Idream media
Idream media
పిఏని పిలిచాడు పవన్ కళ్యాణ్
“అర్జెంట్‌గా నా కోసం ఒక రైల్వేస్టేషన్ ఖాళీ చేయించాలి” అని అడిగాడు.
“కుదరదు సార్, ఇది అత్తారింటికి దారేది సినిమా కాదు. రైల్వేవాళ్లు పర్మిషన్ ఇవ్వరు” చెప్పాడు పిఏ.
“ప్రతిదానికి ఓ రేటు ఉంటుంది”
“టికెట్‌కి రేటు ఉంటుంది కానీ, స్టేషన్‌కి ఉండదు సార్”
“అర్జెంట్‌గా నా ఫ్యాన్స్‌కి క్రమశిక్షణ నేర్పించాలి”
“ఫ్యాన్స్, క్రమశిక్షణ, ఈ రెండూ వేర్వేరు విషయాలు. క్రమశిక్షణ ఉన్నవాడెవడూ మీలో ఫ్యాన్‌కాడు, ఫ్యాన్స్‌కి క్రమశిక్షణ ఉండదు”
“అది నేర్పడానికే రైల్వేస్టేషన్”
“వాళ్లకి పోలీస్‌స్టేషన్ అవసరం కానీ, రైల్వేస్టేషన్ ఎందుకు సార్?”
“జగన్‌రెడ్డి పోలీసులని నేను నమ్మను”
“మంచిది, అభిమానుల్నే నమ్మండి. మిమ్మల్ని చూస్తుంటే నాకో కథ గుర్తుకొస్తోంది. వెనకటికి ఒక రాజు కోతుల్ని పెంచుకున్నాడు. ఒకరోజు రాజు నిద్రపోతూ కోతిని కాపలా కాయమన్నాడట. మీ మీద ఈగ కూడా వాలనివ్వను అని చెప్పిందట కోతి. నిద్రపోతున్న రాజు ముక్కు మీద ఈగ వాలిందట. ప్రభు భక్తితో కోతి కత్తితో ఒక్కటేసింది. రాజు ముక్కు తెగిపోయింది”
“ఇదంతా నాకెందుకు చెబుతున్నావ్” పవన్‌కి కోపం వచ్చింది.
“మీ ముక్కు తెగకుండా ఉండడానికి” చెప్పాడు పిఏ.
“నాకు స్టేషన్ కావాలి, ఒక్క ప్రయాణీకుడు కూడా ఉండకూడదు”
“మీ అభిమానులు వస్తే వాళ్లు చేసే అల్లరికి అందరూ పారిపోతారు” కట్ చేస్తే ….
ఖాళీగా ఉంది స్టేషన్. పవన్, తన అభిమానుల కోసం వెయిటింగ్.
బయట పెద్ద హోరు వినిపించింది.
“బయట జల్లికట్టు ఏమైనా జరుగుతోందా?” కంగారుగా అడిగాడు పవన్.
“మీ అభిమానులు వస్తున్నారు జాగ్రత్త, మిమ్మల్ని కూడా కుమ్మేయగలరు”
దూసుకొస్తున్న అభిమానుల్ని చూసి “క్రమశిక్షణ పాటించండి” అని అరిచాడు పవన్.
ఎవరూ పట్టించుకోలేదు. ఒకరిద్దరు పవన్ మీద పడితే, పిఏ తోసేశాడు.
“చెబితే విన్నారా? వాళ్లకి డిసిప్లయిన్ నేర్పడమంటే, మన పార్టీని పవర్‌లోకి తెచ్చినంత కష్టం. సాధ్యం కాదు”
“నేను అనుకుంటే ప్రతిదీ సాధ్యమే”
“అవును, రెండుచోట్ల ఓడినప్పుడే తెలిసింది”
“మీ వల్లే నేను ఓడిపోయాను” అన్నాడు పవన్.
“వాళ్లలో సగం మందికి ఓటు హక్కులేదు. ఓడిపోక ఏమవుతాం” అన్నాడు పిఏ.
“అసలు క్రమశిక్షణ అంటే ఏంటో తెలుసా?” అన్నాడు పవన్.
“ఇప్పటికే సగం స్టేషన్ ధ్వంసం చేశారు. మిగిలింది కూడా ధ్వంసం చేస్తే రైల్వే పోలీసులు వచ్చి నేర్పిస్తారు”
“నువ్వు నాకు పిఏవా, జగన్ కోవర్టువా?”
“సినిమా అంటే భ్రమ, రాజకీయమంటే వాస్తవం. మీరు భ్రమల్లోంచి వాస్తవంలోకి వస్తేనే రాజకీయం చేయగలరు. అప్పటి వరకూ డైలాగ్‌లు చెప్పడం తప్ప ఇంకేం చేయలేరు” అని వెళ్లిపోయాడు పిఏ.
పవన్ స్పీచ్ వినక ముందే, స్టేషన్‌ని ఇరగదీశారు ఫ్యాన్స్.