iDreamPost
android-app
ios-app

పుష్పకు అదొక్క సమస్య తీరాలి

  • Published Nov 07, 2020 | 8:42 AM Updated Updated Nov 07, 2020 | 8:42 AM
పుష్పకు అదొక్క సమస్య తీరాలి

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న పుష్ప షూటింగ్ అతి కొద్దిరోజుల్లో మొదలుకాబోతోంది. మారేడుమిల్లి అడవుల్లో ఇప్పటికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫైట్ మాస్టర్లు రామ్ లక్ష్మణ్ దగ్గరుండి మరీ తాము తీయబోయే యాక్షన్ బ్లాక్స్ కి కావాల్సిన సరంజామా సిద్ధం చేసుకుంటున్నారు. బన్నీతో పాటు హీరోయిన్ రష్మిక మందన్న కూడా ఇదే షెడ్యూల్ లో అడుగు పెట్టనుంది. ఏకధాటిగా నెల రోజుల పాటు షూట్ ని ప్లాన్ చేసినట్టుగా తెలిసింది. పోరాట దృశ్యాలతో పాటు రెండు పాటలు కూడా చిత్రీకరించేలా ప్లానింగ్ సిద్ధం చేసినట్టు సమాచారం. అయితే ఇక్కడితో అంతా ఓకే అని కాదు.

ఇందులో కీలకమైన ఓ పాత్ర కోసం ముందు విజయ్ సేతుపతిని తీసుకున్న సంగతి తెలిసిందే. కానీ లాక్ డౌన్ వల్ల కాల్ షీట్స్ అన్నీ అటుఇటు కావడంతో అతను ఈ ప్రాజెక్ట్ ని వదులుకున్నాడు. తర్వాత బాబీ సింహా అనుకున్నారు కానీ ఎందుకో మరి ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. సుదీప్ ని ట్రై చేశారు. అతను ఆసక్తి చూపలేదు. దీంతో ఇప్పుడు తాజాగా బాలీవుడ్ హీరోని తీసుకునే ప్రయత్నాలు ఊపందుకున్నాయని గత కొద్దిరోజులుగా ఫిలిం నగర్ టాక్ జోరుగా ఉంది. అయితే అతను ఎవరనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. సునీల్ శెట్టి లేదా జాకీ ష్రాఫ్ లాంటి మీడియం రేంజ్ సీనియర్ స్టార్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఇదొక్కటి ఫిక్స్ అయితే పుష్పకు ఇంకెలాంటి అడ్డంకులు ఉండవు. చకచకా పూర్తి చేసుకోవచ్చు. ఈ సినిమాను వీలైనంత త్వరగా పూర్తి చేసేలా బన్నీ డిసైడ్ అయినట్టు తెలిసింది.అది సుకుమార్ మేకింగ్ స్టైల్ కి విరుద్ధం. కానీ ఈసారి తప్పేలా లేదు. ఆచార్య పూర్తి చేసుకుని వేసవికంతా కొరటాల శివ ఫ్రీ అయిపోతాడు. అక్కడి నుంచి అల్లు అర్జున్ సినిమాను స్టార్ట్ చేసేలా స్కెచ్ వేసుకున్నాడు. ఈలోగా పుష్ప రెడీ అయిపోతే ఆ ఇద్దరికీ ఎలాంటి టెన్షన్ ఉండదు. కాకపోతే ఇదంతా అనుకున్న టైంకి అంతా అనుకున్నట్టు జరిగితేనే సాధ్యమవుతుంది. పుష్ప విడుదల వేసవిలోనే ఆచార్యతో క్లాష్ కాకుండా ప్లాన్ చేస్తారు.