iDreamPost
iDreamPost
పాపికొండల యాత్రకు ఇప్పుడు రెండవ మార్గం కూడా అందుబాటులోకి వచ్చింది. హైదరాబాద్ వంటి ప్రాంతాల నుంచి వచ్చేవారికి వీలుగా రెండవ చోట నుంచి కూడా బోటు ప్రయాణాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. గతంలో తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి మాత్రమే పాపికొండలకు బోట్లు వెళ్లేవి. ఇప్పుడు విలీనప్రాంతం వీఆర్‌పురం మండలంలోని పోచవరం లాంచీల రేవు నుంచి పాపికొండల యాత్ర ఆదివారం నుంచి ఆరంభమైంది. ఇక్కడకు భద్రాచలం నుంచి నెల్లిపాక, తోటపల్లి, గౌరీపేట, కూనవరం మీదుగా పోచవరం రావాలి. పోచవరం లాంచీల రేవు నుంచి బోటు ప్రయాణం చేసి పేరంటాలపల్లి, కొల్లూరు, కొండమొదలు మీదుగా పాపికొండు బ్యాంబూ హట్స్ వరకు ప్రయాణించి బోటు తిరిగి పోచవరం లాంచీల రేవు వద్దకు వెళుతుంది.
దారిలో పేరంటాలపల్లిలో కొద్దిసేపు ఆగుతుంది. ఇప్పటికే ట్రైల్‌రన్ పూర్తయ్యింది. పెద్దలకు రూ.930, పిల్లలకు రూ.730 చొప్పున టిక్కెట్ ధరలు నిర్ణయించారు. గతంలో జరిగిన ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం రక్షణ చర్యలు చేపట్టింది. బోటు కండీషన్, ప్రయాణీకులకు లైఫ్ జాకెట్లు ఏర్పాటు, అత్యవసర సమయంలో అందుబాటులో లాంచీలు ఉండేలా చర్యలు తీసుకుంటుంది. కొత్త బోటింగ్ పాయింట్ తెలంగాణా, ఛతీస్‌ఘడ్ నుంచి వచ్చేవారికి వీలుగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి వచ్చే పర్యాటకులకు ఇది అందుబాటులో ఉంటుంది. ఇప్పటి వరకు వీరంతా రాజమహేంద్రవరం వచ్చి, ఇక్కడ నుంచి పాపికొండల యాత్ర చేపడుతున్నారు.
ఎన్నెన్నో అందాలు:
పాపికొండల అందాలు వర్ణించేందుకు మాటలు చాలవు. చూసేందుకు రెండుకళ్లూ చాలవంటే అతిశయోక్తి కాదు. నదిలో విశాలమైన ఇసుక తెన్నులు… చుట్టూ పచ్చని కొండలు, పాము మెలికలు తిరిగినట్టు ఉండే గోదావరి… అక్కడక్కడా కలిసే శబరి, కడిర వంటి నదులు.. వాటితోపాటు చిన్నచిన్న పాయలు పాపికొండల గురించి ఎంత వర్ణించినా తక్కువే. తూర్పు కనుమలలో దట్టమైన అడవులతో కూడిని ఒక పర్వత శ్రేణి… దాని మధ్య నుంచి మెలికలు తీరుగుతూ సాగే గోదావరి పాపికొండలకు ప్రత్యేకం. ఎటు చూసినా సహజసిద్దమైన అందాలు కనువిందు చేస్తాయి. లంక వాసులు, కల్మషం తెలియని గిరిజనుల ఆహార్యం ముచ్చటగొల్పుతోంది.
పాపికొండలు చూసేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున పర్యాటకులు వస్తున్నారు. తొలి రోజుల్లో రాజమహేంద్రవరం, కొవ్వూరు నుంచి లాంచీల మీదుగా పాపికొండల యాత్ర జరిగేది. లాంచీల స్థానంలో పెద్ద బోట్లు వచ్చిన తరువాత ఇది తూర్పుగోదావరి జిల్లా పురుషోత్తమపట్నం, పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం నుంచి యాత్ర మొదలయ్యేది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం తరువాత ఇది తూర్పులోని గండిపోచమ్మ ఆలయం వద్ద నుంచి యాత్ర ప్రారంభమవుతుంది. 2019, సెప్టెంబరు 15న బోటు మునిగిన ఘటనలో సుమారు 50 మంది వరకు మృత్యువాత పడడంతో పాపికొండల యాత్ర నిలిచిపోయింది. తరువాత కరోనా కారణంగా రెండేళ్లకు పైగా నిలిచిపోయిన యాత్ర గత నెల ఆరంభంలో మొదలైంది. తుఫాను హెచ్చరికల నేపథ్యంలో మరోసారి నిలిపివేేశారు. తిరిగి ఆరంభమైంది. తాజాగా పోచవరం నుంచి మొదలు కానుండడంతో రెండుచోట్ల నుంచి పాపికొండలు వీక్షించేందుకు ఆస్కారం కలిగింది.
జలకళ కనుల విందు:
పోలవరం ప్రాజెక్టు వద్ద నీటి నిల్వ ఉండడంతో పాపికొండల యాత్ర మరింత అందాన్ని తెచ్చింది. రిజర్వాయర్‌లో పెద్ద ఎత్తున నీరు ఉండడంతో పేరంటాలపల్లి నుంచి వెళ్లే ప్రయాణీకులకు కనుచుపుమేర కనిపిస్తూ… ఉరకలు వేస్తున్న జలం సముద్ర ప్రయాణ అనుభూతిని కలిగిస్తుంది.
Also Read : ఉక్కు సంకల్పం లేని రాజకీయమెందుకు పవన్?