iDreamPost
android-app
ios-app

OTT / ATT – దేనిది భవిష్యత్తు ?

  • Published Jul 07, 2020 | 5:53 AM Updated Updated Jul 07, 2020 | 5:53 AM
OTT / ATT – దేనిది భవిష్యత్తు ?

ఓటిటి(ఓవర్ ది టాప్)అన్నా ఏటిటి(ఎనీ టైం థియేటర్)అన్నా స్వభావంలో చిన్న మార్పు ఉంటుందే తప్ప స్వరూపం ఒక్కటే. ఎలా చూసినా ఫైనల్ గా స్మార్ట్ ఫోన్ లోనో లేదా టీవీలోనో దీనికి ఒకటే వేదిక అయ్యింటుంది. గత కొద్దిరోజులుగా టాలీవుడ్ లో ఏటిటి గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా చిన్న నిర్మాతలు దీని మీద చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఓటిటిలో వార్షిక చందాలు ఉంటాయి. 300 రూపాయలతో మొదలుకుని వెయ్యి ఆపై 8 వేల దాకా అవసరాలకు తగ్గట్టు ఆయా సంస్థలు ధరలు నిర్ణయించాయి. అత్యధికంగా నెట్ ఫ్లిక్స్ వసూలు చేస్తోంది. అయితే ఏటిటి వ్యవహారం అలా ఉండదు. ఏ సినిమా చూడాలనుకుంటే దానికి మాత్రమే విడిగా ధర ఉంటుంది.

ఇటీవలే వర్మ క్లైమాక్స్ కి 100 రూపాయలు, నేకెడ్ కి 200 రూపాయలు తీసుకుంటే భారీ లాభాలు వచ్చాయి. అఫ్ కోర్స్ బడ్జెట్ చాలా తక్కువ కాబట్టి రిటర్న్స్ ఎక్కువ కనిపించాయి. కంటెంట్ గురించి మాట్లాడుకోకపోవడం ఉత్తమం. దీన్ని పక్కనపెడితే రిలీజులు ఆగిపోయిన చిన్న సినిమాలు ఇలా పే పర్ వ్యూ పద్ధతిలో విడుదల చేసుకుంటే సొమ్ములు చేసుకోవచ్చనే ఆలోచనలో ఇప్పుడు అధిక శాతం ఉన్నట్టుగా తెలిసింది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఎంత కొత్త సినిమా అయినా అందులో క్యాస్టింగ్, దర్శకుడి బ్రాండ్, బ్యానర్, బడ్జెట్ తదితర అంశాలన్నీ ప్రేక్షకులు నిర్ణయం తీసుకునే విషయంలో ప్రభావం చూపుతాయి. ఉదాహరణకు ముక్కు మొహం తెలియని హీరో హీరొయిన్ ఉన్న చిన్న సినిమాకు ఆన్ లైన్ లో వంద పెట్టి చూడమంటే జనం ఎగబడకపోవచ్చు. వర్మ కాబట్టి పైన చెప్పిన రెండు సినిమాలు వర్కౌట్ అయ్యాయి కాని ఇది అందరి విషయంలోనూ అదే ఫలితం వస్తుందన్న గ్యారెంటీ లేదు.

అలాంటప్పుడు డిజిటల్ సంస్థలకు గంపగుత్తగా అమ్మితే వచ్చే సొమ్ము కన్నా ఈ ఏటిటిలో వచ్చే డబ్బులు తక్కువ వచ్చే రిస్క్ లేకపోలేదు. ఇక్కడ ప్రేక్షకుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించే అవకాశం ఉంది. వర్మ అయినా పదే పదే అలాంటి కంటెంట్ ని మళ్ళీ మళ్ళీ తీస్తూ డబ్బులు అడిగితే ఒకదశలో దానికీ బ్రేక్ పడుతుంది. నెలకు రెండు మూడు సినిమాలకు ఇలా మూడేసి వందలు ఇచ్చుకుంటూ పోతే ఏడాదికి ఖర్చు 4 వేల దాకా అవుతుంది. సో ఎటు తిరిగి క్వాలిటీ చాలా ముఖ్యం. ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, డిస్నీ హాట్ స్టార్ లాంటి సంస్థలు ఎంత కొత్త సినిమాలు రిలీజ్ చేసినా అదనంగా ఎలాంటి డబ్బులు తీసుకోవడం లేదు. ఇప్పటికే బాలీవుడ్ డైరెక్ట్ రిలీజ్ సినిమాలు క్యులో పెట్టిన హాట్ స్టార్ విఐపి సంవత్సర చందా నాలుగువందలలోపే. ఈ లెక్కన ఓటిటి స్వరూపం అంత సులభంగా ఏటిటిగా మారేది చాలా సమీకరణల మీద ఆధారపడి ఉంటుంది. చూద్దాం.