iDreamPost
android-app
ios-app

గుడ్డ కాల్చి మొఖం మీద వేసే రాజకీయాలు మానుకుంటే మంచిది..

  • Published Jan 16, 2021 | 2:35 AM Updated Updated Jan 16, 2021 | 2:35 AM
గుడ్డ కాల్చి మొఖం మీద వేసే రాజకీయాలు మానుకుంటే మంచిది..

ఏపీ రాజకీయాలలో వింత పోకడ కనిపిస్తోంది. సహజంగా పాలకపక్షం పలు ఎత్తులు వేస్తుంది. విపక్షాలను ఇరుకున పెట్టే పని చేస్తుంది. కానీ ప్రస్తుతం ప్రతిపక్షం నక్కజిత్తులు వేస్తోంది. రాజకీయ డ్రామాలతో రసవత్తరంగా మార్చేస్తోంది. మత రాజకీయాలలో ఈ పోకడ మరింత విస్తృతంగా సాగుతోంది. తామే నేరానికి పాల్పడి, ఆ నెపం ప్రభుత్వం మీద నెట్టేసే ప్రయత్నం జోరుగా సాగుతోంది. తమ తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ప్రభుత్వం మీద బురజల్లే నయా నాటకం నడుస్తోంది. పోలీసులు ఆధారాలతో బయటపెట్టిన అంశాల్లో టీడీపీ, బీజేపీ నేతల బండారం బయటపడింది. కొన్ని పచ్చ మీడియా చానెళ్లు కూడా దానికి వంతపాడుతూ అడ్డగోలుగా పట్టుబడిన వైనం ఆసక్తిరేపుతోంది.

ప్రతిపక్షాల విమర్శలను పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వ పెద్దలు కొన్ని ప్రయత్నాలు చేయడం గతంలో చూశాం. కానీ ప్రస్తుతం ఏపీలో సాగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల నుంచి జనం దృష్టి మళ్లించే యత్నం ప్రతిపక్షాలు చేపట్టిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మత సంబంధిత వివాదాలు రాజేసేందుకు కూడా వెనుకాడడం లేదు. సున్నితమైన అంశాల్లో జనాల్లో చిచ్చు రేపే ప్రయత్నాలు భవిష్యత్తుకి చేటు చేస్తాయని తెలిసినా, తమ భవిష్యత్తు కోసం ఇలాంటి వక్రదారిలో సాగడం విపక్ష నేతల తీరు విస్మయానికి గురిచేస్తోంది.

ముఖ్యమంత్రిని, ఇతర కీలక అధికారులను కూడా మతం పేరుతో దూషించేందుకు వెనుకాడని నేతలు ఈవివాదానికి మూలపరుషులుగా ఇప్పుడు ప్రజలకు అర్థమవుతోంది. టీడీపీ పెద్దల పలుకబడి ఉన్న ప్రాంతాల్లో వివాదాలను సృష్టించడం ఇప్పటికే అనేక సందర్భాల్లో జరిగింది. కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కూడా కొన్ని ఆస్పత్రుల్లో చిన్న చిన్న సమస్యలను భూతద్దంలో చూపించి ప్రభుత్వాన్ని బద్నాం చేసే పని సాగింది. కానీ కరోనా విషయంలో తొలి రోజు చెప్పిన మాటకు కట్టుబడి చివరి వరకూ ఈ మహమ్మారిని ఎదుర్కోవడంలో జగన్ తన పట్టుదలను ప్రదర్శించడం ద్వారా ప్రజల మన్ననలు పొందారు. ప్రతిపక్ష నేతలు హైదరాబాద్ కే పరిమితమయినప్పటికీ సీఎం, మంత్రులు మాత్రం ఉమ్మడిగా చేసిన ప్రయత్నం ఫలించింది. కరోనా కట్టడిలో ఏపీకి దేశ, విదేశాల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.

తాజాగా ఆలయాల చుట్టూ చెలరేగిన వివాదాలు కూడా అదే పంథాలో ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో జరిగిన ఘటనల్లో 17 మంది టీడీపీ కార్యకర్తల పాత్రను ఆధారాలతో సహా గుర్తించారు. వారితో పాటుగా మరో నలుగురు బీజేపీ కార్యకర్తలు కూడా మత విద్వేషాలు రాజేసే యత్నం సాగించారు. ఇద్దరు టీవీ చానెళ్ల విలేకర్లతో పాటుగా 13 మంది టీడీపీ, ఇద్దరు బీజేపీ కార్యకర్తలను ఇప్పటికే అరెస్ట్ చేయగా, మిగిలిన వారు పరారీలో ఉన్నారు. దాంతో తామే వివాదం సృష్టించి, దానికి ప్రభుత్వాన్ని బాధ్యులుగా నిందించి, గుడ్డ కాల్చి మొఖం మీద రాజకీయాలకు బాబు అండ్ కో తెరలేపినట్టు స్పష్టమవుతోంది. రాజకీయ కుట్రలతో జగన్ ప్రభుత్వం మీద చంద్రబాబు చేస్తున్న విష ప్రచారం వెనుక అసలు కారకులు వెలుగులోకి రావడంతో ఇప్పుడు మళ్లీ రంకెలేస్తున్న తీరు ఆశ్చర్యంగా కనిపిస్తోంది. విగ్రహాల ధ్వంసం, ఆలయాల్లో దాడులు కూడా గత ప్రభుత్వ హయంలోనే ఎక్కువగా జరిగినప్పటికీ ఎన్నడూ ఉలుకూపలుకూ లేని శక్తులు ఇప్పుడు చేస్తున్న నానా హంగామా వెనుక మతలబు బయటపడింది. అదే సమయంలో బాబు బ్యాచ్ భాగోతం తేటతెల్లం అయిన తర్వాత మరోసారి విష ప్రచారంతో గట్టెక్కే యత్నం ప్రారంభించారు.

దేవుడితో రాజకీయాలు చేసేందుకు సైతం వెనుకాడకుండా టీడీపీ నేతలు తగుదనమ్మా అంటూ తయారయిన తరుణంలో విషయంలో పోలీసులు అసలు గుట్టురట్టు చేశారు. మింగుడుపడని టీడీపీ నేతలు వింత ప్రచారానికి పూనుకుంటున్న తీరు విస్మయకరంగా మారుతోంది. చివరకు పోలీస్ యంత్రాంగం మీద కూడా విమర్శలు గుప్పించి నిందితులను కాపాడాలనే యత్నంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఏమయినా ఏపీ రాజకీయాల్లో నేరాలకు ఒడిగట్టి, ప్రభుత్వాన్ని నిందించి తాము ఉనికిలో నిలవాలనే కుయత్నాల పట్ల ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.