1218 కి చేరిన కరోనా మరణాలు
దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఉధృతంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా కరోనా 37,336 పాజిటివ్ కేసులు నమోదవగా 1,218 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా వైరస్ బారినుండి 9,951 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 2,293 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా 71 మంది మరణించారు. ఇప్పటివరకూ ఒక్కరోజులో నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల విషయంలో ఇదే అత్యధికం..
ముఖ్యంగా మహారాష్ట్రలో కరోనా తీవ్రత అధికంగా ఉంది. అత్యధిక పాజిటివ్ కేసులు మహారాష్ట్రలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 11,506 పాజిటివ్ కేసులు నమోదుకాగా 485 మంది మృత్యువాతపడ్డారని మహారాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. 1,879 మంది వైరస్ బారినుండి పూర్తిగా కోలుకున్నారు. గుజరాత్‌లో కూడా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతుంది. ఇప్పటివరకు 4,721 కేసులు నమోదవ్వగా, 236 మంది మృతిచెందారు. 735 మంది డిశ్చార్జి అయ్యారు.
ప్రపంచవ్యాప్తంగా 3,401,318 మందికి కోవిడ్ 19 సోకగా 239,614 మంది కరోనా మహమ్మారి బారిన పడి మృతిచెందారు. 1,081,705 మంది వైరస్ నుండి కోలుకున్నారు..కాగా కరోనా వైరస్ కారణంగా అమెరికా అతిపెద్ద బాధిత దేశంగా ఉంది. అమెరికాలో సుమారు 1,131,452 మందికి కరోనా వైరస్ పాజిటివ్ గా తేలగా 65,776 మంది మరణించారు.