iDreamPost
android-app
ios-app

అనర్థాలకు దారి తీసిన అపార్థాలు – Nostalgia

  • Published Mar 22, 2021 | 11:34 AM Updated Updated Mar 22, 2021 | 11:34 AM
అనర్థాలకు దారి తీసిన అపార్థాలు – Nostalgia

ఉగ్ర్యా్యాడ్ఏ చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి అని కవి పుంగవులు ఊరికే రాయలేదు. ఇందులో బోలెడంత అర్థం ఉంది. స్వంత పెళ్ళాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటున్నట్టు లోకాన్ని నమ్మించే ఎందరో మగ మహారాజులు చిన్నిల్లు పెట్టుకున్న ఉదంతాలు చుట్టూ ఎన్నో చూస్తున్నాం పేపర్లలో చదువుతున్నాం. ఈ పాయింట్ పైకి వినడానికి సీరియస్ గా అనిపించినా ఇందులో నుంచి బోలెడంత కామెడీ తీయొచ్చని నిరూపించిన సినిమా 2003లో వచ్చిన పెళ్ళాం ఊరెళితే. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో అగ్ర నిర్మాతలు అల్లు అరవింద్, అశ్వినీదత్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వెనుక ఆసక్తికరమైన విశేషాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

2002 సంవత్సరం తమిళంలో ‘చార్లీ చాప్లిన్’ అనే సినిమా వచ్చింది. ప్రభు-ప్రభుదేవా హీరోలు. శక్తి చిదంబరం రచన దర్శకత్వంలో ఇది బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. నిజానికిది 1998లో వచ్చిన రాజేంద్ర ప్రసాద్ ‘మీ ఆయన జాగ్రత్త’ నుంచి స్ఫూర్తి పొంది ఎంటర్ టైన్మెంట్ డోస్ పెంచి తీసింది. రెండింటికి చాలా పోలికలు కనిపిస్తాయి. కానీ అప్పుడది పెద్దగా ఆడలేదు. ఈ రెండింటికి అసలు మూలం 1975లో వచ్చిన ‘యారుక్కుమ్ మాపిళ్ళై’ అని చెప్పాలి. సరే వీటి సంగతలా ఉంచితే 90వ దశకంలో ‘ప్రేమకు వేళాయెరా’ సూపర్ హిట్ తర్వాత ఎస్వి కృష్ణారెడ్డిని వరస పరాజయాలు పలకరించాయి. అభిషేకం, కోదండరాముడు, శ్రీశ్రీమతి సత్యభామ, సకుటుంబ సపరివార సమేతం, ప్రేమకు స్వాగతం, బడ్జెట్ పద్మనాభం తదితరాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

అప్పుడు వచ్చిన రీమేక్ ప్రతిపాదనే ‘పెళ్ళాం ఊరెళితే’. తెలుగు ఆడియన్స్ కి తగ్గట్టు కథలో మార్పులు చేయడంలో సత్యానంద్ కీలక పాత్ర పోషించడంతో టైటిల్ కార్డులో స్టోరీ కింద ఆయన పేరు వేశారు. చింతపల్లి రమణ మాటలు సమకూర్చగా మణిశర్మ సంగీతం అందించారు. శ్రీకాంత్, వేణు, సునీల్ ఇలా ముగ్గురు స్నేహితులు తమ పెళ్ళాలకు చెప్పిన అబద్దాలు ఎంతటి అనర్థాలకు దారి తీశాయో ఇందులో చూపించిన తీరుకి ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ సక్సెస్ అందించారు. ఇది ఎంత విజయం సాధించిందంటే హిందీ, కన్నడ, మలయాళం, మరాఠి భాషల్లో రీమేక్ చేశారు. 2003 జనవరి 15 విడుదలైన పెళ్ళాం ఊరెళితే అదే సంక్రాంతికి వచ్చిన ఒక్కడు, నాగ, ఈ అబ్బాయి చాలా మంచోడుల మధ్య విపరీతమైన పోటీలోనూ సక్సెస్ కొట్టింది.