iDreamPost
iDreamPost
జిల్లాల పునర్విభజనలో భాగంగా నరసరావుపేట పార్లమెంట్ స్థానాన్ని జిల్లాగా ఏర్పాటు చేస్తూ, చారిత్రక నేపథ్యంతో ముడిపడిన పల్నాడు పేరుని జిల్లాకు పెట్టిన ప్రభుత్వ నిర్ణయం పట్ల రాజకీయాలకతీతంగా పల్నాడు ప్రాంత ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంగా నరసరావుపేటని ఎంపిక చేయడంతో పేట నియోజకవర్గ ప్రజల ఆనందం ఎల్లలు దాటింది. పలు ప్రాంతాల నుండి వచ్చిన డిమాండ్స్ తట్టుకొని నరసరావుపేటని జిల్లా కేంద్రంగా ఎంపిక చేయడంలో కీలకపాత్ర పోషించిన స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి నరసరావుపేట పట్టణ ప్రజలు నిన్న జరిగిన కోటప్పకొండ పాదయాత్రలో అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు.
నరసరావుపేటలోని శివుడి బొమ్మ సెంటర్ నుండి ఉదయం పది గంటలకు పాదయాత్ర తలపెట్టగా తొమ్మిది గంటలకే పట్టణ ప్రధాన రహదారి ప్రజలతో కిక్కిరిసిపోయింది. పది గంటలకు ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి ప్రారంభ వేదిక వద్దకు చేరుకొని పూజతో పాదయాత్ర ప్రారంభించారు. వైసీపీ కార్యకర్తలు, పట్టణ ప్రజల కోలాహలం మధ్య పట్టణంలోని ప్రజాసంఘాల ఆధ్వర్యంలో గజమాలతో సత్కరించగా, దారిపొడవునా పలు గ్రామాల ప్రజలు ఎదురొచ్చి స్వాగతించగా, దశాబ్దాల తరబడి టీడీపీ కంచుకోటలుగా పేరు పడ్డ యలమంద, గురవాయపాలెం గ్రామాల ప్రజలు రాజకీయాలకతీతంగా ఘనస్వాగతం పలికి గజమాల, కిరీటాలతో సత్కరించటం విశేషం.
పల్నాడు జిల్లా ఏర్పాటుకు కృతజ్ఞతలు తెలుపుతూ వినుకొండలో పాదయాత్ర చేపట్టిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఆ కార్యక్రమం ముగియగానే కోటప్పకొండ పాదయాత్ర మధ్యలో వచ్చి భాగస్వామ్యమయ్యారు. కొండ ఘాట్ రోడ్డు వేదికవద్ద గుఱ్ఱం జాషువా వారసుడు, సంరక్ష సొసైటీ ఫౌండర్ బి, ఆర్ సుశీల్ కుమార్ తమ చారిటీ స్కూల్ సిబ్బందితో కలిసి ఎమ్మెల్యే, ఎంపీలను సన్మానించారు. అనంతరం కొండ పైకి చేరుకున్న యాత్రికులు త్రికూటేశ్వర స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు అందుకొని యాత్ర విరమించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గోపిరెడ్డి, ఎంపీ కృష్ణదేవరాయలు, రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డి, వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడితో పాటు గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, గుంటూరు 2 ఎమ్మెల్యే మద్దాలి గిరి తదితరులు పాల్గొని యాత్రకు సంఘీభావం తెలిపారు.
యాత్ర ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే గోపిరెడ్డి పల్నాడు జిల్లాకు కేపిటల్ గా అన్ని వసతులూ ఉండి, ఉద్యోగ, వ్యాపార అవకాశాలు మరింత పెంపొందడానికి అనుకూలంగా ఉన్న నరసరావుపేటని ఎంపిక చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, ఇందుకు సహకరించిన ఎంపీ కృష్ణదేవరాయలకు, సహా ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు తెలిపారు. నరసరావుపేట పల్నాడుకి ముఖద్వారం మాత్రమే కాకుండా పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు సమదూరంలో ఉండి రాకపోకలకు అనువుగా ఉన్న ప్రాంతమని ఇందువలన మిగతా నియోజక వర్గాలకు సౌకర్యంగా ఉండటమే కాక నరసరావుపేట మరింతగా అభివృద్ధి చెంది జిల్లా ప్రజలకు ఉద్యోగ , వ్యాపార అవకాశాలు కల్పించే విధంగా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తన పై నమ్మకముంచి ఆదరించిన నరసరావుపేట ప్రజల రుణం ఎన్నటికీ తీర్చుకోలేనిదని ఈ రోజు నరసరావుపేట జిల్లా కేంద్రంగా ఎంపిక కావటం వారి విజయమేనన్నారు.
ఎంపీ కృష్ణదేవరాయలు మాట్లాడుతూ ప్రతియేటా శివరాత్రికి నరసరావుపేట, కోటప్పకొండ జనంతో పోటెత్తుతాయని ఈ రోజు తమ పాదయాత్రకు సంఘీభావంగా తరలివచ్చిన జనసందోహాన్ని చూస్తే శివరాత్రి ముందే వచ్చినట్లుందని వ్యాఖ్యానించారు. కార్యక్రమం అనంతరం పల్నాడు జిల్లా ఏర్పాటుకు మద్దతుగా పెదకూరపాడు నియోజక వర్గంలో ఎమ్మెల్యే నంబూరి శంకర రావు తలపెట్టిన పాదయాత్రలో పాల్గొన్న ఎంపీ కృష్ణదేవరాయలు రాజుపాలెం గ్రామంలో ప్రజల కొరకు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన సురక్షిత మంచినీటి ప్లాంట్ ని ప్రారంభించారు …