iDreamPost
iDreamPost
వలసలతో కాంగ్రెస్‌కు వరుసగా షాకులు తగులుతూనే ఉన్నాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో పరాభవం తర్వాత మొదలైన వలసలు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పాకుతున్నాయే తప్ప వీటికి అడ్డుకట్ట పడే పరిస్థితి కనిపించడంలేదు. నాయకులు పార్టీని వీడకుండా నిలువరించడంలో పార్టీ అధినాయకత్వం విఫలమవుతోంది. కీలకమైన పదవుల్లో ఉన్నవారే పార్టీని వీడిపోతుండటంతో అసలే అంతంతమాత్రంగా ఉన్న పార్టీ శ్రేణుల ఆత్మస్థైర్యం మరింత దెబ్బతింటోంది. యూపీలో జితిన్ ప్రసాద, మధ్యప్రదేశ్‌లో జ్యోతిరాదిత్య సింధియా, అసోం ఎంపీ, మహిళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మితాదేవ్, గోవా మాజీ సీఎం లూజినో ఫెలీరో,మాజీ డిప్యూటీ సీఎం దాయానంద్ నర్వేకర్.. ఇంకా చాలామంది కాంగ్రెస్‌ను వీడి ఇతర పార్టీల్లోకి క్యూ కడుతున్నారు. ఇప్పుడు వారి బాటలో ఒడిశా నేతలు వలస పోతున్నారు.
పీసీసీ నేత గుడ్ బై
తాజాగా ఒడిశా రాష్ట్ర కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ ఎంపీ ప్రదీప్ మాఝీ పార్టీకి గుడ్ బై చెప్పారు. వర్కింగ్ కమిటీ అధ్యక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీకి లేఖ రాశారు. ప్రస్తుతం పార్టీలో ఉత్సాహం కొరవడిందని.. కొందరి నిర్వాహకల వల్ల పార్టీ నాశనం అవుతోందని పేర్కొన్నారు. ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయిన పార్టీ ఇప్పట్లో కోలుకోవడం కష్టమని వ్యాఖ్యానించారు.2009 ఎన్నికల్లో నవరంగపూర్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా ఎన్నికైన ప్రదీప్ 2014, 2019 లోక్‌సభ ఎన్నికలలో ఓడిపోయారు. కాంగ్రెస్‌ను వీడిన ఆయన బిజూ జనతాదళ్ (బీజేడీ)లో చేరనున్నారు. ఈ నెలలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నవరంగపూర్ పర్యటనకు రానున్నారు. ఆ సందర్భంగా ప్రదీప్ బీజేడీలో చేరతారని ఆయన సన్నిహితులు చెప్పారు.
కాంగ్రెస్‌ను వీడిన రెండో వర్కింగ్ ప్రెసిడెంట్
వరుసగా ఇద్దరు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్లు కాంగ్రెసును వీడిపోవడం విశేషం. 2019 ఎన్నికలకు ముందు పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న నబకిశోర్ దాస్ పార్టీకి రాజీనామా చేసి బీజేడీలో చేరారు. ఆ పార్టీ ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం రాష్ట్ర ఆరోగ్య మంత్రిగా ఉన్నారు.ఇప్పుడు ప్రదీప్ మాఝీ కూడా బీజేడీలోనే చేరనున్నారు.ఒడిశాలో కొద్దిరోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న తరుణంలో ఆయన రాజీనామా కాంగ్రెస్‌కు గట్టి ఎదురుదెబ్బ అని చెప్పవచ్చు.ఇక నవరంగపూర్, మల్కాన్‌గిరి జిల్లాలలో ప్రముఖ గిరిజన నేతగా పేరొందిన ప్రదీప్ మాఝీ రాజీనామా చేయడం కాంగ్రెస్ అవకాశాలపై ప్రభావం చూపుతుంది.
Also Read : కాంగ్రెస్‌లో చేరిన బీజేపీ మంత్రి యశ్ పాల్ ఆర్య