iDreamPost
android-app
ios-app

మన ఆడబిడ్డల్ని సంరక్షించకపోతే 151 సీట్లు ఇచ్చి ప్రయోజనం ఏంటీ?-పవన్ కళ్యాణ్

  • Published Dec 03, 2019 | 7:30 AM Updated Updated Dec 03, 2019 | 7:30 AM
మన ఆడబిడ్డల్ని సంరక్షించకపోతే 151 సీట్లు ఇచ్చి ప్రయోజనం ఏంటీ?-పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్ రాయలసీమ యాత్ర 2వ రోజు తిరుపతి, చిత్తూర్ కార్యకర్తలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు లేవనెత్తిన అంశాల- పరిశీలన

1 . కడప టూర్ కు వెళితే దాడులు చేస్తారు వెళ్ళొద్దని నాకు చెప్పారు.నాదగ్గర వేట కొడవళ్లు లేవు ,నాటుబాంబులు లేవు, జ్ఞానం అనే ఖడ్గం మాత్రమే ఉంది .

గడచిన 10 సంవత్సరాలలో కడప పర్యటనకు వెళ్లిన ఏ పార్టీ నాయకుల మీద దాడులు జరగలేదు. పర్యటన చేయొద్దని ఎవరు బెదిరించిన పరిస్థితి లేదు. ప్రజారాజ్యం ప్రచారంలో భాగంగా చిరంజీవి మీసం మెలిపెట్టి ,తొడకొట్టినా ఎవరు దాడులు చేయలేదు.

ప్రజారాజ్యం ప్రచారంలో భాగంగా గుంటూరు జిల్లా నారాకోడూరు కు వెళ్లిన చిరంజీవిని అడ్డుకొని కోడిగుడ్లతో దాడి చేసిన సంగతి పవన్ మర్చిపోయినట్లున్నాడు. జగన్ పాదయాత్ర తరువాత ఆ ఊరు రోడ్లను ట్యాంకర్లలో పసుపు నీళ్లు పెట్టి కడిగారు. దాడులు చేయటం అంటే ఇలా ఉంటుంది, కానీ ఊహాజనితంగా కడపకు వెళ్ళొద్దని నాకు సలహాలు ఇచ్చారు అనటం సగటు రాజకీయ ఆరోపణగానే మిగిలిపోతుంది.

జ్ఞానఖడ్గం ఉండటం మంచిదే కానీ ప్రాంతాన్ని,జిల్లాను ,ఊరిని నిందిస్తూ మాట్లాడటం సరికాదు .

Read Also: తిరుపతిలో మతం, కులం పై పవన్ షాకింగ్ కామెంట్స్

2 . ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారు అని పిలవాలంటే “హూ” అంటూ గాలి పీల్చుకొని పిలవాలి అందుకని జగన్ రెడ్డి అని అంటాను నేను.

ఎవరినైనా గుర్తించటానికి , సంబోధించటానికి తల్లిదండ్రులు పెట్టేదే పేరు. ఇతరులు పిలిచేప్పుడు వారి పరిచయాన్ని బట్టి , చనువుని బట్టి , వారి సంస్కార స్థాయిని బట్టి పేరులో ఓ భాగంతో పిలుస్తారు,అది సహజం. కానీ రాజ్యాంగ బద్ధమైన ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తిని ఆ స్థానాన్ని ఉదహరిస్తూ పూర్తి పేరుతో పిలవడం అనేది రాజ్యాంగానికి , ప్రజలు ఎన్నుకొన్న స్థానానికి ఇచ్చే కనీస మర్యాద . ఆ వ్యక్తి పట్ల ఆక్షేపణలు ఉన్నా, ఆ వ్యక్తి పై ఆరోపణలు చేస్తున్నా కూడా ఆ మర్యాద మీరకుండా చేయడం అనేది రాజకీయ నాయకులు పాటించే కనీస ధర్మం.

ముఖ్యమంత్రిని గుర్తించను ,వైసీపీ నాయకుడని లేక జగన్ రెడ్డి అంటాను అని పవన్ అంటే ముఖ్యమంత్రి అని పిలవాలని అటు ప్రభుత్వం కానీ ఇటు చట్టం కానీ బలవంతం చెయ్యదు కానీ పవన్ రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందలేరు. భవిష్యత్తులో కూడా వైసీపీ వాళ్ళు పవన్ను సినిమా యాక్టర్ అని,జనసేన వాళ్ళు జగన్ రెడ్డి అంటూ ట్రోల్ చేసుకోవటం తప్ప ప్రజలకు ఏమి ఉపయోగం ఉండదు.

3 . మన ఆడబిడ్డల్ని సంరక్షించకపోతే 151 సీట్లు ఇచ్చి ప్రయోజనం ఏంటీ?

ప్రియాంక రెడ్డి( విక్టిమ్ గోప్యత కోసం ప్రభుత్వం దిశ అని పేరు మార్చినా అసలు పేరు వాడారు పవన్) అనే ఒక ఆడపడుచుని నలుగురు కామాంధులు , ఉన్మాదులు మానభంగం చేసి చంపే స్థాయికి వెళ్లారు . నేను అక్క చెల్లెళ్లతో పెరిగిన వాణ్ణి . మన ఆడబిడ్డల్ని సంరక్షించకపోతే 151 సీట్లు ఇచ్చి ప్రయోజనం ఏంటీ , దేనికి .

