సినీ నటుడిగా పరిచయమైన పవన్ కల్యాణ్‌లో ప్రజలు చాలా ఆదర్శభావాలు చూశారు. విప్లవ నాయకులు చేగువేరా, భగత్‌సింగ్ చిత్రాలు పవన్ సినిమాల్లో దర్శనమిస్తుండేవి. ఆవేశంలో విప్లవ వీరులను, ఆదర్శంలో వివేకానందుడి వంటి వారి సూక్తులను పవన్ పరిచయం చేస్తుండేవారు. అలాగే, సమాజంలో, రాజకీయాల్లో జరిగే ఘోరాలను, నేతల ప్రసంగాల వల్ల జరుగుతున్న కీడును కూడా కెమెరామన్ గంగతో రాంబాబు వంటి సినిమాల ద్వారా చూపించారు. ఈ క్రమంలో అన్యాయాలను ప్రశ్నించేందుకు అంటూ రాజకీయాలలోకి వచ్చారు. తొలినాళ్లలో పవన్ రాజకీయాలు ఆవేశంగా, ఆదర్శవంతంగానే సాగాయి. కానీ బీజేపీతో దోస్తీ తర్వాత పవన్ రాజకీయాల్లో మార్పు వచ్చిందా, ఆ పార్టీకి అనుకూలంగా తన పంథా మార్చుకుంటున్నారా, లేదా తన పంథాలోనే వెళ్తున్నారా? అనే అనుమానాలు తిరుపతిలో పవన్ వ్యాఖ్యల ద్వారా లేవనెత్తుతున్నాయి.
సాధారణంగా మతం, దైవం వంటి వాటి చుట్టూ రాజకీయాలు చేసే పార్టీగా బీజేపీకి పేరుంది. అందుకే దాన్ని కాషాయ పార్టీ అని కూడా అంటారు. తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికలో పోటీచేసే బీజేపీ అభ్యర్థి ప్రచారానికి వచ్చిన పవన్ కూడా ఇప్పుడు కాషాయ రంగు పులుముకున్నట్లుగా మాట్లాడారు. ఏపీలో దేవాలయాలపై వరుస దాడులు తెలిసిందే. దాని వెనుక కుట్రదారులను కూడా ప్రభుత్వం వెలుగులోకి తెస్తూనే ఉంది. జరిగిన నష్టాన్ని ఎప్పటికప్పుడు పూడ్చుతూ మతసామరస్యానికి భంగం కలగకుండా చర్యలు తీసుకుంది. ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉంది. కానీ తిరుపతిలో పవన్ మాట్లాడుతూ అధికార పార్టీపై విమర్శలు చేసే సందర్భంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. మళ్లీ అలజడులను సృష్టించేలా ఉన్నాయని పలువురు భావిస్తున్నారు. ‘‘150కు పైగా ఆలయాలు కూల్చారు. రాముడి తల నరికేశారు.’’ అంటూ మళ్లీ వివాదానికి ఆజ్యం పోసేలా మాట్లాడారు. తాను దేశాన్ని, ధర్మాన్ని నమ్మిన వ్యక్తినంటూ మనోత్మాదాన్ని రెచ్చగొట్టేవిగా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అందరూ ఆరాధ్యదైవంగా భావించే వెంకటేశ్వరుడికి కూడా రాజకీయాలు ఆపాదించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని పలువురు ఆధ్యాత్విక వేత్తలు విమర్శిస్తున్నారు.
‘‘చిన్న స్థాయి నుంచి వచ్చిన మోదీ దేశానికి ప్రధాని అయ్యారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా జరిగినప్పుడు ఇదే తిరుపతిలో జాతీయ నాయకత్వం మారాలి అని అందరం సంకల్పించాం. మోదీ ప్రధాని అయ్యారు. మళ్లీ ఇదే తిరుపతి నుంచి ఒక సంకల్పం ఇద్దాం. ఏపీ దశ, దిశా మారాలని కోరుకుందాం.’’ అని పవన్ ఈ సందర్భంగా మాట్లాడారు. రాష్ట్ర విభజన అడ్డగోలుగా మారిందన్న పవన్ విభజన సమయంలో బీజేపీ ఇచ్చిన ఏపీ స్పెషల్ స్టేటస్ హామీపై రెండు కళ్ల సిద్ధాంతాన్ని అనుసరించినప్పుడు మాట్లాడలేదేం అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని ఇటీవలి జరిగిన లోక్‌సభలో కేంద్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. కానీ, ఎన్నికలు జరుగుతున్న వేళ పుదుచ్చేరికి మాత్రం ప్రత్యేక హోదా హామీ ఇచ్చింది. దీనిపై పవన్ ఇప్పటి వరకూ మాట్లాడలేదు. ఏపీ దశ, దిశ మారాలని కోరుకుంటున్న పవన్ రాష్ట్రంలో కీలక పరిశ్రమ, ఆంధ్రుల ఆత్మ గౌరవమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని తగనమ్మేందుకు మిత్రపక్షం బీజేపీ ప్రభుత్వం చకచకా పావులు కదుపుతుంటే ఆందోళనలు చేసిన దాఖలాలు లేవు.
జాతీయ స్థాయి నాయకత్వానికి బాధ్యత అప్పగిస్తే, మనకు న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే తిరుపతి సీటు జనసేన వదులుకోవాల్సి వచ్చిందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ చెప్పారు. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో ఏపీకి న్యాయం కోసం కేంద్రాన్ని గట్టిగా ప్రశ్నించగలరా అనే అనుమానాలను పలువురు లేవనెత్తుతున్నారు. ఇలా పవన్ ప్రసంగం మొత్తం పరిశీలిస్తే వైసీపీపై విమర్శల కన్నా బీజేపీ విధానాలు, సిద్ధాంతాలకు అనుగుణంగా హిందూత్వం, మతోన్మాదం, కాషాయీకరణ ప్రధానాంశాలుగా సాగిందని పరిశీలకులు భావిస్తున్నారు. నేను ప్రజలకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంటానన్న పవన్ ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మళ్లీ అలజడులు, ఆ ప్రజల మధ్య చిచ్చుపెట్టేలా మాట్లాడారన్న విమర్శలూ వ్యక్తమవుతున్నాయి.