iDreamPost
android-app
ios-app

రిజర్వేషన్ నెంబర్ 34

రిజర్వేషన్ నెంబర్  34

నంబర్‌ 34.. దీనికి ప్రత్యేకత అంటూ ఏమీ లేదు. కానీ ఇప్పుడు ఏపీలో ఈ నంబర్‌ చుట్టూనే రాజకీయం అంతా నడుస్తోంది. రాజకీయ పార్టీలు, నేతలు, మీడియా.. ఎక్కడ చూసినా అందరి నోటా నంబర్‌ 34 ప్రముఖంగా వినిపిస్తోంది. దీనికి కారణం.. రిజర్వేషన్లు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల అంశంపై ఏపీలో నంబర్‌ గేమ్‌ సాగుతోంది. రిజర్వేషన్లు ఖరారై నోటిపికేషన్లు వచ్చినా.. కూడా ఈ నంబర్‌ గేమ్‌ కొనసాగుతుండడం విశేషం.

పరిపాలనైనా.. ఎన్నికలైనా.. సాఫీగా సాగితే అది రాజకీయం ఎందుకవుతుంది?. రాజకీయ పార్టీలకు పని ఏముంటుంది..? ఈ లైన్‌లోనే నంబర్‌ 34 చుట్టూ రాజకీయం ప్రారంభమైంది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వడం వల్ల రిజర్వేషన్లు 50 శాతం దాటుతున్నాయని, ఇది రాజ్యంగ విరుద్ధమని టీడీపీ నేత బిర్రు ప్రతాప్‌ రెడ్డి, మరి కొందరు న్యాయస్థానాలను ఆశ్రయించారు. గతంలోనూ అమలు చేశామంటూ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ఈ సమయంలో ప్రతిపక్ష టీడీపీ మౌనంగా ఉంది. మొదట ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించిన హైకోర్టు తిరిగి సుప్రిం ఆదేశాలతో విచారణ చేపట్టంది. ఈ సారి పిటిషనర్‌ వాదనతో ఏకీభవించి.. రిజర్వేషన్లు 50 శాతానికే పరిమితం చేసింది.

ఇక టీడీపీ వంతు వచ్చింది. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని, ప్రభుత్వం సుప్రింలో పిటిషన్‌ వేయాలని డిమాండ్‌ చేసింది. తాను మద్ధతు ఇస్తానని ప్రకటించింది. చివరకు టీడీపీ నేతలు సుప్రింలో పిటిషన్‌ వేశారు. బీసీలకు రిజర్వేషన్లు తగ్గడానికి కారణం మీరంటే.. మీరంటూ.. అధికార వైఎస్సార్‌సీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతలు ఆరోపణలు, విమర్శలు చేసుకున్నారు. ఆయా వార్తలు మీడియాలో పతాక శీర్షికల్లో వచ్చాయి. టీవీ ఛానెళ్లలో చర్చలు నడిచాయి.

నంబర్‌ 34పై ఇలా రచ్చ జరుగుతుండగానే ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేసింది. ఇక ఈ గేమ్‌కు తెరపడుతుందని అందరూ భావించారు. కానీ పడలేదు కదా.. ఈ నంబర్‌ 34 గేమ్‌ మరింత రంజుగా మారింది. బీసీలకు పార్టీ పరంగా 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని అధికార వైఎస్సార్‌సీపీ ప్రకటన చేసింది. బీసీల పార్టీ అని చెప్పుకునే టీడీపీ ఊరుకుంటుందా.. తాము కూడా బీసీలకు పార్టీ పరంగా 34 శాతం సీట్లు ఇస్తామంటూ ప్రకటన చేసింది. ఈ ప్రకటన ముందు టీడీపీయే చేసింది, ఆ తర్వాత టీడీపీని అధికార పార్టీ అనుసరించిందని చెప్పే బాధ్యతను టీడీపీ అనుకూల మీడియా ఎత్తుకుంది.

ప్రస్తుతం ఇరు పార్టీలు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించడంతో బీసీలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆయా పార్టీలు తాము చేప్పిన మాటలను ఆచరణలో కూడా చూపెడతాయా…? లేదా..? అనేది మిలియన్‌ డాలర్ల ప్రశ్న. ఆచరించాయా?. లేదా.. అనే విషయం తేల్చే బాధ్యతను మీడియా తీసుకుంటే.. పార్టీల బండారాన్ని బట్టబయలు చేయవచ్చు.