హైదరాబాద్‌లో మాల్‌లో సినిమాకెళితే , ఒక్కసారి తప్పనిసరై పాప్‌కార్న్ కొనాల్సి వస్తుంది. రూ.300 ఇస్తున్నప్పుడు కడుపు కాలిపోతుంది. అరలీటర్ వాటిల్ బాటిల్‌కి రూ.50 ఇస్తుంటే, నిలువుదోపిడీ ఇచ్చినట్టుంటుంది.
ఒకప్పుడు థియేటర్ చుట్టూ జీవన చిత్రం కనిపించేది. ఎంతో మంది పేదవాళ్లు బతికేవాళ్లు. సరుకుని అమ్మడమే తప్ప, దోపిడీ చేయడం తెలియనివాళ్లు.
శంకర్ అనే ఫ్రెండ్ ఉండేవాడు. వాళ్లనాన్నకి కిరాణా కొట్టు ఉండేది. దాంతో వీడి జేబులో కూడా చిల్లర ఉండేది. ఒకరోజు గల్లా పెట్టెలో ఐదు రూపాయలు లేపేశాడు. ఇద్దరూ కలిసి సినిమాకి వెళ్లాం. బెంచీ టికెట్ ఇద్దరికి, రూ.1.50 పైసలు టికెట్ తీసుకున్నాం. సినిమా స్టార్ట్ కావడానికి ఇంకా అరగంట టైమ్.
బయట సుంకయ్య హోటల్‌లో ఆరు మిరప కాయ బజ్జీలు కారెం ఎక్కువై బుస కొడుతూ తిన్నాం, బిల్లు 30 పైసలు. రెండు జేబుల నిండా వేరుశనగ కాయలు నింపాం, ఖరీదు 20 పైసలు. ఇంకా 3 రూపాయలు ఉంటుంది.
చెరి ఒక కలర్ సోడా 40 పైసలు. తలా రెండు వేరుశనగ బర్ఫీలు 20 పైసలు. ఇంకా రూ.2.40 పైసలు ఘల్లుమంటూ మోగుతూ ఉంది.
ఇంతలో సినిమా స్టార్ట్ చేశారు. ఘంటశాల పాట ఎత్తుకోగానే జనం కాళ్లు పచ్చడి చేస్తూ “మురుకు మురుకు” అంటూ ఒకడొచ్చాడు. నాలుగు మురుకులు కరకరలాడించాం. 20 పైసల ఇత్తడి బిల్ల చేతులు మారింది. ఎన్టీఆర్ కత్తి యుద్ధం స్టార్ట్ అయ్యేసరికి జేబులోని శనక్కాయలు అయిపోయాయి. ఆపద్బాంధవుడిలా “కారెం బొరుగులు” అని ఒకడు గంపనెత్తిన పెట్టుకుని జనాలకి అడ్డం వస్తే కెవ్వుమని అరిచారు. మేము 20 పైసలు మాది కాదనుకుని బొరుగుల పొట్లాలు అందుకున్నాం.
దేవికని కౌగలించుకుని NTR పాట ఎత్తుకున్నాడు. నోరు కారెమయ్యింది. కుయ్యికుయ్యిమని సౌండ్ ఇస్తూ సోడాల వాడు ప్రత్యక్షమయ్యాడు. నిమ్మకాడ సోడా చల్లగా దిగింది. 40 పైసలు నడిచి వెళ్లింది.
బ్రేవ్‌మన్నాం. సినిమా అయ్యిపోయింది. బయటికొస్తే సుంకయ్య బజ్జీలు ఘుమఘుమలాడాయి. నాలుగు తిని , టీ తాగాం. ఇంకా రూ.1.30 పైసలు మిగిలింది. పొట్టలో ఖాళీ లేదు. జట్కా మాట్లాడితే అర్ధరూపాయి అడిగాడు. ఓస్ ఇంతేనా అని ఇంటికి కొంచెం దూరంలో జట్కా ఆపి నడిచి వెళ్లాం. మిగిలిన 80 పైసలతో మరుసటి రోజు ఏం చేయాలా అని ప్లాన్ చేసుకుంటూ ఇల్లు చేరా. పిల్లల్ని మోసం చేయొచ్చు అని కూడా తెలియని వెర్రికాలమది!
థియేటర్ చుట్టూ ఎంతోమంది పేదవాళ్లు బతికే కాలం!