iDreamPost
iDreamPost
ఒక భాషలో బ్లాక్ బస్టర్ గా నిలిచి ఇండస్ట్రీ రికార్డులు సృష్టించిన సినిమా ఇంకో లాంగ్వేజ్ లో రీమేక్ అయినప్పుడు అదే ఫలితాన్ని దక్కించుకోదని చరిత్ర చాలాసార్లు ఋజువు చేసింది. దీనికి కొన్ని మినహాయింపులు లేకపోలేదు. చంటి, పెదరాయుడు, ఘరానా మొగుడు ఒరిజినల్ వెర్షన్ల కన్నా తెలుగులో బాగా ఆడిన విషయం మర్చిపోకూడదు. కానీ ఇలా ప్రతిసారి జరగదు. దీనికి మంచి ఉదాహరణ చూద్దాం. విలక్షణ నటుడు ఉపేంద్ర కెరీర్ ప్రారంభంలో దర్శకుడన్న సంగతి తెలిసిందే. కన్నడలో కామెడీ డెబ్యూ ‘తర్లే నన్ మగా’ తర్వాత హారర్ థ్రిల్లర్ ‘ష్’ తో పెద్ద సంచలనమే రేపారు. మూడో సినిమాగా స్టార్ హీరో శివరాజ్ కుమార్ తో 1995లో ఓం టైటిల్ తో వయొలెంట్ లవ్ స్టోరీని ప్రకటించారు ఉపేంద్ర.
అప్పటిదాకా కమర్షియల్ సినిమాలు చేసుకుంటూ మార్కెట్ లో సేఫ్ గేమ్ ఆడుతున్న శివరాజ్ కుమార్ కు ఇది పూర్తిగా కొత్త జానర్. ఓ అమ్మాయి చేతిలో ప్రేమ పేరుతో దారుణంగా మోసపోయి సర్వం కోల్పోయి అమాయకుడైన ఓ బ్రాహ్మణ యువకుడు కరుడు గట్టిన రౌడీగా మారి హింసాత్మక ధోరణిలో ముందు ఆమెను బెదిరించి భయపెట్టి ఆ తర్వాత నిజమైన ప్రేమంటే ఏమిటో తెలిసేలా చేయడమే ఈ చిత్ర కథ. 70 లక్షల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విడుదలకు ముందే 2 కోట్ల బిజినెస్ చేసి శాండల్ వుడ్ ట్రేడ్ ని షాక్ కు గురి చేసింది. థియేటర్లలోకి అడుగుపెట్టాక పూనకాలు వచ్చినట్టు జనం పోటెత్తారు. ప్రేమలోని సరికొత్త కోణాన్ని ఎవరూ ఊహించని రీతిలో ప్రెజెంట్ చేసిన ఉపేంద్ర టేకింగ్ కి నీరాజనాలు పట్టి కలెక్షన్ల వర్షం కురిపించారు. 20 కోట్లకు పైగా గ్రాస్ రావడం ఇప్పటికీ చరిత్రే.
సినీ చరిత్రలో 1995 నుంచి 2013 దాకా 500 సార్లు 400 థియేటర్లలో రీ రిలీజైన మూవీగా లిమ్కా బుక్ అఫ్ రికార్డ్స్ లో ‘ఓం’ స్థానం సంపాదించుకుంది. 2015లో డీటీఎస్ చేసి రీమాస్టర్ ప్రింట్ తో మళ్ళీ వంద థియేటర్లలో విడుదల చేయడం అనూహ్యం. ఇరవై ఏళ్ళ తర్వాత శాటిలైట్ టెలికాస్ట్ కు నోచుకున్న చిత్రం కూడా ఇదే కావొచ్చు. అంత పాత సినిమాకు ఉదయ ఛానల్ 10 కోట్లు చెల్లించడం ఎప్పటికీ చెరిగిపోని రికార్డు. హంసలేఖ సంగీతం ఆడియో సేల్స్ ని ఎక్కడికో తీసుకెళ్లింది. హీరోయిన్ ప్రేమ డిమాండ్ అమాంతం పెరిగిపోయి ఆవిడ డేట్స్ కొన్నేళ్ల పాటు దొరకనంత బిజీ అయిపోయారు. దీన్నే ఉపేంద్ర మక్కికి మక్కి రాజశేఖర్ హీరోగా ‘ఓంకారం’ పేరుతో రీమేక్ చేస్తే ఇక్కడ ఆశించిన విజయం దక్కించుకోలేదు. హీరో తప్ప టీమ్ మొత్తాన్ని దాదాపు అదే తీసుకున్నా ఫలితం దక్కలేదు. ఇప్పటికీ కర్ణాటకలో ఓం సినిమాకు ఒక ఫ్యాన్ కల్ట్ బేస్ ఉంది. ఒకరకంగా చెప్పాలంటే కన్నడ సినిమా స్థాయిని పెంచిన మూవీగా కెజిఎఫ్ ను చెప్పుకుంటాం కానీ ‘ఓం’ ఇలాంటి వాటికి మెగా బాస్ అని పరిగణించాలి. సాక్ష్యంగా పైన చెప్పిన రికార్డుల కంటే ఇంకే ఎవిడెన్సులు అక్కర్లేదు.