Idream media
Idream media
2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో థర్డ్ అంపైర్ తీసుకున్న తప్పుడు నిర్ణయంతోనే భారత్ గెలిచిందని పాక్ మాజీ స్పిన్నర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సెమీస్‌లో 23 వ్యక్తిగత పరుగులు సాధించిన సచిన్ తన బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా ఔటైనా,థర్డ్ అంపైర్ బిల్లీ బౌడెన్ తప్పుడు నిర్ణయంతో లైఫ్ పొందాడని పాకిస్థాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ఆరోపించాడు.
అలాగే కొన్ని రోజుల క్రితం ఒక ఇంటర్వ్యూలో అంపైర్ ఇయాన్ గౌల్డ్ మాట్లాడుతూ,ఇప్పటికీ ప్రపంచకప్ సెమీస్‌లో సచిన్ టెండూల్కర్‌ను ఔట్‌గా ఇచ్చిన తన నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నాడు.2011 సెమీస్‌లో సచిన్ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో భారత బౌలర్ల విజృంభణతో పాకిస్థాన్ 231 పరుగులకే కుప్పకూలి 29 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై కీలకమైన పరుగులు సాధించిన సచిన్ ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గా ఎంపికయ్యాడు.
పాక్ మాజీ ఆఫ్ స్పిన్నర్ అజ్మల్ మాట్లాడుతూ “వ్యక్తిగతంగా 23 పరుగులు సాధించిన సచిన్ నా బౌలింగ్‌లో వికెట్ల ముందు అడ్డంగా దొరికిపోయాడు. ఫీల్డ్ అంపైర్ ఇయాన్ గౌల్డ్ ఎల్బీడబ్ల్యూగా ఔటిచ్చేశాడు. కానీ సచిన్ రివ్వ్యూకి వెళ్లడంతో థర్డ్ అంపైర్ బిల్లీ బౌడన్ నాటౌట్‌గా ప్రకటించాడు. కానీ అతను ఔట్ అయ్యాడని నాకు 100 శాతం నమ్మకం ఉంది. అఫ్రిదీ,కమ్రన్,వహాబ్‌లు నన్ను అడిగితే,నేను అతను కచ్చితంగా ఔట్ అయ్యాడనే చెప్పాను.కానీ థర్డ్ అంపైర్ సచిన్‌ని నాటౌట్ అని ప్రకటించినప్పుడు చాలా నిరాశ చెందాను. ముఖ్యంగా ఆ మ్యాచ్‌లో సచిన్ బ్యాటింగ్ కారణంగానే మేము ఓడిపోయాం.ఇప్పటికీ సెమీఫైనల్ మ్యాచ్‌ని గుర్తు చేసుకుంటే బాధేస్తుంది” అని వాపోయాడు.
ఆనాటి సెమీఫైనల్‌లో దాయాది ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదలడంతో పాటు కీపర్ కమ్రన్ అక్మల్ ఒకసారి స్టంపౌట్ అవకాశాన్ని జారవిడిచాడు. అయినా థర్డ్ అంపైర్ నిర్ణయంతోనే తమ జట్టు ఓడిపోయినట్లు అజ్మల్ ప్రకటించడం హాస్యాస్పదం. చివరకు సెంచరీకి చేరువ అవుతున్న దశలో 85 పరుగుల వద్ద సయీద్ అజ్మల్ బౌలింగ్‌లో షాహిద్ అఫ్రిదీ పట్టిన క్యాచ్‌తో పెవిలియన్ చేరడం యాదృచ్ఛికం. మొహాలి వేదికగా జరిగిన 2011 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్‌లో పాకిస్థాన్‌ని ఓడించిన భారత్, ఫైనల్‌కి చేరి అక్కడ శ్రీలంకని కంగు తినిపించి రెండవసారి విశ్వవిజేతగా అవతరించింది.
28 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీమిండియా వన్డే ప్రపంచకప్ గెలవగా సచిన్ టెండూల్కర్ తన చిరకాల ఆకాంక్ష నెరవేరిందని ప్రకటించిన సంగతి తెలిసిందే.సెమీస్ విజయం తర్వాత భారత లెజెండ్ బ్యాట్స్‌మెన్ సచిన్ ప్రపంచకప్‌లలో పాకిస్థాన్‌పై తాను ఆడిన ఐదు మ్యాచ్‌లూ చిరస్మరణీయమని పేర్కొన్నాడు.సచిన్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించగా,అజ్మల్ మాత్రం 2017 వరకు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాడు