iDreamPost
android-app
ios-app

మోడీ క్యాబినెట్ లో చోటు లేని ఆంధ్రప్రదేశ్? ఏపీ కి మళ్లీ మొండిచేయి!

  • Published Jul 02, 2021 | 9:07 AM Updated Updated Jul 02, 2021 | 9:07 AM
మోడీ క్యాబినెట్ లో చోటు లేని ఆంధ్రప్రదేశ్? ఏపీ కి మళ్లీ మొండిచేయి!

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు అంతా సిద్ధమయ్యింది. మోడీ మంత్రివర్గంలో మార్పులు, చేర్పులకు లైన్ క్లియర్ అయ్యింది. ఒకటి రెండు రోజుల్లోనే ఈ వ్యవహారంలో అధికారిక ప్రకటన రాబోతోంది. ఇప్పటికే ఆశావాహులంతా ఢిల్లీలో ఎదురుచూపులు చూస్తున్నారు. ఎవరి ప్రయత్నాల్లో వారు ఉన్నారు. అయితే ఈసారి కూడా ఏపీ నుంచి క్యాబినెట్ బెర్త్ లేదనే చెబుతున్నారు. గడిచిన నాలుగేళ్లుగా ఏపీకి సంబంధించిన నేతలెవరూ మోడీ మంత్రివర్గంలో లేరు. తొలి మూడున్నరేళ్ల పాటు టీడీపీ మిత్రపక్షం కావడంతో అప్పట్లో అశోక్ గజపతిరాజు, సుజనా చౌదరి ప్రాతినిధ్యం వహించారు. అంతకుముందు వెంకయ్యనాయుడు కూడా క్యాబినెట్ లో ఉండేవారు. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడంతో ఆ ఇద్దరూ రాజీనామా చేసిన తర్వాత మళ్లీ ఆంధ్రుడికి మోడీ క్యాబినెట్ లో చోటు దక్కలేదు.

గడిచిన పార్లమెంట్ లో ఏపీ నుంచి ఇద్దరు బీజేపీ ఎంపీలున్నారు. అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు తోపాటు గోకరాజు గంగరాజు కూడా లోక్ సభకు ప్రాతినిధ్యం వహించారు. దాంతో ఆ ఇద్దరిలో ఒకరికి చోటు కల్పించే అవకాశం ఉందని అప్పట్లో ఊహాగానాలు వచ్చినా చివరకు మోడీ మాత్రం ఉసూరుమనిపించారు. మొన్నటి ఎన్నికల్లో సిట్టింగ్ సీట్లను బీజేపీ కోల్పోయింది. దాంతో రాష్ట్రం నుంచి ఆపార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది. కానీ అంతలోనే టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు నలుగురు కాషాయ కండువాలు కప్పుకోవడంతో ప్రస్తుతం ముగ్గురు ఎగువ సభ ఎంపీలు బీజేపీలో ఉన్నారు. వారిలో మాజీ మంత్రి సుజనా, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ ప్రస్తుతం బీజేపీ తరుపున ఆంధ్ర నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

ఈసారి క్యాబినెట్ కూర్పులో టీజీ వెంకటేష్ కి అవకాశం ఉంటుందని కొంత ప్రచారం జరిగింది. అదే సమయంలో ప్రస్తుతం మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభలో ఉన్న ఏపీకి చెందిన జీవీఎల్ నరసింహరావు కూడా పోటీ పడ్డారు. అయితే ప్రస్తుతం ఈ ఇద్దరికీ అవకాశం లేదనే ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీకి మరో ఆరు నెలల్లో ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఆరాష్ట్రం నుంచే ఐదారుగురికి అవకాశం దక్కబోతోంది. అందులో వరుణ్ గాంధీ, రీటా బహుగుణ, రాంశంకర్ కథేరియా, అనిల్ జైన్, జాఫర్ ఇస్లాం పేర్లు ఖరారయినట్టు చెబుతున్నారు. అప్నాదళ్ పార్టీకి కూడా అవకాశం ఇస్తే అరడజను బెర్తులు ఆ ఒక్క రాష్ట్రానికే దక్కుతాయి. ఇక బెంగాల్, బీహార్ తో పాటు మధ్య ప్రదేశ్ కి చెందిన నేతలు కూడా ఆయా రాష్ట్రాల నుంచి ఇద్దరేసి చొప్పున దాదాపు పేర్లు ఖాయమని ధీమాతో ఉన్నారు.

మొత్తం 25 బెర్తుల్లో నాలుగో వంతు యూపీకి ఆ తర్వాత మిగిలిన ఉత్తరాది రాష్ట్రాలకు ప్రాధాన్యం దక్కే అవకాశం ఉండడంతో దక్షిణ రాష్ట్రాలకు పెద్దగా ఛాన్స్ లేదని చెబుతున్నారు. ఇక ఎంపీ కోటాలో జీవీఎల్ ఆశించినా అక్కడి నుంచి జ్యోతిరాదిత్య తో పాటుగా మరో ఇద్దరు నేతలు ముందు వరుసలో ఉండడంతో జీవీఎల్ ఆశలపై నీళ్లు జల్లినట్టవుతోందని సమాచారం. మొత్తంగా మోడీ క్యాబినెట్ లో ఏపీకి అవకాశం లేకుండా మొండిచేయి చూపుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక తెలంగాణాలో కిషన్ రెడ్డి వ్యవహారం కూడా చర్చనీయాంశమే. ఆయన స్థానంలో ధర్మపురి అరవింద్ కి అవకాశం ఇవ్వాలని ఓ వర్గం బలంగా ప్రయత్నాలు సాగిస్తోంది. దాంతో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మోడీ మంత్రివర్గ కూర్పులో తగిన అవకాశాలు దక్కుతాయా లేదా అన్నది సందేహమే.

Also Read : ఢిల్లీ కి భట్టి.. కార‌ణం ఇదేనా?