iDreamPost
iDreamPost
భారతీయ వివాహ వ్యవస్థకున్న గొప్పదనం ప్రపంచంలో ఇంకెక్కడా లేదన్న మాట వాస్తవం. అందులోనూ జీవిత భాగస్వాములు పరస్పరం చెరిసగం పంచుకుంటే ఎంత గొప్పగా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. అయితే దీని ప్రాముఖ్యత తెలియక కొందరు యువత పెళ్లి అనే ప్రక్రియను తేలిగ్గా తీసుకుంటున్న దాఖలాలు ఎన్నో చూస్తున్నాం. ఇటీవలి కాలంలో విడాకులు, సహజీవనాలు, బ్రేకప్పులు చాలా ఎక్కువయ్యాయి. ఈ పాయింట్ మీద భార్యాభర్తల అనుబంధంలోని ఔన్నత్యాన్ని చూపించే సినిమా 1998లో వచ్చింది. అదే పవిత్ర బంధం. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో గీతా చిత్ర ఇంటర్నేషనల్ బ్యానర్ పై దీన్ని రూపొందించారు.
అది వెంకటేష్ కెరీర్ కాస్త ఎగుడుదిగుడుగా సాగుతున్న సమయం. 1993లో ‘అబ్బాయిగారు’ హిట్టయ్యాక సూపర్ పోలీస్, ముద్దుల ప్రియుడు, పోకిరిరాజా, హిందీ తక్దీర్ వాలా వరసగా ఫెయిలయ్యాయి. ‘ధర్మచక్రం’ సక్సెస్ కాగా ‘సాహసవీరుడు సాగరకన్య’ ఎబో యావరేజ్ గా నిలిచింది. ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ ఘన విజయం సొంతం చేసుకోగా ‘సరదా బుల్లోడు’ డిజాస్టర్ మళ్ళీ ఆలోచనలో పడేసింది. తన నుంచి ఫ్యామిలీ ఆడియన్స్ కోరుకుంటున్నదేంటో వెంకీకి అర్థమయ్యింది. అప్పుడు రచయిత భూపతిరాజా చెప్పిన కథే ‘పవిత్ర బంధం’. హీరో క్యారెక్టరైజేషన్లో రిస్క్ అనిపించినా సబ్జెక్టులో ఉన్న దమ్ము చూశాక ఎక్కువ ఆలోచించలేదు. షూటింగ్ చకచకా పూర్తయ్యింది. 1996 అక్టోబర్ 17 సినిమా విడుదలయ్యింది. ఫ్యాన్స్ తో మొదలైన ఓపెనింగ్స్ ఫ్యామిలీస్ ని క్యూ కట్టించింది.
విదేశాల నుంచి వచ్చిన విజయ్(వెంకటేష్) తన తండ్రి కంపనీలో పని చేసే మధ్యతరగతి ఉద్యోగి రాధ(సౌందర్య)ను ఏడాది సహజీవనం చేశాక కలిసి ఉండాలా వద్దా అని నిర్ణయించుకునే ఒప్పందం మీద పెళ్లి చేసుకుంటాడు. మధ్యలో యాక్సిడెంట్ జరిగితే చావు అంచుల దాకా వెళ్లిన విజయ్ ని రాధ బ్రతికించుకుంటుంది. కానీ సంవత్సరం కాగానే విజయ్ విడిపోతాడు. ఆ తర్వాత అసలు కథ ప్రారంభమవుతుంది. సౌందర్య పాత్రను ముత్యాల సుబ్బయ్య ఆవిష్కరించిన తీరు కుటుంబ ప్రేక్షకులను విపరీతంగా మెప్పించింది. ముందు నిర్లక్ష్యంగా ఉండి తర్వాత మారిపోయే పాత్రలో వెంకీ అద్భుతంగా నటించాడు. కీరవాణి సంగీతం చాలా ప్లస్ అయ్యింది. ముఖ్యంగా అపురూపమైనదమ్మ ఆడజన్మ పాటకు సిరివెన్నెల సాహిత్యం దాన్నో క్లాసిక్ గా మార్చాయి. మూడు నంది అవార్డులు సొంతం చేసుకుంది. ఏకంగా ఆరు భాషల్లో రీమేక్ చేసేనాథ స్థాయిలో పవిత్ర బంధం మర్చిపోలేని విజయాన్ని సొంతం చేసుకుంది.