iDreamPost
iDreamPost
లాక్ డౌన్ టైంలో తెలుగు సినిమాలు ఓటిటి విషయంలో పెద్దగా కదలిక చూపించలేదు కానీ ఇప్పుడు మాత్రం పరిణామాలు జెట్ స్పీడ్ వేగంతో సాగుతున్నాయి. ఒక్కొక్కటిగా డిజిటల్ రిలీజ్ డేట్లు ఫిక్స్ చేసుకుంటూ మూవీ లవర్స్ కి విందు అందించేందుకు రెడీ అంటున్నాయి. ఒకే నెలలలో ఎక్కువ విడుదలలు అక్టోబర్ లోనే ఉండబోతున్నాయి. 2వ తేదీ ఆహా ద్వారా రాజ్ తరుణ్ ‘ఒరేయ్ బుజ్జిగా’ దీనికి శ్రీకారం చుట్టబోతోంది. ఇప్పటికే ప్రమోషన్లు కూడా జరిగిపోతున్నాయి. అనుష్క ‘నిశ్శబ్దం’ కూడా అదే తేదీకి ప్రైమ్ ద్వారా వస్తుందనే టాక్ జోరుగా ఉంది కానీ ఇంకా అఫీషియల్ గా ప్రకటించాల్సి ఉంది. తేదీలో మార్పు ఉన్నా నెల మాత్రం పక్కానే.
సుహాస్ హీరోగా రూపొందిన ‘కలర్ ఫోటో’ ఆహాలోనే 23కి డేట్ లాక్ చేసుకుంది. యూనిట్ సభ్యులు పబ్లిసిటీ కూడా వేగవంతం చేశారు. ఇక సౌత్ లోనే మోస్ట్ క్రేజీ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా తెరకెక్కిన సూర్య ‘ఆకాశం నీ హద్దురా’ 30న పలకరించి మంత్ ఎండింగ్ తో ఫేర్ వెల్ చెప్పేస్తుంది. అన్ని సినిమాలు ఒకదానితో మరొకటి సంబంధం లేని జానర్లు కావడంతో అంచనాలు బాగానే ఉన్నాయి. రెండు ఆహా ద్వారా రెండు ప్రైమ్ ద్వారా ఫిక్సయినవి కావడం గమనార్హం. ఇంకా నెట్ ఫ్లిక్స్, జీ5 నుంచి ఎలాంటి ప్రకటనలు రాలేదు. రంగ్ దే, సోలో బ్రతుకే సో బెటరూకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయనే టాక్ వస్తోంది కానీ ఎప్పుడు ఫైనల్ అవుతాయో తెలియదు. హటాత్తుగా ప్రకటనలు వచ్చినా ఆశ్చర్యం లేదు.
ఒకవైపు థియేటర్లు వచ్చే నెల తెరుస్తారేమోనన్న సంకేతాలు గట్టిగానే కనిపిస్తున్నాయి. అయితే జనం మునుపటిలా వచ్చే అవకాశాలు, సీట్లు హౌస్ ఫుల్ చేసుకునే వెసులుబాటు లేవు కాబట్టి కొత్త సినిమాలు అంత ఈజీగా హళ్ళకు వచ్చేలా లేవు. కొద్దిరోజులు పరిస్థితిని గమనించి ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలని నిర్మాతలు వేచి చూస్తున్నారు. ఉప్పెన, రెడ్, అరణ్య, లవ్ స్టొరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, వైల్డ్ డాగ్ తదితరరాలు థియేట్రికల్ రిలీజ్ కే మొగ్గు చూపుతున్నాయి. కొన్ని 2021 సంక్రాంతికి ప్లాన్ చేసుకుంటున్నాయి. వీటి సంబంధించి క్లారిటీ రావడానికి కొంత టైం పట్టేలా ఉంది. ఏదైతేనేం తెలుగులో ఓటిటి రిలీజులు తక్కువగా ఉన్నాయని ఫీలవుతున్న వాళ్ళకు అక్టోబర్ నెల వరస కానుకలతో ముంచేత్తనుంది. ఒకవేళ నవంబర్ నాటికి వైరస్ పూర్తిగా తగ్గుముఖం పడితే వెండితెర వినోదానికి సిద్ధం కావొచ్చు.