దిశ, ఉన్నావ్ అత్యాచార ఘటనల నేపథ్యంలో మహిళల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు నడుం బిగించాయి. కేంద్ర ప్రభుత్వం 2013 లో చేసిన నిర్భయ చట్టం అత్యాచారాలను ఏ మాత్రం ఆపలేకపోతోంది. పైగా ఇంకా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త చట్టాలు తెస్తున్నాయి. తాజా పరిస్థితుల తర్వాత దేశంలో మొదటి సారిగా ఆంద్రప్రదేశ్ సర్కార్ స్పందించింది. మహిళల రక్షణ కోసం చట్టం తెచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే అసెంబ్లీ లో సీఎం జగన్ ప్రకటించారు. ఈ రోజు బిల్లుకు మంత్రి వర్గం ఆమోదం, పై అసెంబ్లీ లో ప్రవేశ పెట్టడం చక చక జరిగిపోనున్నాయి. నిందితులకు 21 రోజుల్లో శిక్ష విధించడమే లక్ష్యంగా కొత్త చట్టం రాబోతోంది. ఇందు కోసం ప్రతి జిల్లాలో ప్రత్యేక న్యాయ స్థానం ఏర్పాటు చేయనున్నారు.
తాజాగా ఆంద్రప్రదేశ్ బాటలో పొరుగున ఉన్న ఒడిశా రాష్ట్రం నడుస్తోంది. అత్యాచారాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో మహిళలు, బాలికలపై అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి 45 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఒడిశా రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ప్రతాప్ జెనా వెల్లడించారు. రాష్ట్రంలో మహిళలపై జరిగిన అత్యాచారం కేసుల సత్వర పరిష్కారానికి 21 ఫాస్ట్ ట్రాక్ కోర్టులు, బాలికలపై జరిగిన అత్యాచారం కేసుల దర్యాప్తునకు 24 ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తామని మంత్రి తెలిపారు. అత్యాచారం కేసుల్లో దోషులకు సత్వరం శిక్షలు పడేలా చేసేందుకు ఒడిశా సర్కారు ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేస్తోంది.