iDreamPost
android-app
ios-app

గ్రామస్వరాజ్య స్థాపనకు బాటలు వేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ 

  • Published Oct 02, 2020 | 5:13 AM Updated Updated Oct 02, 2020 | 5:13 AM
గ్రామస్వరాజ్య స్థాపనకు బాటలు వేస్తున్న గ్రామ సచివాలయ వ్యవస్థ 

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం సాకారమవ్వాలంటే స్థానిక పాలన వలనే సాధ్యమని పరిపాలనా ఫలాలు మారుమూల గ్రామల్లో సైతం అట్టడుగు వర్గాలకు చేరినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సిద్దించినట్లనేవారు బాపూజీ .

ఒక పెన్షన్ కావాలంటే , రేషన్ కార్డు దరఖాస్తు చేసుకోవాలంటే , ఒక గుర్తింపు కార్డు పొందాలంటే , పంచాయితీ కార్యాలయానికి , సిఫార్సు కోసం స్థానిక నాయకుడి ఇంటికి , మళ్లీ మండల కార్యాలయానికి ఎక్కేగడప దిగేగడపగా పనులు మానుకొని తిరగాల్సి వచ్చేది . ఉద్యోగో , నాయకుడో అందుబాటులో లేకపోతే మరోసారి మరోసారి అంటూ పదే పదే తిరిగి విసిగి వేసారాల్సి వచ్చేది . తృణమో పణమో చేతిలో పెట్టకపోతే తిరిగితిరిగి చెప్పులు అరగటమే తప్ప ఫలితం ఉండేది కాదు . ఇహ అధికార పార్టీ వర్గం కాకపోతే కొన్ని చోట్ల దరఖాస్తులు బుట్ట దాఖలు అయ్యేవి . ఆ పరిస్థితులకు ఆంధ్రప్రదేశ్ లో మంగళం పాడింది గ్రామ సచివాలయ వ్యవస్థ .

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ జగన్ ఆలోచనల మేరకు గ్రామ స్వరాజ్య స్థాపన లక్ష్యంగా రూపుదిద్దుకొన్న మరో సంచలనాత్మక వ్యవస్థ గ్రామ సచివాలయాలు . గత సంవత్సరం ఇదే రోజున గాంధీ జయంతి సందర్భంగా రెండు వేలకి మించి జనాభా ఉన్న ప్రతి గ్రామానికి ఒకటి చొప్పున 11162 గ్రామ సచివాలయాలు , పట్టణాల్లో ప్రతి వార్డుకీ ఒకటి చొప్పున 3842 వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం 11 ప్రభుత్వ శాఖలకు చెందిన 543 రకాల పౌర సేవలను ఈ సచివాలయాల పరిధిలోకి చేర్చింది .  తద్వారా 1.34 వేల మందికి ఉద్యోగాలు కల్పించింది వైసీపీ ప్రభుత్వం .

ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపిక , వారికి గుర్తింపు కార్డుల జారీ వంటి సేవలను ఈ సచివాలయ పరిధిలోకి తీసుకురావటమే కాకుండా , పలు రకాల ధ్రువీకరణ సెర్టిఫికెట్స్ , రైతు గుర్తింపు కార్డులు , పట్టాదారు పాసుబుక్కుల అప్లికేషన్స్ , ఇళ్ల స్థలాల కేటాయింపు వంటి వివిధ సేవలు అదే గ్రామంలో అందించేందుకు ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయాల వలన అటు ప్రభుత్వానికి పాలన సులభతరం కాగా , ఇటు ప్రజలకు ఏ విధమైన శ్రమ , అడ్డంకులు లేకుండా ప్రభుత్వ సేవలు సులభతరంగా పొందే అవకాశం లభించింది .

ఇది మాత్రమే కాదు , ప్రతి సేవకు నిర్ణీత గడువు విధించి ఆ గడువులోగా అర్హతలని బట్టి సేవలు అందించాలనే నిబంధనల మూలంగా గ్రామ ప్రజలందరూ రాజకీయ అడ్డంకులు , అవినీతి , లంచగొండితనం బారిన పడకుండా పారదర్శకంగా పౌర సేవలు వినియోగించుకునే అవకాశం దక్కింది .
గత ఏడాది ఇదే రోజు శ్రీకారం చుట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఈ యాడాదిలో కోటికి పైగా పలు రకాల సేవలకు సంభందించి వినతి పత్రాలు రాగా 94 లక్షల పై చిలుకు వినతుల్ని పరిష్కరించడం జరిగింది . ప్రభుత్వ రంగ పరిపాలనా విభాగం 94 శాతం సంతృప్త స్థాయి సాధించడం అనేది అద్భుతమైన రికార్డు అని చెప్పొచ్చు …

క్షేత్ర స్థాయిలో అవినీతి , అలసత్వం లేకుండా చేస్తే ప్రభుత్వ పాలనా ఫలాలు ప్రజలకు ఎంత మేలు చేస్తాయనేదానికి గొప్ప ఉదాహరణ గ్రామ సచివాలయ వ్యవస్థ ….
గాంధీజీ కలల సాకారం దిశగా అత్యుత్తమ సేవలు అందిస్తున్న సచివాలయ వ్యవస్థ గాంధీ జయంతి రోజే పురుడు పోసుకొని మొదటి వార్షికోత్సవం జరుపుకోవడం విశేషం . వారి సేవలు ఇదేవిధంగా కొనసాగితే అద్భుత సేవా వ్యవస్థగా దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని చెప్పొచ్చు .