iDreamPost
iDreamPost
రెండు పార్టీల మధ్య పొత్తు కుదిరినపప్పుడు, కొన్ని పార్టీలు కలిసి కూటమిగా ఏర్పడినప్పుడు.. ఉమ్మడిగా పోటీ, ప్రచారం చేయడం, మిత్రపక్షాల అభ్యర్థులకు ఓట్లు వేయమని ప్రజలకు విజ్ఞప్తి సాధారణంగా అన్ని ఎన్నికల్లోనూ జరిగేదే. కానీ అవేవీ లేకుండానే మేం పోటీలో ఉంటే మాకే ఓట్లు వేయండి.. మేం లేని చోట్ల ఆ పార్టీకి వేయండి.. అని ఒకే నాయకుడు రెండు పార్టీల తరఫున ప్రజలకు పిలుపు ఇవ్వడం బహుశా ఎక్కడా జరిగి ఉండదు.
కానీ జనసేన అధినేత స్టయిలే వేరు కదా.. తాజాగా ప్రజలకు ఆయన చేసిన విజ్ఞప్తి కూడా అలాగే ఉంది. ప్రస్తుతం జరుగుతున్న మినీ స్థానిక ఎన్నికల్లో జనసేన పోటీలో ఉన్న ప్రాంతాల్లో వారికి ఓటు వేయమని కోరడం తప్పులేదు. పార్టీ అధినేతగా ఆ హక్కు ఆయనకు ఉంది. జనసేన పోటీలో లేని చోట్ల మాత్రం బీజేపీ అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరడమే విడ్డురంగా ఉంది. పేరుకు బీజేపీ మిత్రపక్షమే అయినా ఈ ఎన్నికల్లో ఆ పార్టీతో జనసేన సీట్ల సర్దుబాటు చేసుకోలేదు. ఎవరికి వారుగా పోటీ చేశారు. పైపెచ్చు ఆకివీడు లాంటి పలు ప్రాంతాల్లో బీజేపీని కాదని టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అలాంటప్పుడు జనసేన లేదా బీజేపీలకే గంపగుత్తగా ఓట్లు వేయమని కోరే హక్కు పవన్ కు ఎక్కడిదన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాను పొత్తు ధర్మాన్ని పాటించరు గానీ.. ప్రజలు మాత్రం పొత్తు ధర్మం ప్రకారం ఓట్లు వేయాలని పవన్ కోరడం విడ్డురంగా ఉందంటున్నారు.
Also Read : Uttarandra MLC- ఉత్తరాంధ్రపై పదవుల జల్లు కురిపించిన జగన్
ఒక్కో ఎన్నికల్లో ఒక్కో తీరు
జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచీ పవన్ ఒక స్థిరమైన రాజకీయ విధానం అనుసరించడం లేదు. సినిమాల్లో ఆయన ఆలోచనలకు ఒక లెక్క ఉందేమోగానీ.. రాజకీయాల్లో మాత్రం లెక్కాపత్రం లేని వ్యూహాలతో అందరినీ గందరగోళంలోకి నెట్టేస్తున్నారు. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆయనకే తెలియదు. 2014 ఎన్నికల్లో కొత్తగా పార్టీ పెట్టాం కనుక పోటీ చేయడం లేదంటూ టీడీపీ, బీజేపీలకు మద్దతు ఇచ్చారు. గత ఎన్నికలకు ఏడాది ముందు ఆ రెండు పార్టీలకు రామ్ రామ్ చెప్పేసి.. అనూహ్యంగా రాష్ట్రంలో ఉనికిలో లేని బహుజన సమాజ్ పార్టీతో , అదే సమయంలో వామపక్షాలతో జత కట్టారు. 2019 ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం ఆరు నెలల్లోనే వామపక్షాలకు, బీఎస్పీకి బై చెప్పేశారు. సాధారణంగా పార్టీలు ఎన్నికలకు కొన్నాళ్ల ముందు లేదా ఫలితాల అనంతరం పొత్తులు, కూటములు కడతాయి. కానీ పవన్ మాత్రం దాదాపు నాలుగేళ్ల ముందే బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. 2024 ఎన్నికల్లో కలసి పోటీ చేయడం, అంతవరకు ప్రజాసమస్యలపై ఉమ్మడిగా పోరాడాలని ఒప్పందం కుదుర్చుకున్నారు. కానీ ఒక్క తిరుపతి ఉప ఎన్నికలో తప్ప అది ఎప్పుడూ ఎక్కడా అమలు కాలేదు. ఈ ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ, ఇటీవల బద్వేలు ఉప ఎన్నికల్లోనూ ఎవరి దారి వారిదన్నట్లు రెండు పార్టీలు వ్యవహరించాయి.
అప్పుడలా.. ఇప్పుడిలా..
బద్వేలు ఉప ఎన్నికలో సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థిని పోటీకి పెట్టడం లేదని పవన్ ప్రకటించారు. కానీ మిత్రపక్షమైన బీజేపీని మాత్రం నిలువరించలేకపోయారు. పైగా మిత్రపక్షం కనుక బీజేపీ తరఫున జనసైనికులు ప్రచారం చేస్తారని నాదెండ్ల మనోహర్ ప్రకటించి విస్మయపరిచారు. మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ఇచ్చి బీజేపీకి దూరం అవుతానన్న కలరింగ్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ప్రస్తుత మినీ స్థానిక ఎన్నికల్లో జనసేన, బీజేపీ కలిసి పోటీ చేయకపోయినా మీరు మాత్రం పొత్తు ఉన్నట్లే భావించి రెండు పార్టీలకు ఓట్లు వేయమని ప్రజలకు విజ్ఞప్తి చేయడం విశేషం. ఇది ఏ రకమైన పొత్తు ధర్మమో ఆయనకే తెలియాలి.
Also Read : Telangana Congress -కాంగ్రెస్ మారదేంటయ్యా..!?