iDreamPost
iDreamPost
1996లో శ్రీకాంత్ హీరోగా దర్శకేంద్రులు కె రాఘవేంద్రరావు రూపొందిన పెళ్లి సందడి ఎంత పెద్ద సెన్సేషనల్ బ్లాక్ బస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏబీసీ సెంటర్ల తేడా లేకుండా విడుదలైన ప్రతి చోట రికార్డుల ప్రభంజనం, వసూళ్ల సంచలనం సృష్టించింది . స్టార్ సినిమాలకు ధీటుగా ఇండస్ట్రీ మొత్తం షేక్ అయ్యేలా నమోదు చేసిన కలెక్షన్ల ఫిగర్లు చూసి ట్రేడ్ సైతం నివ్వెరపోయింది. అప్పటిదాకా చిన్న వేషాలతో నెట్టుకొస్తున్న శ్రీకాంత్ దీని దెబ్బకే స్టార్ స్టేటస్ వచ్చేసి వరస సినిమాల్లో సోలో హీరోగా బుక్కైపోయి తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నాడు. ఇక కీరవాణి సంగీతం గురించి చెప్పేదేముంది. ఎక్కడ చూసినా ఇవే పాటలు.
ఆడియో క్యాసెట్లు నెలల తరబడి హాట్ కేకుల్లా అమ్ముడుపోతూనే ఉన్నాయి. క్లాసు మాస్ తేడా లేకుండా అందరూ పరవశించిపోయారు. తెలుగు సినిమా చరిత్రలో పెళ్లి సందడి ఒక మైల్ స్టోన్ గా నిలిచిపోయింది. మసాలా కమర్షియల్ అంశాలు లేకుండా ఓ చిన్న మూవీ ఈ స్థాయిలో విజయం సాధించడం చూసి ఇతర భాషల్లోనూ కోరిమరీ రీమేక్ చేసుకున్నారు. ఇన్నేళ్ల తర్వాత మరోసారి పెళ్ళిసందడి పేరుతో మేజిక్ చేసేందుకు సిద్ధమవుతున్నారు రాఘవేంద్ర రావు. తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో స్వయంగా ప్రకటించారు. దాదాపు అదే టీమ్ దీనికి పని చేయనుండటం విశేషం. కీరవాణి సంగీతం రెండోసారి అద్భుతాలకు రెడీ అవుతోంది. బాహుబలి ప్రొడక్షన్ హౌస్ ఆర్కా మీడియాతో కలిసి రాఘవేంద్రరావు స్వంత బ్యానర్ దీన్ని నిర్మించబోతున్నారు.
శివశక్తిదత్తా, శ్రీధర్ సీపాన తదితరులు సాంకేతిక నిపుణుల బృందంలో ఉన్నారు. తారాగణం ఎవరనేది మాత్రం ఇందులో ప్రస్తావించలేదు. శ్రీకాంత్ ని ఏదైనా కీలక పాత్రకు కొనసాగించే అవకాశం ఉంది. అప్పటి హీరోయిన్లు దీప్తి భట్నాగర్, రవళి అందుబాటులోనే ఉన్నారు. ఓ ముగ్గురు నలుగురు తప్ప అందులో నటించిన మెయిన్ క్యాస్టింగ్ అంతా తీసుకునే ఛాన్స్ లేకపోలేదు. మెయిన్ గా ఒక యూత్ హీరో ఉండే ఛాన్స్ ఉంది. కల్ట్ క్లాసిక్స్ ని మళ్ళీ అదే పేరుతో చాలా గ్యాప్ తర్వాత తీసినప్పుడు సక్సెస్ అయినవి చాలా తక్కువ. అయితే అవన్నీ వేర్వేరు దర్శకులు హీరోలు తీసినవి. కానీ ఇక్కడ రాఘవేంద్రరావే స్వయానా పూనుకుంటున్నారు కాబట్టి మంచి పాజిటివ్ రిజల్ట్ ఆశించవచ్చు. 2017లో నాగార్జునతో ఓం నమో వెంకటేశాయా తీశాక రాఘవేంద్రరావు మూడేళ్ళ గ్యాప్ తీసుకుని దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే.