Idream media
Idream media
తెలంగాణ రాష్ట్రంలో హుజూరాబాద్ నియోజకవర్గం రాజకీయంగా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆత్మ గౌరవ పోరాటం పేరుతో టీఆర్ఎస్ కు రాజీనామా చేయడంతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేసిన ఈటల రాజేందర్ కు హుజూరాబాద్ లో గెలుపు ప్రతిష్ఠాత్మకం. అలాగే రాష్ట్రంలో ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్న బీజేపీ.. రాజేందర్ చేరికతో బలపడినట్లు భావిస్తోంది. దీంతో పార్టీ పరంగా కూడా ఇక్కడ గెలుపు చాలా అవసరం. కానీ, ఇటువంటి పరిస్థితుల్లో బీజేపీ నాయకుడే ఆ పార్టీకి ఇక్కడ కంట్లో నలుసుగా మారారు. అతనే పెద్దిరెడ్డి. ఈటల చేరికను మొదటి నుంచీ వ్యతిరేకిస్తున్న పెద్దిరెడ్డి తాజాగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయనున్నట్లు అనుచరులతో బహిరంగంగానే చెబుతున్నారు.
బీజేపీలో మాజీమంత్రి ఈటల రాజేందర్ చేరిక ఆ పార్టీ హుజూరాబాద్ నేతల్లో కొత్త ఉత్సాహాన్నిచ్చింది. అయితే బీజేపీ ఆశలపై ఆ పార్టీ నేత పెద్దిరెడ్డి నీళ్లు చల్లుతున్నారు. ఈటల, బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారు. రాష్ట్ర నాయకత్వం ఆయన మెత్త పర్చేందుకు ప్రయత్నాలు చేస్తునప్పటికీ ఆయన తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. హుజూరాబాద్‌లో బీజేపీ పదాధికారుల సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశానికి రాకుండా పెద్దిరెడ్డి అలకపూనారు. హుజూరాబాద్‌లోనే ఉన్నా.. సమావేశాలకు దూరంగా ఉన్నారు. ఇప్పటి దాకా పెద్దిరెడ్డి ఈటలనూ కలవలేదు. దీంతో అయోమయంలో అనుచరులున్నారు. గతంలో ఈటల బీజేపీలో చేరడాన్ని పెద్దిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. ఈటల బీజేపీలోకి వస్తే మరో ఉప్పెన తప్పదని హెచ్చరించారు కూడా. తనను సంప్రదించకుండా ఈటలను పార్టీలోకి ఎలా ఆహ్వానిస్తారని ప్రశ్నించారు.
ఈటల బీజేపీలో చేరికను పెద్దిరెడ్డి వ్యతిరేకించారు. ఆయన ఈ విషయంలో తన అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో తన మద్దతుదారులతో మాట్లాడి తాను పోటీచేసే విషయాన్ని ప్రకటిస్తానని తెలిపారు. దీంతో ఆయన టీఆర్‌ఎస్‌లో చేరి ఈటలపై పోటీకి దిగుతారని ప్రచారం ప్రారంభమైంది. ఆయన రెండు రోజులు క్రితం, రెండు రోజులపాటు ఇక్కడే పర్యటించి పలువురు మద్దతుదారులను కలిశారు. దీంతో బీజేపీ అప్రమత్తమై పెద్దిరెడ్డితో పలుమార్లు చర్చలు కూడా జరిపింది. అయినప్పటికీ పెద్దిరెడ్డి స్వతంత్రంగా నియోజకవర్గంలో పట్టు కోసం ప్రయత్నిస్తున్నారు. మరోవైపు టీఆర్ఎస్ కూడా పెద్దిరెడ్డి ని పార్టీలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే పెద్దిరెడ్డి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో పెద్దిరెడ్డి పొలిటికల్ కెరీర్ ఎలా మలుపు తిరుగుతుందో చూడాలి.