ఇది ఊహించని ఆరోపణ. హైదరాబాదులో చంపబడ్డ దిశా కు ఆంధ్రాలో వైసీపీ గెలిచినా 151 ఎమ్మెల్యేలకు ఏవిధంగా లంకె పెట్టారో విన్నవాళ్లకు అర్ధం కాలేదు. సరిహద్దులు దాటిన ఆరోపణలతో పవన్ అందరిని confuse చేశాడు. ఇవి పవన్ స్థాయికి తగ్గ ఆరోపణలు కావు.

Read Also: పోలీసుల అత్యుత్సాహం-రైతు నాయకుడి మీద దాడి

4 . మనుషుల్ని బతకనివ్వరు , యువతను ఊళ్ళల్లో ఉండనివ్వరు , ఊళ్ళకి ఊళ్ళు ఖాళీ చేయించండి , తెలుగు దేశం, జనసేన, కాంగ్రెస్ చెట్లని ఉంచకండి నరికేస్తారు .

ఫ్యాక్షన్ తీవ్రంగా నడిచిన 80వ దశకంలో కూడా ఇంత దారుణమైన పరిస్థితులు రాయలసీమలో లేవు. అసందర్భమైన అంశాలను, అపోహలను మాట్లాడి పవన్ ఏమి చెప్పదలుచుకున్నారో అర్ధం కాదు. చిరంజీవి పులివెందులలో ప్రసంగం మొదలు పెట్టి ఫాక్షన్ రాజకీయం అంటుండగానే భూమా నాగిరెడ్డి ప్రచారవాహనం దిగి పక్కకు వెళ్లి పోయాడు. ప్రచారం పూర్తయిన తరువాత తిరిగి వాహనం మీదికి వచ్చాడు.అప్పట్లో భూమా అనుచరుల ఆస్తుల మీద కాంగ్రెస్ వాళ్లు దాడులు చెయ్యలేదు, 2014లో వైసీపీ తరపున భూమా గెలిచినా టీడీపీ వాళ్ళు దాడులు చెయ్యలేదు.

1985-1991 మధ్య ధర్మవరం ప్రాంతంలో చీని చెట్లు నరుకున్నది నిజం. ముఠా కక్షలు కొనసాగినా ఎందరో పెద్దలు చేసిన ప్రయత్నంతో చీని చెట్లు నరుకోవటం,పంట కుప్పలు తగల పెట్టటం అందరు మానుకున్నారు. ఫ్యాక్షన్ తీవ్రంగా నడిచిన రోజుల్లో ముఠానాయకులు ఊళ్లు వదిలి వెళ్లారు కానీ వారి వర్గం మొత్తం ఊరు వదిలి వెళ్ళింది లేదు.ఏ సందర్భంలో కూడా ఆస్తులు లాక్కోవటం అన్నది జరగలేదు.

రాజకీయాల్లో శాశ్వత మిత్రులు,శత్రువులు ఉండరు. దానికి మీరే పెద్ద ఉదాహరణ. ప్రజారాజ్యం కాంగ్రెసులో విలీనం కావటం,2014లో టీడీపీ-బీజేపీ లతో జనసేన పొత్తు,మొన్న 2019లో కమ్యూనిస్టులతో జనసేన పొత్తు… పార్టీలే ఇలా అయితే గ్రామాలలో కార్యకర్తలు ఎప్పుడు ఈ పార్టీలో ఉంటారో ఎలా చెప్పగలం?మరి ఎందుకు మొత్తం రాయలసీమను అవమానపరుస్తూ చెట్లను నరుకుతారు ,ఊర్ల నుంచి వెళ్ళగొడతారు అనటం?
మొన్నటి ఎన్నికల్లో జనసేన తరుపున ధర్మవరం నుంచి పోటీ చేసిన చిలకం మధుసూదన్ రెడ్డి మీద ఉన్న ఆరోపణలు పవన్ కళ్యాణ్ మర్చిపోయినట్లున్నాడు.

5 .టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులే

తిరుమలలో నాకు దర్శనానికి రికమండేషన్లు కావాలిట . .మత రాజకీయాలు చేస్తున్నది హిందూ రాజకీయ నేతలే . మతాల మధ్య గొడవపెట్టేది విభజించి విడగొట్టేది హిందూ నాయకులే. ఇతర మతాల నేతలు ఇలాంటి పనులు చేయరు . టీటీడీలో అన్యమత ప్రచారం చేయిస్తోంది హిందువులే . హిందూ నాయకుల ప్రేరణ లేనిదే ఇలాంటివి జరగవు. తన చిన్నప్పటినుంచి హిందువులు మాత్రమే సెక్యులరిజాన్ని ఇబ్బంది పెడుతున్నారు . మిగతా మతాల వారు ఇలాంటి పనులు చేయరు. వీటి వెనుక బీజేపీ నాయకులు లేరు,వైసీపీ నాయకులోలేదా మరెవరు ఉన్నారో తెలియదు.

