iDreamPost
iDreamPost
పాలకులు తమకు ప్రజలనుండి లేదా సామంతులనుండి రహస్య సమాచారం తెలుసుకోవడం కోసం గూఢచారులను నియమించుకునేవారు. ఈ గూఢచారులు ప్రతి రాజుకు, ప్రతి దేశానికీ ఉండేవారు. కొన్ని సార్లు వీరిని “వేగులు” అనేవారు.
ప్రజలు, ప్రత్యర్థుల మాటలు, చేతలు, కదలికలపై ఓ కన్ను వేసి వాటిని తమ పాలకులకు చేరవేయడం ఈ గూఢచారులు లేదా వేగుల విధి. ప్రజల్లో తమ పాలనపై ఎలాంటి అభిప్రాయం ఉంది అని తెలుసుకోడానికి, ప్రజల్లో తమపై తిరుగుబాటు ఏమైనా వచ్చే అవకాశం ఉందా అని ఓ అంచనా వేయడానికి, తమ మంత్రుల్లో, సైనికాధికారుల్లో ఎవరైనా కుట్రలు చేస్తున్నారా అని తెలుసుకోడానికి ఇంకా అనేకానేక కార్యాలకు ముందస్తు సమాచారం తెలుసుకునేందుకు పాలకులు ఈ గూఢచర్యం చేయిస్తుండేవారు.
1970-80 దశకాల్లో భారత దేశంలో, ప్రత్యేకించి ఎమెర్జెన్సీ కాలంలో ప్రభుత్వ గూఢచారులు తిరుగుతూ ఉండేవారని జనం చెప్పుకుంటూ ఉండేవారు. ఊర్లోకి కొత్తబిచ్చగాడు వచ్చినా జనం అనుమానించేవారు. పిచ్చివాడు వచ్చినా, ఆ పిచ్చివాడికి మన భాష రాకపోయినా అతగాడు ప్రభుత్వ గూఢచారే అని నిర్ధారించే పరిస్థితులు ఉండేవి.
నేరపరిశోధనకు పోలీసులు కూడా గూఢచర్యం చేస్తూ ఉంటారు. నేరస్తులపై ఓ కన్నేయడంతో పాటు నేరం జరిగితే దాని కారణాలు, కారకులు ఎవరో తెలుసుకునేందుకు రహస్య పరిశోధన చేసేందుకు పోలీసుల్లో సిఐడి, సిబిఐ వంటి సంస్థలు ఉన్నాయి. అలాగే తీవ్రవాదులు, ఉగ్రవాదులు, నిషేధిత నక్షలైట్లు వంటివారి సమాచారాన్ని తెలుసుకునేందుకు, ముందస్తుగానే పసిగట్టేందుకు నిఘా సంస్థలు పనిచేస్తూ ఉంటాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఈ నిఘా సంస్థల ప్రతినిధులే ఆయా సంస్థల్లో చేరిపోయి వారి సమాచారం అందిస్తూ ఉంటారు. దీన్నే “అండర్ కవర్ ఆపరేషన్” అంటారు. మహేష్ బాబు నటించిన “పోకిరి” సినిమా ఈ కోవలోకే వస్తుంది.
ఇలాంటి కార్యక్రమాల్లో సాంకేతికత ప్రవేశ పెట్టి ఈ నిఘా పద్దతులను ఓ అడుగు ముందుకు తీసుకెళ్ళడమే “ఫోన్ ట్యాపింగ్”, “సిసి కెమెరా లేదా నిఘా కెమెరా” వంటివి. ప్రత్యర్ధుల కదలికలు, సంభాషణలు “అండర్ కవర్ ఆపరేషన్” అవసరం లేకుండా సాంకేతిక సహకారంతో నిఘా ఉంచడం. కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు, సైనిక నిఘా వర్గాలు, పలు దర్యాప్తు సంస్థలు ఇప్పుడు ఈ సాంకేతిక నిఘా పద్దతులను చాలా ఎక్కువగానే వాడుతున్నారు. ఈ కారణంగానే ప్రత్యర్థుల భాషలో సంకేతాలు, పదాలు మార్పు వచ్చింది. బాంబు పేలుడు అనే పదానికి “విందు” అని తీవ్రవాదులు నామకరణం చేసుకోవాల్సి వచ్చింది. ఇలా చాలా మార్పులు వచ్చాయి.
ఇప్పుడు తాజాగా ఇవి ఓ అడుగు ముందుకేసి కేంద్ర ప్రభుత్వం న్యాయమూర్తులపైనా, మంత్రులపైనా, మానవహక్కుల కార్యకర్తలపైనా, జర్నలిస్టులపైనా, ప్రత్యర్థులపైనా… ఇలా అనేక వర్గాల ప్రజలపై నిఘా వేసినట్టు ప్రస్తుతం పార్లమెంటులో ఆందోళన జరుగుతోంది. ఇజ్రాయిల్ దేశానికి చెందిన ఓ సంస్థ రూపొందించిన “పెగాసస్” అనే స్పై వేర్ ను ప్రపంచంలో అనేక దేశాలు కొని ఆయా దేశాల్లోకీలక స్థానాల్లో ఉన్న వ్యక్తులపై, సంస్థలపై నిఘా పెట్టాయి. భారతదేశంలో మోడీ ప్రభుత్వం కూడా ఈ స్పై వేర్ తో నిఘా పెట్టింది అని ఆరోపణలు వస్తున్నాయి.
నిన్నమొన్న వచ్చిన మహేష్ బాబు మరో సినిమా “స్పైడర్”లో కూడా ఇలాంటి నిఘా కనిపిస్తుంది.
మహేష్ బాబు రహస్యంగా అనేకమంది ఫోన్లో మాట్లాడుకోవడం వింటాడు. ఈ క్రమంలోనే ఒక సైకో సీరియల్ హంతకుణ్ణి పట్టుకుంటాడు. సరిగ్గా మహేష్ బాబు అందరి ఫోన్ సంభాషణలు వింటున్నట్టే మోడీ ప్రభుత్వం కూడా దేశంలోని అనేక రంగాలకు చెందినవారి ఫోన్లను ట్యాప్ చేసి సంభాషణలు వింటోంది.అయితే అది దెస రక్షణకు కాకూండా రాజకీయ లబ్ధి కోసం కొందరి ఫోన్లు వింటుందని ఆరోపణ.
వాస్తవానికి మనం ప్రస్తుతం వాడే చాలా ఫోన్ల వల్ల కూడా మన విషయాలు అవతలివారికి తెలిసే అవకాశం ఉంది. పేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ వంటి సామజిక మాధ్యమాల్లో మనం పెట్టుకునే పోస్టుల వల్ల మనం ఎక్కడున్నామో, ఏం చేస్తున్నామో ఇతరులకు తెలిసే అవకాశం ఉంది. మన ఫోన్లో ఉండే కొన్ని యాప్స్ వల్ల కూడా మన వివరాలు ఇతరులకు తెలుస్తాయి. చివరికి మనం నగదు లావాదేవీలకు వాడే గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటివల్ల మన బ్యాంకు అకౌంట్ వివరాలు కూడా ఇతరులకు తెలుస్తాయి. అంతెందుకు, ఫోన్లో ఉండే గూగుల్ మ్యాప్ వల్ల మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడెక్కడ తిరుగుతున్నాం వంటి వివరాలు ఇతరులకు తెలుస్తాయి.
టెక్నాలిజీ వల్ల ప్రపంచం అరచేతిలో ఉంది అని మనం సంబరపడితూ, అదే టెక్నాలజీ వల్ల మన వివరాలన్నీ ప్రపంచం చేతికి ఇస్తున్నట్టు గమనించలేకపోతున్నాం. స్మార్ట్ ఫోన్ వాడుతున్న ప్రతివారి వివరాలు, వారి ఫొటోలు, వీడియోలు, బ్యాంకు అకౌంట్లు తదితర వివరాలు స్మార్ట్ ఫోన్ కాపీ చేసుకుని భద్రపర్చుతుంది. ఏ స్పై వేర్ వాడినా ఆ వివరాలన్నీ క్షణాల్లో ఇతరులు తెలుసుకోవచ్చు. ఇప్పుడు మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం చేస్తున్నది కూడా అదే. మన స్మార్ట్ ఫోన్లలో మనం భద్రపర్చుకునే సమాచారాన్ని మోడీ ప్రభుత్వం “పెగాసస్” అనే ఈ స్పై వేర్ ద్వారా తస్కరిస్తోందని పార్లమెంటులో ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయి. ప్రభుత్వం ఎలాంటి సమాధానం ఇచ్చినా ఒక్కటి మాత్రం నిజం… స్మార్ట్ ఫోన్లు మన జీవితాలను బహిర్గతం చేస్తాయి.