గత ఏడాది హిట్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించి మంచి సక్సెస్ అందుకున్న విశ్వక్ సేన్ కొత్త సినిమా పాగల్ విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా ఇందాకా చిన్న టీజర్ ని విడుదల చేసింది టీమ్. దిల్ రాజు సమర్పణలో బెక్కం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా నరేష్ కుప్పిలి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ దశ నుంచే దీన్నో డిఫరెంట్ లవ్ స్టోరీగా ప్రొజెక్ట్ చేయడంతో యూత్ లో మంచి అంచనాలే ఉన్నాయి. అందులోనూ ఫలక్ నుమా దాస్ లాంటి మాస్ ఎంటర్ టైనర్ తర్వాత ఆ తరహా బాడీ లాంగ్వేజ్ తో విశ్వక్ సేన్ సినిమా చేయలేదు. అందుకే దీని మీద ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. మరి ఈ టీజర్ సంగతేంటో చూద్దాం.
జాలీగా లైఫ్ ని ఎంజాయ్ చేసే యువకుడు కంటికి ఎవరైనా నచ్చితే చాలు ఐ లవ్ యు చెప్పేస్తాడు. వాళ్ళు అడిగింది చేసేస్తాడు. దెబ్బలు తింటాడు. అవసరమైతే యుద్ధానికి కలబడి అందరిని చితకబాదుతాడు. ఆఖరికి బామ్మకు కూడా ప్రేమించానని చెప్పే రకం. అలా అని ఇతనేమీ ప్రేమోన్మాది కాదు. దీని వెనుక ఏదో కారణం ఉండే ఉంటుంది. అలా గడిచిపోతున్న ఇతని జీవితంలోకి వచ్చిన అమ్మాయిలు, ఓ రాజకీయ నాయకుడి ద్వారా ఎలాంటి సమస్యలు ఎదురుకున్నాడు, అందరూ పాగల్ అని పిలిచే తన పిచ్చితనాన్ని వాడుకుని ఇందులో నుంచి ఎలా బయటపడ్డాడో సినిమాలోనే చూడాలి.
సింపుల్ గా కాన్సెప్ట్ ఏమిటో టీజర్ లో చెప్పేశారు. కానీ ఎక్కువ డీటెయిల్స్ ఇవ్వకుండా జాగ్రత్త పడ్డారు. లవర్ బాయ్ గా విశ్వక్ సేన్ చాలా కొత్తగా ఉన్నాడు. తన యాటిట్యూడ్ కు తగ్గ క్యారెక్టరైజేషన్ ని దర్శకుడు తీర్చిదిద్దినట్టుగా కనిపిస్తోంది. హీరోయిన్ల పేర్లు టీజర్ టైటిల్ లో కానీ కింద క్యాస్టింగ్ లిస్ట్ లో కానీ ఇవ్వకపోవడం దారుణం. హీరో డైరెక్టర్ పేర్లతోనే సరిపెట్టేశారు. ఈ నగరానికి ఏమైందిలో చేసిన సిమ్రాన్ చౌదరి ఒక హీరోయిన్ కాగా మరొకరు కూడా ఉన్నారట. రధన్ సంగీతం సమకూరుస్తున్న పాగల్ ఏప్రిల్ 30న విడుదల కాబోతోంది. రాహుల్ రామకృష్ణ, మురళి శర్మ తదితరులు ఇతర తారాగణం.
Teaser Link @ http://bit.ly/3u7ktpZ