గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తూర్పుగోదావరి జిల్లాలోని 19 అసెంబ్లీ స్థానాల్లో నాలుగుచోట్ల మాత్రమే తెలుగుదేశం పార్టీ గెలవగా పరిషత్ ఎన్నికల్లో అక్కడ కూడా బోల్తాపడింది. ఓటమి భయంతో ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించినా స్థానికంగా అభ్యర్థులు మాత్రం పోటీపడ్డారు. కొన్నిచోట్ల జనసేన పార్టీతో అనధికార పొత్తు పెట్టుకున్నారు. గత ఎన్నికల్లో రాజమహేంద్రవరం సిటీ, రూరల్, మండపేట, పెద్దాపురం నియోజకవర్గాల్లో టిడిపి గెలిచింది.
ఇదీ పరిస్థితి..
కార్పొరేషన్ కావడంతో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో పరిషత్ ఎన్నికలే జరగలేదు. రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గంలోని చాలా గ్రామాలు కార్పొరేషన్‌లో విలీనం చేసే ప్రతిపాదన ఉన్నందున ఒక్క కడియం మండలంలోనే ఎన్నికలు జరిగాయి. కడియం జెడ్పీటీసీ స్థానం జనసేన గెలుచుకుంది. 22 ఎంపీటీసీ స్థానాలకు రెండుచోట్ల ఏకగ్రీవం కాగా ఒకటి వైఎస్సార్ సీపీ, ఒకటి జనసేన గెలుచుకున్నాయి. 20 చోట్ల ఎన్నికలు జరిగాయి. 8 చోట్ల వైఎస్సార్ సీపీ, 4 స్థానాల్లో టీడీపీ, 8 చోట్ల జనసేన గెలిచాయి. ఏకగ్రీవంగా గెలిచిన జనసేన అభ్యర్థి మృతి చెందడంతో అక్కడ మళ్లీ ఎన్నిక నిర్వహించవలసి ఉంది.
మండపేట నియోజకవర్గంలో మూడు జెడ్సీటీసీ స్థానాలు స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. మండలాల వారీగా మండపేట మండలంలో 22 స్థానాలకు ఒకటి ఏకగ్రీవంగా టీడీపీ గెలిచింది. 21 చోట్ల ఎన్నికలు జరిగాయి. 20 చోట్ల వైఎస్సార్ సీపీ, ఒక చోట టీడీపీ విజయం సాధించాయి. రాయవరం మండలంలోని 19 స్థానాలకు 16 వైఎస్సార్ సీపీ, 2 టీడీపీ, ఒకటి జనసేన సాధించాయి. కపిలేశ్వరపురం మండలంలో 19 స్థానాలకు అభ్యర్థి మరణంతో ఒకచోట ఎన్నిక నిర్వహించలేదు. ఇక్కడ 15 చోట్ల వైఎస్సార్ సీపీ, రెండు జనసేన, ఒకటి టీడీపీ గెలిచాయి.
పెద్దాపురం నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీ స్థానాలు వైఎస్సార్ సీపీ గెలుచుకుంది. మండలాల వారీగా పెద్దాపురంలో 21, స్థానాలకు 17 వైఎస్సార్ సీపీ, ముగ్గురు ఇండిపెండెంట్లు గెలిచారు. ఒకచోట కౌంటింగ్ వాయిదా పడింది. సామర్లకోట-23 స్థానాలకు వైఎస్సార్ సీపీ 22 చోట్ల, జనసేన ఒక స్థానం గెలిచాయి.
Also Read : రెండు జిల్లాల పార్టీగా మిగిలిన జనసేన, అక్కడ కూడా అంతంతమాత్రమే
రాజప్ప, వేగుళ్లకు అవమానం..
మాజీ హోం మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దాపురం నియోజకవర్గంలో టీడీపీ ఒక్క స్థానం కూడా గెలవకపోవడం గమనార్హం. మండపేట నియోజకవర్గంలో మూడు జడ్పీటీసీలను వైఎస్సార్ సీపీ గెలుచుకోగా ఎంపీటీసీ స్థానాల్లో ఉనికి నిలుపుకోవడం టీడీపీకి కష్టమైంది. సిటింగ్ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావుకు ఇది రెండోసారి జరిగిన అవమానంగా భావించాలి. మునిసిపల్ ఎన్నికల్లో కూడా ఇక్కడ వైఎస్సార్ సీపీ ఘన విజయం సాధించింది. ఇలా గత సార్వత్రిక ఎన్నికల్లో గెలిచిన చోట్ల తెలుగుదేశం డీలా పడగా వైఎస్సార్ సీపీ అక్కడ కూడా జెండా ఎగురవేసి తనకు తిరుగులేని ప్రజాదరణ ఉందని రుజువు చేసుకుంది.
