iDreamPost
iDreamPost
తొలిసారిగా సార్వత్రిక ఎన్నికల బరిలో దిగి చతికిలపడిన పవన్ కళ్యాణ్ ని పరాజయం తాలూకా ప్రభావం వెంటాడుతున్నట్టు కనిపిస్తోంది. తాజాగా మండపేటలో జరిగిన సమావేశంలో ఆయన తన ఓటమికి కారణం ఏంటో చెప్పారు. ఆ సమయంలో ఆయన కార్యకర్తలను నిందించడం విస్మయకరంగా కనిపిస్తోంది జనసైనికులను సేనాని నిందించిన తీరు విడ్డూరంగా ఉంది. నాయకుడంటే గెలుపయినా, ఓటమి అయినా తనదే బాధ్యతగా తీసుకోవాలి. బాధ్యత తీసుకున్న తర్వాత దానికి అనుగుణంగా వ్యవహరించాలి. కానీ పవన్ కళ్యాణ్ ధోరణి దానికి భిన్నంగా ఉన్నట్టు స్పష్టమయ్యింది.
తాను సీఎం కావాలనుకుంటే ఎవరు అడ్డుకోగలరూ అంటూ ప్రశ్నించిన పవన్, చివరకు తన పార్టీ కార్యకర్తలే తనను ఓడించారంటూ వాపోవడం ద్వారా నాయకుడిగా తన చేతగానితనాన్ని చాటుకున్నట్టయ్యింది. పార్టీ పరాజయానికి బాధ్యతను పార్టీ శ్రేణులపైకి నెట్టేసి, తాను శుద్దపూసనని ఆయన చెప్పుకోవడం చివరకు జనసేన కార్యకర్తలకు కూడా మింగుడుపడడం లేదు.
చంద్రబాబు తరహాలోనే..
టీడీపీ అధినేతకు కూడా ఇలాంటి అలవాటు ఉంది. అధికారంలో ఉండగా వైఫల్యాలను అధికారులపైకి నెట్టడం ఆయనకు పెద్ద అలవాటు. విపక్షంలో ఉన్న కాలంలో ఎవరో ఒక నాయకుడిని నిందించడం ద్వారా తాను సమర్థుడే అయినప్పటికీ, ఫలానా వారి కారణంగానే ప్రయత్నాలు ఫలించడం లేదనే అభిప్రాయం అందరిలో కలిగించేందుకు సిద్ధపడతారు. సరిగ్గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే ధోరణిలో సాగడం విశేషం. తన వైఫల్యాలకు, విధాన లోపాలకు, పార్టీ నిర్మాణం పట్ల శ్రద్ధచూపని తీరుకి ఎన్నికల ఫలితాలు దర్పణం పట్టగా, దానికి పార్టీ కార్యకర్తల క్రమశిక్షణ కారణం అంటూ పవన్ చిత్రీకరించిన తీరు చాలామందిని ఆశ్చర్యపరుస్తోంది.
Also Read:క్రమశిక్షణ లేని మీవల్లే ఒడిపోయా – పవన్ కళ్యాణ్
క్యాడర్ లోపాలుంటే సరిదిద్దాల్సింది ఎవరు
ఏ పార్టీకయినా కార్యకర్తలే బలం. కార్యకర్తల శ్రమతోనే ఏ నాయకుడయినా విజయతీరాలకు చేరగలరు. అలాంటి కార్యకర్తలను సక్రమ మార్గంలో నడిపించాల్సిన బాధ్యత నాయకత్వానిదే. సరైన దిశలో పార్టీ శ్రేణులను నడిపించడం ద్వారా వారికి మార్గనిర్దేశం చేయడం కూడా నాయకత్వ లక్షణాల్లో కీలక భాగం. దాని మీద పవన్ కళ్యాణ్ ఏం చేశారన్నది ప్రశ్నార్థకం. పార్టీ స్థాపించి ఏడేళ్లు గడుస్తున్నా ఒక్కసారి కూడా పార్టీ కార్యకర్తల మీద శ్రద్ధ పెట్టిన దాఖలాలే లేవు. పైగా వివిధ సభలో సందర్భంగా సీఎం, సీఎం అంటూ అరుస్తున్న కార్యకర్తలను వారించకుండా, వారిని మరింతగా ప్రోత్సహించిన అనుభవం కూడా పవన్ దే. మీరు పదే పదే అలా అంటుంటే అది తథాస్తు దేవతల ద్వారా నాకు సీఎం హోదా దక్కుతుందని కూడ ఆయన పలు సందర్భాల్లో అన్నారు. ఇప్పుడు మళ్లీ అలా అనడం, అరవడం వల్లే తాను ఓడిపోయానంటూ వాపోతున్నారు.
జనసైనికులకు ఇరు వైపులా వాయింపే..!
జనసేన విధానాలు, అధినేత వ్యాఖ్యానాలతో ఇప్పటికే ఆపార్టీ కార్యకర్తలకు తలవంపులు తప్పడం లేదు. ప్రజలు కూడా చీత్కరించడంతో విపత్కర పరిస్థితుల్లో జనసేన సాగుతోంది. అలాంటి సమయంలో కూడా పార్టీ కోసం అనేక మంది త్యాగాలు చేస్తున్నారు. యువత అనేకమంది సొంత డబ్బులు ఖర్చు చేసి, సమయం ఇచ్చి అధినేత కోసం ఎంత కష్టమయినా ఓర్చుకుంటున్నారు. సహనంతో సాగుతున్నారు. ఇతర పార్టీ శ్రేణులు ఎంత ఎద్దేవా చేస్తున్నా అధినేతను సమర్థిస్తూ వస్తున్నారు. అలాంటి సమయంలో, ఓటమి తర్వాత కూడా జనసేన స్వరం వినిపించే ప్రయత్నం చేస్తున్న వారిని బహిరంగంగానే నిందించడం ద్వారా పవన్ ఏం సాధిస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. అన్నీ మానుకుని తనకోసం వస్తున్న వారి మీద విమర్శలు చేయడం ద్వారా ఇంటా, బయటా జనసైనికులకు వాయింపే అన్నట్టుగా మారింది.
పవన్ చేతగానితనమేనా ఇది…
పవన్ కళ్యాణ్ తన పార్టీని అభివృద్ధి చేసుకోవాలంటే ముందు క్యాడర్ ని సరిదిద్దుకోవాలి. దానికి అధినేతలో చిత్తశుద్ధి చాలా అవసరం. కనీసం పార్టీ కార్యకర్తలకు తగిన నాయకత్వాన్ని నిర్దేశించాలి. కమిటీలు ఏర్పాటు చేసి, వారిని కదలించడానికి తగిన శ్రద్ధ పెట్టాలి. ఎవరికి వారే అన్నట్టుగా వదిలేయడం ద్వారా పార్టీకి తగిన దిశానిర్దేశం చేయలేని పరిస్థితి కారణంగా జనసేనలో గందరగోళం కనిపిస్తోంది. అదే సమయంలో క్యాడర్ కి తగిన శిక్షణ ఇవ్వడం ద్వారా, వారి అవగాహన, ఆలోచన పెంపొందించే ప్రయత్నం జరగాలి. ఏపార్టీకి లేనట్టుగా పవన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతున్న వారిని సంసిద్ధులు చేసుకోవాలి. అలాంటి ప్రయత్నం ఇన్నాళ్ళుగా చేయలేని అధిష్టానం తన చేతగానితనాన్ని, క్షేత్రస్థాయి కార్యకర్తలపై నెట్టడం ద్వారా సాధించేదేమీ ఉండదని తెలసుకోవాలి. అది కూడా నేర్చుకోకపోతే పవన్ కి పార్టీ కార్యకర్తలు దూరం కావడం ఖాయం. ఇన్నాళ్లుగా ఆయన మీద విశ్వాసం ఉంచిన వారు కూడా వేగంగా వదిలిపోతారని చెప్పవచ్చు.