చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద భారీ సినిమాల పండగ మొదలుకానుంది. గత కొన్ని నెలలుగా చిన్నా చితక చిత్రాలతో కేవలం ఫీడింగ్ తో నెట్టుకొస్తున్న థియేటర్లకు ప్రతి రోజు పండగ ఒక్కటే వర్క్ అవుట్ అయ్యింది. మత్తు వదలరా లాంటి చిన్న సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ అవి మరీ కళ్ళుతిరిగిపోయే వసూళ్లు బిసి సెంటర్స్ లో తీసుకురాలేదు. ఈ నేపధ్యంలో రేపు దర్బార్ తో మొదలయ్యే పందెం కోళ్ళ యుద్ధం 11వ తేది నుంచి పీక్స్ కు చేరనుంది.
ముఖ్యంగా సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో మీద పెట్టుబడులు వరదలా పారుతున్నాయి. ఓవర్సీస్ మార్కెట్ లో కీలకంగా భావించే యుఎస్ లో ఈ రెండు సినిమాల మీద బయ్యర్లు ఎప్పుడు లేని ఇన్వెస్ట్ మెంట్ చేశారు. విశ్వసనీయ సమాచారం మేరకు సరిలేరు నీకెవ్వరు సుమారు 9 కోట్ల దాకా డీల్ చేసుకోగా అల వైకుంఠపురములో కొంత తక్కువగా 6 కోట్లకు లాక్ చేశారట. ఇద్దరు హీరోల వ్యక్తిగత కెరీర్లలో చూసుకుంటే యుఎస్ లో ఇదే హయ్యెస్ట్ బిజినెస్
సో బ్రేక్ ఈవెన్ కావాలన్నా కనీసం రెండు మిలియన్ల మార్కుని టచ్ చేయాల్సిందే. ఇందులో సగం ప్రీమియర్లతోనే వచ్చేస్తుందని అంచనా. మహేష్ ఇమేజ్ సరిలేరుకి ప్లస్ అవుతుండగా బన్నీతో సమానంగా త్రివిక్రమ్ ను అభిమానించే అమెరికా ఫ్యాన్ బేస్ అల వైకుంఠపురంకు దన్నుగా నిలుస్తోంది. అయితే టాక్ ఖచ్చితంగా చాలా పాజిటివ్ గా రావాలి. యావరేజ్ అన్నా అంత ఈజీగా ప్రవాసాంధ్రులు ధియేటర్ల వైపు చూడటం లేదు. సో 3 మిలియన్ మార్కును కనక ఈ రెండూ అందుకుంటే బ్లాక్ బస్టర్స్ కింద వేసేయోచ్చు. ఏ ఒక్కటి తేడా కొట్టినా కష్టమే. సినిమా ప్రేమికులు మాత్రం రెండింటి పట్లా చాలా ఆసక్తిగా ఉన్నారు. ఒకవేళ దర్బార్ కూడా యునానిమస్ గా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే అప్పుడు కలెక్షన్స్ లో షేరింగ్ తప్పదు. లేదంటే మిలియన్లను హ్యాపీగా బన్నీ మహేష్ లే పంచుకుంటారు