పవన్ చేగువేరా,ఫిడెల్ కాస్ట్రో,పుచ్చలపల్లి సుందరయ్య,జ్యోతిరావు పూలే,అంబేద్కర్ నుంచి మొదలు పెట్టి తిలక్,గుంటూరు శేషేంద్ర శర్మ కవిత్వం వరకు ఇప్పటి వరకు చెప్పిన సంగతులన్నీ ఒక్క మాటతో పక్కకు తన్నేశాడు .

ఇంగ్లీష్ మీడియం విద్యతో క్రైస్తవ మత వ్యాప్తి పెరుగుతుందని ఒక పద్దతి ప్రకారం బీజేపీ,టీడీపీ,ఆంధ్రజ్యోతి చేస్తున్న ఆరోపణలను తన భుజాల మీద మోస్తున్న పవన్ ఈ తాజా ఆరోపణలతో కమలం కాండంలోకి జొరబడ్డట్టు కనిపిస్తుంది.
హిందూమతం నాయకులే మాట రాజకీయాలు చేస్తున్నారు కానీ వారు బీజేపీ వాళ్ళు కాదు అనటంతోనే ఎవరిని సంతోషపెడుతుంది అర్ధమవుతుంది. ఒక వైపు పవన్ మరో వీఐపీ చేగువేరా బొమ్మలతో ఉన్న T-Shirt వేసుకునే పవన్ అభిమానులు ఈ ఆరోపణల మీద ఎలా స్పందిస్తారో చూడాలి.

Read Also: వై.యస్ వివేకా హత్య కేసు – పులివెందులకి సిట్ బృందం.

6 . నిజానికి మతం మార్చుకుంటే ఇంక కులం రాకూడదు

మీడియా ముందు జగన్ గారు నా మతం మానవత్వం, నా కులం మాట నిలబెట్టుకునే కులం అన్నారు. నిజానికి మతం మార్చుకుంటే ఇంక కులం అని రాకూడదు , రెడ్డి అనే కులం ఇంక రాకూడదు అంతే . ఏ కులం అయినా తీసుకోండి మన దౌర్భాగ్యం మతం మారినా కూడా కులం మారదు . క్రిస్టియానిటీలోకి వెళ్తే కులం రాకూడదు అంతే.

మన దేశంలో కొన్ని పదుల కోట్ల మంది , కొన్ని మతాలు మారారు . ఇస్లాం లోకి , క్రిస్టియానిటీలోకి , బౌద్ధం లోకి , రాధేశ్యాం లోకి ఇంకా అనేక గురు పరంపరలు ఏర్పాటు చేసిన మతాల్లోకి చాలా మంది మారారు . ఆ మతాలు వీళ్లకు పేర్లు మార్చలేదు. అలాంటి సాంప్రదాయం ఉన్నట్లు కూడా లేదు.

క్రైస్తవ మత ప్రచారకుల్లో అతధికులు జన్మతః హిందువులే. వాళ్లెవరు పేర్లు మార్చుకోలేదు.విదేశాల్లో హిందూ మతం పుచ్చుకున్న వాళ్ళు కూడా పేర్లు మార్చుకోలేదు. థామస్ రెడ్డి,మోజెస్ చౌదరి,ధనుంజయ శాస్త్రి కిలారి గోపాల్ నాయుడు (KA పాల్) లాంటి వారి పేర్లు మార్చుకోమని పవన్ డిమాండ్ చేస్తారా ? రాజకీయ పార్టీ పెట్టారు కాబట్టి ఈ విషయం మీద కోర్టుకు వెళ్లి పోరాడుతారా?లేక తన వాదన కేవలం జగన్ రెడ్డి మీదనేనా?

7 . నేనీరోజున మాట్లాడిన మాటలకి నన్నెవరైనా ప్రశ్నిస్తే (తిడితే) నేను రేప్పొద్దున సమాధానం చెప్తా వాటికి, అన్నిటికీ సమాధానం చెప్తా .

మీరు గత పదేళ్లలో బహిరంగ సభలో మైకు ముందు మాట్లాడటం , మీ పార్టీ వాళ్ళతో , అనుకూలురతో మీటింగులు నిర్వహించటం తప్ప ఏనాడైనా , ఎక్కడైనా, ఏ ఒక్కరి ప్రశ్నకి పవన్ సమాధానం చెప్పింది లేదు .ఇన్ని తీవ్రమైన,విద్వేషం తో కూడిన ఆరోపణలు చేసినా తరువాత సమాధానం చెప్పటానికి ఏముంటుంది. రాజకీయంగా పరస్పర ఆరోపణలు చేసుకోవటం తప్ప !

స్థూలంగా చూస్తే పవన్ రాయలసీమ పర్యటన ఫాక్షన్,జగన్ మతమే కేంద్రంగా కొనసాగుతుంది. పవన్ విసిరిన రాళ్లు రాజకీయ కొలనులో ప్రకంపనాలు సృష్టించలేదు కానీ పవన్ రాజకీయం పట్ల జనసేన సానుభూతిపరులలో స్పష్టత వస్తుంది.