iDreamPost
android-app
ios-app

ఉల్లిపాయలు కోస్తేనే కాదు కొంటే కూడా కన్నీళ్లొస్తున్నాయి

ఉల్లిపాయలు కోస్తేనే కాదు కొంటే కూడా కన్నీళ్లొస్తున్నాయి

ఉల్లి ధరలకు మళ్ళీ రెక్కలొచ్చాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లి పంట దెబ్బతింది. దానివల్ల ఉల్లి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. తాజాగా హైదరాబాద్ మలక్ పేట మార్కెట్ లో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉల్లిధర దాదాపు కిలో 100 కి చేరుకుంది. దీనితో ఉల్లిపాయలు కొనాలి అంటేనే సామాన్యులు భయపడే పరిస్థితి ఏర్పడింది. సామాన్యులైతే మాత్రం ఉల్లి ధర మళ్ళీ ఎప్పుడు దిగొస్తుందా అని ఎదురు చూస్తున్నారు. ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే సామెత ఉంది. కానీ అలాంటి ఉల్లి ఇప్పుడు సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతుంది అనడంలో సందేహం లేదు.

మన దేశంలో పరిస్థితే ఇలా ఉంటే మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. భారత దేశ అవసరాల కోసం బంగ్లాదేశ్ కు ఉల్లి ఎగుమతులను మన దేశం నిలిపివేసింది. మన దేశం నుండి ఉల్లి దిగుమతి ఆగిపోవడంతో బంగ్లాదేశ్‌లో కిలో ఉల్లిపాయల ధర రికార్డు స్థాయిలో రూ.220 కు చేరింది. దీంతో ఆ దేశ ప్రభుత్వం విమానాల ద్వారా టర్కీ, ఈజిప్ట్‌, చైనా నుంచి ఉల్లిని దిగుమతి చేసుకుంటూ ఉల్లి ధరలను తగ్గించే ప్రయత్నాలను చేస్తుంది. సాక్షాత్తు ఆ దేశ ప్రధానమంత్రి షేక్ హసీనా తన వంటల్లో ఉల్లిపాయలు వాడటం మానేశానని తెలపడం విశేషం.

పరిస్థితి ఇలాగే కొనసాగితే ఉల్లి సామాన్యుల వంటగదికి దూరమై సంపన్నుల వంటగదికి మాత్రమే పరిమతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రభుత్వం జోక్యం చేసుకుని ఉల్లి ధరలను సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు.