రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బిగ్ బాస్ ఫేమ్ నూతన్ నాయుడు ఇంట్లో దళిత యువకుడికి శిరోముండనం కేసులో పోలీసులు వేగంగా ముందుకు వెళ్తున్నారు . ఈ కేసులో తవ్వేకొద్దీ నూతన్ నాయుడు చేసిన అక్రమాల చిట్టా బయటపడుతు వస్తుంది. శిరోముండనం ఘటన జరిగిన వెంటనే నూతన్ నాయుడు భార్య మధుప్రియతో సహా మరో ఏడుగురిపై పెందుర్తి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను కోర్టు ముందు హాజరుపరచగా వారికి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించిన విషయం తెలిసిందే .
ఇది ఇలా ఉంటే శిరోముండనం ఘటన జరిగిన రోజు నుండి పోలీసులకు దొరకకుండా పరారీలో ఉన్న నూతన్ నాయుడు తాజాగా ముంబైకి పారిపోయేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో అతన్ని కర్ణాటకలోని ఉడిపిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిరోముండనం కేసులో నూతన్ నాయుడు పాత్ర ఉందని తేలిన తరువాతనే అతన్ని అరెస్ట్ చేశామని విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా వెల్లడించారు. అలాగే నూతన్ నాయుడుకి శిరోముండనం వ్యవహారంలో తన ప్రమేయం ఉండటంతో పాటు పోలీస్ విచారణలో అనేక రకమైన నేరాలలో కూడా తన పాత్ర బయటపడినట్టు తెలుస్తుంది.
జనసేన నేతగా , పవన్ కల్యాణ్ అభిమానిగా, ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ మీద పరాన్నజీవి పేరుతో తీసిన చిత్రానికి దర్శకుడిగా, బిగ్ బాస్ ఫేమ్ తో సమాజంలో పేరు గడించిన నూతన్ నాయుడు ఆంద్రప్రదేశ్ సిఎం ప్రధాన కార్యదర్శి పివి రమేష్ పేరును చెబుతూ ప్రజలను మోసం చేస్తూ డబ్బు వసూల్ కి పాల్పడుతునట్టు తేలింది. ఈ వ్యవహారం పై పీవి రమేష్ కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా స్పందించారు. నూతన్ నాయుడు తనకు తెలియకుండా తన పేరుని వాడుకుని ఎవరి దగ్గరైన డబ్బుని వసూలు చేసి ఉంటే వారు వెంటనే డిజీపి గారికి కానీ సీపి గారికి కానీ వెంటనే ఫిర్యాదు చేయాలని. తన చిత్తశుద్ధిని ఖ్యాతిని దెబ్బతీసే విధంగా నూతన్ నాయుడు తన పేరును, లేదా తనకు సంబందించిన వారి పేరుని వాడుకోవడం తీవ్రమైన నేరం గా భావిస్తునట్టు చెప్పుకొచ్చారు. నూతన్ నాయుడు వ్యవహారం మోసగాళ్ళకు ఒక పాఠంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.