iDreamPost
android-app
ios-app

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజ‌న్.. త‌మిళ‌నాడు అభ్యంత‌రం..!

తెలుగు రాష్ట్రాలకు ఆక్సిజ‌న్.. త‌మిళ‌నాడు అభ్యంత‌రం..!

క‌రోనా వేళ కొత్త కొత్త స‌మ‌స్య‌లు, వివాదాలు త‌లెత్తుతున్నాయి. ఎవ‌రికి వారు త‌మ రాష్ట్రంలోని ప్ర‌జ‌ల అవ‌స‌రాల కోస‌మే ముంద‌స్తుగా పోరాడాల్సి వ‌స్తోంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల‌కు అవ‌స‌రం ఆక్సిజ‌న్. ఇప్పుడు అదే తెలుగు, త‌మిళ‌నాడు రాష్ట్రాల మ‌ధ్య స‌మ‌స్య‌గా మారింది. ఆక్సిజన్ ను తెలుగు రాష్ట్రాలకు మళ్లించడంపై తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీతో మాట్లాడిన ఫళనిస్వామి 80 ఎంటి ఆక్సిజన్ సరఫరాను రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మళ్లించడం అన్యాయమని అని అన్నారు. దీన్ని తమకే కేటాయించాలని ప్రధానికి విన్నవించారు.

నేషనల్ మెడికల్ ఆక్సిజన్ కేటాయింపు ప్రణాళికలో తమిళనాడుకు 220 మెట్రిక్ టన్నుల (మెట్రిక్ టన్ను) ఆక్సిజన్ మాత్రమే కేటాయించడం తప్పు అని మోడీకి రాసిన లేఖలో ఫళనిస్వామి పేర్కొన్నారు. తమిళనాడులో కోవిడ్-19 కేసులు పెరుగుతున్న దృష్ట్యా పళనిస్వామి ఈ మేరకు ప్రధానికి లేఖ రాశారు. రాష్ట్రానికి త్వరలో 450 మెట్రిక్ టన్నులు అవసరమవుతాయని కానీ రాష్ట్రంలో ఉత్పత్తి సామర్థ్యం 400 మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువగా ఉంటుందని అన్నారు. “2020 లో వచ్చిన మొదటి కరోనా వేవ్ లో గరిష్ట క్రియాశీల కేసుల సంఖ్య 58000తో పోలిస్తే ఇప్పుడు రోజు లక్షకు పైగా కేసులు పెరుగుతున్నాయని.. ఆక్సిజన్ డిమాండ్ పెరిగిందని.. తగినంత ఆక్సిజన్ సరఫరాను అందించడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి”అని ఫళనిస్వామి తెలిపారు. తమిళనాడుకు 220 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ను కేటాయించారని మోడీకి లేఖలో ఫళనిస్వామి వివరించారు. 80 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్ను ఇక్కడ ఉన్న ఉత్పాదక కేంద్రాల నుంచి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు మళ్లించడం తప్పు అని అన్నారు. తమిళనాడుకు ఇది అన్యాయమని అన్నారు.

పెట్రోలియం – పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) గణాంకాల ప్రకారం.. తమిళనాడులో ఆక్సిజన్ వినియోగం ఇప్పటికే 310 మెట్రిక్ టన్నులకు చేరుకుందని మోడీకి లేఖలో ఫళనిస్వామి పేర్కొన్నారు. కానీ రాష్ట్రానికి కేవలం 220 మెట్రిక్ టన్నులు మాత్రమే కేటాయించడం దారుణమన్నారు. కేటాయింపులకు ఇదీ సరిపోని విధంగా ఉందన్నారు. అలాగే తమ నుంచి ఆక్సిజన్ కేటాయించిన రాష్ట్రాలలో తమిళనాడు కంటే తక్కువ సంఖ్యలో క్రియాశీల కేసులు ఉన్నాయా అని ఫళని స్వామి ప్రశ్నించారు. “తమిళనాడు ఇప్పటివరకు ఎటువంటి ఆంక్షలు విధించలేదు. ఇతర రాష్ట్రాలకు మద్దతు ఇవ్వడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంది అయితే మన రాష్ట్ర అవసరాల నుండి ద్రవ ఆక్సిజన్ను తప్పనిసరిగా మళ్లించడం దారుణం. చెన్నై సహా ఇతర జిల్లాల్లో ఆక్సిజన్ కొరత ఉంది. ఇలా తరలిస్తే పెద్ద సంక్షోభానికి దారితీస్తుంది. అందువల్ల తమిళనాడులోని శ్రీపెరంపుదూర్ ప్లాంట్ నుంచి 80 కెఎల్ మళ్లించడం వెంటనే రద్దు చేయాలని నేను అభ్యర్థిస్తున్నాను” అని పళనిస్వామి తాజాగా మోడీకి రాసిన లేఖలో వివరించారు.