యనమల స్వగ్రామంలో టిడిపి ఓటమి..
యనమల రామకృష్ణుడు స్వగ్రామం ఏవీ నగరంలో టీడీపీ కుప్పకూలిపోయింది. అక్కడ యనమల కుటుంబానికే చెందిన యనమల సూర్యారావు(వరహాలు) 1240 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
వైఎస్సార్ సీపీకి బ్రహ్మరథం
తూర్పుగోదావరిలో పరిషత్ ఎన్నికల్లో ప్రజలు వైఎస్సార్‌సీపీకి బ్రహ్మరథం పట్టారు. ఏకపక్ష గెలుపుతో జిల్లాలో వైఎస్సార్‌సీపీ ఒక ప్రభంజనమే సృష్టించింది. జిల్లా పరిషత్ పీఠాన్ని వైఎస్సార్‌సీపీ అధిష్టించడం ఖాయమైపోయింది. మొత్తం 61 జడ్పీటీసీ స్థానాలకు 59 వైఎస్సార్ సీపీ గెలుచుకోగా జనసేన, టీడీపీ చెరోచోట గెలిచాయి.
జిల్లాలోని దాదాపు అన్ని మండల పరిషత్ పీఠాలు వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడనుంది. ఎన్నికలు జరిగిన 996 ఎంపీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ 764 చోట్ల విజయ ఢంకా మోగించింది. టీడీపీ110 స్థానాలకు పరిమితం అయింది. జనసేన 93 చోట్ల గెలువగా, 19 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలిచారు. మిగిలినవి సీపీఎం 7 బీజేపీ 2, కాంగ్రెసు, బీఎస్పీ చెరొకటి గెలిచాయి.
Also Read : పరిషత్‌లోనూ ఫ్యానుదే హవా – 13 జిల్లాల ఫలితాలు
తిరుగులేని పార్టీగా..
అద్భుత ఫలితాలతో వైఎస్సార్‌సీపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. ఎన్నికల కంటే ముందు ఏకగ్రీవమైన ఎంపీటీసీ స్థానాల్లో సైతం మెజార్టీ స్థానాలు(77) వైఎస్సార్‌సీపీ పరమయ్యాయి. జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు రెండింటా పార్టీ అభ్యర్థులు విజయ ఢంకా మోగించారు. జిల్లా ప్రజలు ఈ ఫలితాల ద్వారా ప్రభుత్వానికి మరోసారి మద్ధతుగా నిలిచినట్టయ్యింది.
టీడీపీ కంచుకోటలకు బీటలు..
ఒకప్పటి తెలుగుదేశంపార్టీ కంచు కోటలన్నీ వైఎస్సార్‌సీపీ గాలిలో నిలవలేక పేక మేడల్లా కుప్పకూలిపోయాయి. రంపచోడవరం ఏజెన్సీ, కోనసీమ, మెట్ట అని వ్యత్యాసం లేకుండా అన్ని ప్రాంతాల్లోను వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించింది. పోటీ నుంచి బహిష్కరిస్తున్నట్టు టీడీపీ అధినేత చంద్రబాబు చెప్పినప్పటికీ జనసేనతో అంతర్గత ఒప్పందంతో కలిసి బరిలోకి దిగినా జిల్లా ప్రజలు వారిని తిరస్కరించారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్ నేతలు యనమల, చినరాజప్ప వంటి నేతల సొంత మండలాల్లో సైకిల్ కుదేలు అయింది. కనీసం ఒక్క జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాన్ని కూడా దక్కించుకు లేక చేతులెత్తేశారు.
మన్యంలో రాష్ట్ర విభజన తరువాత విలీన మండలాల్లో తొలి సారి పార్టీ పరంగా జరిగిన పరిషత్ ఎన్నికల్లో ఆ మండలాల ప్రజలు వైఎస్సార్ సీపీకి తిరుగులేని ఆధిక్యతను కట్టబెట్టారు. నాలుగు మండలాల్లో టీడీపీకి వీఆర్ పురం ఒక్కటే దక్కింది. కూనవరం, చింతూరు, ఎటపాక మండలాల జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ విజయం సాధించింది. డివిజన్ కేంద్రం రంపచోడవరం సహా గంగవరం, దేవీపట్నం, అడ్డతీగల, వై రామవరం తదితర మండలాల జెడ్పీటీసీలతో పాటు మండల పరిషత్ పీఠాలను కూడా వైఎస్సార్ సీపీ గెలిచింది. మన్యంలో ఓటర్లు తెలుగుదేశం పార్టీని మట్టి కరిపించారు.
Also Read : కవరింగ్ టైం: బాబు వదిలేశాడు కాబట్టే ఆ పాప గెలిచిందంట …!