస్తోందంటారు ఇంకొంకరు.. గంటల కొద్దీ కరెంటు కోతలంటే ఇక కష్టమే అంటారు మరొకరు. ఇదీ టీడీపీ నేతలు, శ్రేణుల తీరు. హైదరాబాద్ నుంచి టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న ప్రచారం హద్దు మీరుతోంది. అబద్ధాల్లో ఆరితేరినందున వాటితోనే అందరినీ నమ్మించవచ్చని భావిస్తున్నట్టు కనిపిస్తోంది. అందుకే ఇప్పుడు కరెంట్ కోతలపై అబద్ధాల కోతలు కోస్తోంది.
నిజానికి ఏపీలో కరెంటు కోతలు చాలా నామమాత్రంగా ఉన్నాయి. అయినా ముందుచూపుతో సీఎం జగన్ కేంద్రాన్ని సహాయం కోరారు. బొగ్గు నిల్వలు నిండుకోకముందే రవాణా చేయాలని పీఎంకి లేఖ రాశారు. దానికి ఫలితాలు వస్తున్నాయి. అదే సమయంలో ఎక్కువ మొత్తంలో విద్యుత్ కొనుగోలు చేసయినా సరే కోతలు లేకుండా చూడాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. దానికి అనుగుణంగా బహిరంగమార్కెట్లో అధికధరకు కొనుగోలు చేస్తోంది. పట్టణాలు, నగరాల్లో ప్రస్తుతం కరెంటు కోతలన్నవే లేవు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో అది కూడా పీక్ సమయంలో కొంత సమయం మాత్రమే కరెంటు నిలిచిపోతోంది. దానిని సామాన్యులు కూడా పెద్ద సమస్యగా భావించే పరిస్థితి లేదు. ఇతర రంగాల మీద ప్రభావం లేకుండా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా వ్యవసాయం. ఆక్వా, పారిశ్రామిక రంగాలకు విద్యుత్ కోతలు లేకుండా సరఫరా చేస్తున్నారు.
Also Read : AP CM జగన్, కీలక అడుగుల వైపు అధికార పక్ష అధినేత
వాస్తవాలను వక్రీకరించి ఏపీలో ఏదో జరిగిపోతోందనే భ్రమల్లో టీడీపీ నేతలున్నారు. దానికి అనుగుణంగానే దసరా మరునాడు నుంచే విద్యుత్ కోతలు, లోడ్ రిలీఫ్ అమలవుతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలెట్టేశారు. నిజానికి తామంతగా కరెంటు కోతల మీద గగ్గోలు పెడుతుంటే వాస్తవంలో విద్యుత్ సమస్య లేదని, సామాన్యులు తమని చీదరించుకుంటారనే వాస్తవం కూడా వారికి పట్టడం లేదు. అంతేగాకుండా చాలా పెద్ద విద్యుత్ సంక్షోభం అంటూ తాము ప్రచారం చేస్తుంటే జగన్ మాత్రం విద్యుత్ సరఫరాలో ఆటంకాలు లేకుండా చేయడం ద్వారా ప్రజల్లో మరింత బలం పెంచుకుంటారనే విషయాన్ని కూడా గుర్తించలేకపోతున్నారు. అంత పెద్ద విద్యుత్ సంక్షోభం నుంచి గట్టెక్కించిన సమర్థత జగన్ కే చెల్లుతుందనే విషయం తెలుసుకుంటున్నట్టుగా లేదు.
టీడీపీ, విపక్ష సోషల్ మీడియా బృందాలు వైరల్ చేస్తున్న కరెంట్ కోతల వేళల విషయంపై ఏపీ ఇంధన శాఖ వివరణ ఇచ్చింది. అలాంటి అబద్ధాలు పట్టించుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. అవాస్తవాలతో జనంలో ఆందోళనకు గురిచేస్తున్న వారిపై చర్యలుంటాయని హెచ్చరించింది. ఇంతటి సంక్షోభ సమయంలోనూ వినియోగదారులకు నాణ్యమైన సరఫరా, కరెంటు ఇచ్చేందుకు రాష్ట్ర విద్యుత్‌పంపిణీ సంస్థలు శక్తివంచనలేకుండా కృషిచేస్తున్నాయని ఆ శాఖ ముఖ్యకార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు. సంక్షోభాన్ని ఎదుర్కొనే వ్యూహంలో భాగంగా రాష్ట్ర విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏ పి జెన్కో కు అత్యవసరంగా రూ . 250 కోట్లు నిధులు, బొగ్గు కొనుగోలు నిమిత్తం సమకూర్చకున్నట్టు తెలిపారు.
Also Read : Nara Lokesh – లేఖతో బయట పడిన డొల్లతనం
రాష్ట్రానికి అదనంగా రోజుకి దాదాపు 8 బొగ్గు రైళ్లు కేటాయించబడ్డాయన్నారు. దేశంలో బొగ్గు లభ్యత ఎక్కడవున్నా కొనుగోలు చేయవలసినది గా ఏ . పి జెన్కో కు ఆదేశాలు ఉన్నట్టు వివరించారు. స్వల్ప కాలిక మార్కెట్ నుంచి ధర ఎంత పలికినా అవసరాల నిమిత్తం కొనుగోలు చేయాల్సిందిగా విద్యుత్ పంపిణి సంస్థలను ఆదేశించడం జరిగిందని, కేంద్ర విద్యుత్ సంస్థల నుంచి వచ్చే సంవత్సరం జూన్ వరకు , ఆంధ్ర ప్రదేశ్ కోసం దాదాపు 400 మె . వాట్లు చౌక ధర విద్యుత్ కోసం కేంద్ర ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖకు అభర్ధన పెట్టటం జరిగిందని తెలిపారు. ఈ వాస్తవాలను విస్మరించి విపక్ష టీడీపీ చేస్తున్న ప్రచారం బూమరాంగ్ అయ్యే ప్రమాదం ఉందన్నది ఆపార్టీ నేతలు గ్రహిస్తే మంచిది.