iDreamPost
android-app
ios-app

ఎట్టకేలకు విపణిలోకి వన్‌ప్లస్‌ నార్డ్

ఎట్టకేలకు విపణిలోకి వన్‌ప్లస్‌ నార్డ్

సంవత్సరానికి ఒక ప్రీమియం ఫోన్ విడుదల చేసే వన్‌ప్లస్‌ కంపెనీ మొదటిసారిగా మిడ్ రేంజ్ మొబైల్ ప్రియులను దృష్టిలో పెట్టుకుని వన్‌ప్లస్‌ నార్డ్ ను ఎట్టకేలకు తీసుకొచ్చింది.

ప్రీమియం సెగ్మెంట్ లో సంచలనాలు సృష్టించిన వన్‌ప్లస్‌ కంపెనీ తొలిసారిగా మిడ్ రేంజ్ మొబైల్‌ను తీసుకురానున్నట్లు ప్రకటన చేయడంతో టెక్ ప్రియుల కళ్ళు ఆ ఫోన్ పై పడ్డాయి. రోజుకో స్పెసిఫికేషన్ లీక్ చేస్తూ అంచనాలను రేకెత్తించిన ఈ మొబైల్‌ను ఏ ధరలో తీసుకువస్తారో అన్న సందేహాలను నివృత్తి చేస్తూ ఎట్టకేలకు నార్డ్ మొబైల్‌ ధరను వన్‌ప్లస్‌ కంపెనీ నిర్వహించిన ఈవెంట్ లో రివీల్ చేసింది.

మూడు వేరియెంట్లలో రానున్న వన్‌ప్లస్‌ నార్డ్ మొబైల్ ధరలను పరిశీలిస్తే 8జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ.27,990గా,12జీబీ/ 256 జీబీ వేరియంట్‌ ధర రూ.29,999గా నిర్ణయించింది.. కాగా 6జీబీ/ 64 జీబీ వేరియంట్‌ను కూడా తీసుకొస్తున్నట్లు ప్రకటించినా ఇది సెప్టెంబర్‌లో అందుబాటులో రానున్నట్లు వన్‌ప్లస్‌ కంపెనీ తెలిపింది. దీని ధరను రూ.24,999గా నిర్ణయించింది.

వన్‌ప్లస్‌ నార్డ్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే 6.44 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ+ ఫ్లూయిడ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లేతో 90Hz రీఫ్రెష్‌ రేట్‌తో రానుంది. ఆండ్రాయిడ్‌ 10 పై ఆక్సిజన్‌ ఓఎస్‌తో అందుబాటులోకి రానున్న ఈ మొబైల్‌లో స్నాప్‌డ్రాగన్‌ 765జీ ప్రాసెసర్‌ను వినియోగించారు. ఇది 5g ప్రాసెసర్ కావడం గమనార్హం.దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాక 5జీ సదుపాయం కల్పిస్తామని వన్‌ప్లస్‌ కంపెనీ వెల్లడించింది. ఇన్‌బిల్ట్‌ ఫింగర్‌ ప్రిట్‌ స్కానర్‌ తో ఈ మొబైల్ పనిచేస్తుంది.

కెమెరాల విషయానికి వస్తే వెనుకవైపు 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కాగా 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరా, 2 ఎంపీ మాక్రో కెమెరా, 5 ఎంపీ డెప్త్‌ సెన్సర్‌ వినియోగించారు. ముందు వైపు డ్యూయల్ హోల్‌ పంచ్‌ కెమెరాలో 32ఎంపీ ప్రధాన కెమెరాతో పాటు 8 ఎంపీ వైడ్‌ యాంగిల్‌ కెమెరాను నార్డ్ మొబైల్లో ఉపయోగించారు. 4,115 ఎంఏహెచ్‌ బ్యాటరీతో రానున్న ఈ మొబైల్లో 30T ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ టెక్నాలజీ వల్ల బ్యాటరీ సున్నా నుండి 70% ఛార్జ్ కావడానికి కేవలం 30 నిమిషాల సమయం పడుతుంది.

వన్‌ప్లస్‌ నార్డ్ 8జీబీ మరియు 12 జీబి వేరియెంట్లు ఆగస్టు 4 నుండి అమెజాన్‌, వన్‌ప్లస్‌.కామ్‌లో అందుబాటులోకి రానున్నాయి. కానీ 6 జీబి వేరియెంట్ మాత్రం సెప్టెంబరులో అందుబాటులో రానున్నట్లు వన్‌ప్లస్‌ కంపెనీ తెలిపింది.