Idream media
Idream media
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచడమే లక్ష్యంగా ఎన్నికల అధికారులు పని చేస్తున్నారు. మై జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ‘నో యువర్ పోలింగ్ బూత్ ’ సర్వీసును అందిస్తున్నారు. ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ఓటింగ్ శాతం తక్కువగా ఉండటంతో 2016 తర్వాత జరిగిన ఎన్నికల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడంతో పోలింగ్ శాతం పెరగిందని జీహెచ్ఎంసీ అధికారులు గుర్తించారు.
గతంలో వరుసగా జరిగిన మూడు గ్రేటర్ ఎన్నికల్లోనూ ఓటింగ్ 50శాతానికి మించలేదు. 2002 – 16 మధ్యలో జరిగిన బల్దియా ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని చూసి ఆశ్చర్యపోయిన అధికారులు ఎక్కువ మందిని పోలింగ్ బూత్‌లకు రప్పించాలని లక్ష్యంగా చేసుకున్నారు. ఉన్నత విద్యావంతులు, ఎగువ మధ్య తరగతి, ధనిక కుటుంబాలు, ఐటీ ఉద్యోగులు నివసించే డివిజన్లలోనే ఓటింగ్ శాతం తక్కువున్నట్టు అధికారులు గుర్తించారు. ఎన్నికల రోజు ఓటు వేయడం సమయం వృథా అనే ఉద్దేశాన్ని కూడా కొందరు ఉన్నత విద్యావంతుల్లో వ్యక్తమయింది. 2018, 2019 ఏడాదిల్లో జరిగిన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు సిస్టమెటిక్ ఓటర్స్ ఎడ్యూకేషన్ అండ్ ఎలక్టోరల్ పార్టిసిపేషన్ ప్రోగ్రాం (స్వీప్) ఇన్‌చార్జిగా ఐఏఎస్ హరిచందనను నియమించారు. నగర వ్యాప్తంగా వివిధ రూపాల్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొబైల్ మిస్ కాల్ సర్వీస్, టోల్ ఫ్రీ నెంబర్, మొబైల్ యాప్, వెబ్‌సైట్‌తో పాటు నగరంలో బ్యానర్లు, ఫ్లెక్సీల ద్వారా ఓటర్ అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు.
2009లో జరిగిన బల్దియా ఎన్నికల్లో 43 %, 2002లో 42 %, 2016లో 45.27% ఓటింగ్ నమోదైంది. స్వీప్ కార్యక్రమాల ప్రభావంతో 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌లో ఓటింగ్ 48.89 శాతం నమోదవడం ఓ రికార్డుగా ఉంది. జాబితాలో పేరుందో లేదో ముందుగా నిర్ధారణ చేసుకునేందుకు, తాము ఓటు వేయాల్సిన పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో సరైన సమాచారం లేకపోవడంతో ఇబ్బందులు పడటం వంటివాటితో ఓటర్లు దూరంగా ఉంటున్నారు. ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనడాన్ని సులభతరం చేయడంతో ద్వారా ఎక్కువ మంది ప్రజల్ని ఇందులో భాగస్వామ్యం చేయం సాధ్యమవుతున్న అధికారులు గమనించారు. దీంతో సామాజిక సంఘాలు, క్లబ్స్, వాకర్ అసోసియేషన్లు, అపార్ట్ మెంట్ సొసైటీలతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమయ్యి పలు సూచనలు కూడా చేసింది. అతి తక్కువ ఓటింగ్ శాతం నమోదైన ప్రాంతాలు, వార్డులపై ప్రత్యేక దృష్టి సాధించాలని కమిషనర్ ఇటీవల కోరారు. నగరంలో విద్యాధికులు, సంపన్న వర్గాలు అధికంగా ఉండే సెంట్రల్ వెస్ట్‌జోన్‌లలోనే ఉన్న పలు వార్డుల్లో గతంలో అతి తక్కువ ఓటింగ్ నమోదవుతుండటంతో అక్కడి స్థానికంగా ఉంటే కాలనీ అసోసియేషన్స్ సభ్యుల్లో అవగాహన కల్పించేలా చూస్తున్నారు.
యాప్ ద్వారా ఓటరు స్లిప్‌లు
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రం ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు, ఓటరు స్లిప్‌లను పొందేందుకు కూడా ‘మై జీహెచ్ఎంసీ’ యాప్‌లో మార్పులు చేశారు. ఓటర్ లొకేషన్, బూత్‌ను కనుక్కొనేందుకు సాఫ్ట్ వేర్ రూపొందించారు. మొబైల్ మిస్ కాల్, టోల్ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశారు. ఆండ్రాయిడ్ మొబైల్ యాప్‌లో మై జీహెచ్ఎంసీ యాప్‌లో నో-యువర్ పోలింగ్ స్టేషన్ అప్షన్‌లో క్లిక్ చేసి ఓటరు పేరు, వార్డు పేరు ఎంటర్ చేస్తే ఓటరు స్లిప్ తో పాటు పోలింగ్ బూత్ ఎక్కడవుందో గూగుల్ మ్యాప్ లొకేషన్ వస్తుంది. పేరుకు బదులుగా ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్, వార్డు పేర్లు ఎంటర్ చేసినా ఓటర్ స్లిప్, పోలింగ్ కేంద్రం గూగుల్ మ్యాప్ వస్తుంది. ఈ నో-యువర్ పోలింగ్ స్టేషన్ యాప్ పై చైతన్యం కలిగించేందుకు జీహెచ్ఎంసీ పెద్ద ఎత్తున ప్రచారం చేపట్టింది. బస్ షెల్టర్ లపైనా ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం, ఎఫ్.ఎం. రేడియోలలో జింగిల్స్ ప్రసారం, టెలివిజన్ చానెళ్లలో స్క్రోలింగ్‌లను కూడా ఇస్తున్నారు.