iDreamPost
iDreamPost
మాస్ మహారాజ రవితేజకు స్టార్ ఇమేజ్ తెచ్చి ఎక్కడికో తీసుకెళ్లిన ఇడియట్ సినిమాను 18 ఏళ్ళ తర్వాత కూడా అభిమానులే కాదు మూవీ లవర్స్ కూడా ఎవరూ మర్చిపోలేరు. అందులో హీరో క్యారెక్టరైజేషన్ ను దర్శకుడు పూరి జగన్నాధ్ చూపించిన తీరుని ఆ తర్వాత ఎందరో ఫాలో అయ్యారు. అంతగా ప్రభావం చూపించింది. నిజానికిది రీమేక్ అనే సంగతి సాధారణ ప్రేక్షకులకు అంతగా అవగాహన లేదు. ఇడియట్ కన్నా ముందు కన్నడలో స్టార్ హీరో రాజ్ కుమార్ మూడో వారసుడు పునీత్ ని పరిచయం చేస్తూ ఇదే కథను అప్పు పేరుతో పూరినే అక్కడ దర్శకత్వం వహించారు. కట్ చేస్తే డెబ్యూతోనే అప్పు ఇండస్ట్రీ రికార్డులు సృష్టించింది.
ఆ తర్వాతే ఈ సబ్జెక్టుని రవితేజ ఇంకా బాగా మోయగలడని గుర్తించి ఇడియట్ గా రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు. ఇదంతా గత చరిత్ర. పునీత్ కు కాలక్రమంలో పవర్ స్టార్ రేంజ్ ఇమేజ్ వచ్చింది. ఒక్కడు, దూకుడు లాంటి రీమేక్స్ చేసుకుని బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. అక్కడ ఎంత పెద్ద మార్కెట్ ఉన్నా ఇతని గురించి తెలుగు వాళ్లకు తెలిసింది సున్నానే. అప్పుడెప్పుడో జాకీ అనే అక్కడి హిట్ మూవీని డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే వారం కూడా ఆడలేదు. ఆ తర్వాత మన నిర్మాతలు హక్కులు కొనడం మానేశారు. పునీత నటించిన చక్రవ్యూహ అనే సినిమా కోసం జూనియర్ ఎన్టీఆర్ కన్నడలో ఓ పాట కూడా పాడాడు.
ఇప్పుడు 19 ఏళ్ళ తర్వాత పునీత్ ని తెలుగులోకి తీసుకొస్తున్నారు. యువరత్న టైటిల్ తో రూపొందిన భారీ క్రేజీ మూవీని తెలుగులోనూ అదే పేరుతో కెజిఎఫ్ ప్రొడ్యూసర్స్ హోంబాలే ఫిలిమ్స్ డబ్బింగ్ రూపంలో అందించనున్నారు. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అయినా ఒక రాష్ట్రంలో స్టార్ హీరో పక్క స్టేట్ లో తన సినిమాను రిలీజ్ చేసుకోవడానికి సుమారు రెండు దశాబ్దాల సమయం పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. సంతోష్ దర్శకత్వం వహిస్తున్న యువరత్నలో సాయేషా హీరోయిన్ గా నటిస్తుండగా ప్రకాష్ రాజ్ మరో కీలకపాత్రలో కనిపిస్తారు. దీనికి సంగీతం తమన్ సమకూర్చడం మరో విశేషం.