టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పొలిటికల్ స్క్రీన్ మీద మాత్రం పవర్ చూపించలేకపోయారు. 2009లో ప్రజారాజ్యం కోసం యువరాజ్యాధినేతగా రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి ఆయన పెర్మార్మెన్స్ చాలా పేలవంగా కనిపిస్తోంది. ప్రజారాజ్యం అంతలోనే అంతర్ధానం కావడంతో ఆ తర్వాత సొంతంగా పార్టీ పెట్టుకున్నారు. కానీ పోటీ చేయడానికి కూడా వెనుకాడారు. తన పార్టీ పదవుల కోసం కాదు కేవలం పాతికేళ్ల భవిష్యత్తు కోసమేననే నినాదాలు ఇచ్చారు. కానీ తీరా చూస్తే 2019లో తానే సీఎం కాబోతున్నట్టు కలలు కన్నారు. తనను ఎదురించే వారే లేరని భారీ ఉపన్యాసాలతో బరిలో దిగారు. కానీ తీరా చూస్తే ఆయన పరిస్థితి పేలవంగా కనిపించింది. జనసేన అధినేతగా ఆయనే రెండు చోట్లా ఓటమి పాలయ్యారు. అన్నయ్య పాలకొల్లులో పరాజయం పాలయితే తమ్ముడు గాజువాక, భీమవరం లో కూడా బోణీ కొట్టలేకపోవడం విశేషంగా మారింది.
పవన్ కళ్యాణ్ ప్రత్యక్షంగా పోటీ చేసిన ఎన్నికలు ముగిసి రెండున్నరేళ్లవుతున్నప్పటికీ ఆపార్టీ పట్టాలకెక్కిన దాఖలాలు లేవు. సినిమా ఫ్యాన్స్ పెట్టుబడిగా రంగంలోకి వచ్చిన పవన్ కి అభిమానులున్నప్పటికీ అవగాహనా రాహిత్యం, రాజకీయంగా అడుగులు తడబడడంతో పుంజుకునే అవకాశాలు చేజారిపోతున్నాయి. వాస్తవంగా ప్రస్తుతం ఏపీలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ తర్వాత అంతో ఇంతో ఇమేజ్ ఉన్న నాయకుడు పవన్ కళ్యాణ్ మాత్రమే. సొంతంగా నిర్ణయాలు తీసుకుని, ముందే ప్రకటించినట్టు పూర్తిగా రాజకీయాలకు పరిమితమయితే వకీల్ సాబ్ వ్యవహారం వేరుగా ఉండేది. కానీ రెండుపడవల మీద ప్రయాణంతో పవన్ రెంటికీ చెడ్డ రేవడిలో తయారవుతున్నట్టు కనిపిస్తోంది.
రాజకీయంగా సొంత పార్టీని ఉత్తేజపరచలేకపోతున్నారు. అదే సమయంలో మిత్రపక్షం అంటూ జట్టుగట్టిన బీజేపీని మెప్పించలేకపోతున్నారు. చివరకు ఇంతకాలంలో ఒక్కసారి కూడా మోడీ దర్శన భాగ్యం దక్కించుకోలేకపోయారంటే పవన్ పరిస్థితి ఏమిటో తేటతెల్లమవుతోంది. చివరకు తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారానికి కూడా పూర్తిగా సహకరించకపోవడం కమల దళంతోనూ సఖ్యత చెడిపోయేందుకు కారణమయ్యింది. ఇటీవల ఒంటరిగా కొన్ని కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. కానీ అవి కూడా అరకొరగా సాగుతున్నాయి. జనసేన ప్రభావం పేలవంగా కనిపించేందుకు ఆ పిలుపులు కారణమవుతున్నాయి.
రాజకీయంగా ఓటమి తర్వాత మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉన్నప్పటికీ ఏపీకి గెస్ట్ పొలిటిషియన్ మిగిలిపోయారు. చంద్రబాబు కూడా హైదరాబాద్ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్న నేతగా మారగా పీకే మాత్రం పూర్తిగా అక్కడికే పరిమితమయ్యారు. దాంతో నాదెండ్ల మనోహర్ లాంటి ప్రజా పునాది లేని నేతలనే జనసేనకు దిక్కయ్యారు. దానికి తగ్గట్టుగానే ఇటీవల కమిటీలు, అవీ ఇవీ అని హడావిడి చేసినా క్షేత్రస్థాయిలో పెద్దగా ప్రభావం కనిపించడం లేదు. పైగా పేలవమైన పిలుపుల మూలంగా స్పందనలేకపోవడంతో జనసేన శ్రేణులను మరింత నిరాశలో ముంచుతున్నాయి.
జగన్ మీద ఆక్రోశమే తప్ప అవగాహనతో ముందుకెళదామనే ఆలోచన పవన్ లో ఉన్నట్టు కనిపించడం లేదు. ముఖ్యంగా జగన్ కి ధీటుగా నాయకుడిగా ఎదిగే అవకాశాలు ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ మాత్రం చంద్రబాబు శ్రేయస్సు కీలకం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం సర్వత్రా ఉంది. సొంతంగా నాయకుడిగా ఎదిగాలనే లక్ష్యం వదిలేసి టీడీపీని బలపరచడమే కర్తవ్యంగా తీసుకున్నట్టు భావిస్తున్నారు. త్వరలో మళ్లీ టీడీపీతో జతగట్టి వచ్చే ఎన్నికలకు సిద్ధం కావాలని ఆయన ఆలోచనలో ఉన్నారనే ప్రచారం దానికి ఆధారం అవుతోంది.
ఇప్పటికే ఓసారి టీడీపీతో జతగట్టి వదిలేసి, ఆతర్వాత కమ్యూనిస్టులతో కలిసి సాగినా, వారిని సైతం లెఫ్ట్ చేసి, మళ్లీ రైట్ పార్టీ బీజేపీని భుజానికెత్తుకున్నా ఇప్పుడు భూమి గుండ్రంగా ఉందన్నట్టు టీడీపీ దగ్గరకి చేరే ప్రయత్నం చేయడం మాత్రం విస్మయకరంగా ఉంది. ఏపీలో చంద్రబాబు కి ఇలాంటి పేరు ఉంది. ఒక్కో ఎన్నికల్లో ఒక్కో పార్టీతో కలిసి సాగుతారనే అభిప్రాయం ఉంది. ఆయన సరసన పవన్ కళ్యాణ్ కూడా చేరిపోయినట్టు కనిపిస్తోంది
ఈ పరిస్థితుల్లో ఒకనాటి యువరాజ్యం పేరుతో పొలిటికల్ స్క్రీన్ ఎక్కిన పవన్ కి పుష్కర కాలం దాటినా పొలిటికల్ పాఠాలు అబ్బలేదని అర్థమవుతోంది. దాంతో ఆయన ఫ్యూచర్ పూర్తిగా ప్రశ్నార్థకం అవుతోంది. ఒకనాటి యువనేత కాస్తా ఇప్పుడు వయసు మీరుతున్నా ప్రజలను ఆకట్టుకునే అవగాహన, నేర్పు సాధించలేకపోవడం సందేహాస్పదంగా మారింది. గాలివాటు రాజకీయాలు తప్ప నిలకడలేమితనం నిలువునా ఉందనే వాదన వినిపిస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన సొంత సామాజికవర్గంలోని యువత కూడా క్రమంగా చేజారిపోతున్నట్టు స్పష్టమవుతోంది. ఇది జనసేన పయనాన్ని ప్రభావితం చేయడం ఖాయం. ఆపార్టీకి కష్టాలు తీరే మార్గం కనిపించకపోవడం విశేషం.