Idream media
Idream media
1969లో వచ్చిన కథానాయకుడులో NTR మున్సిపల్ చైర్మన్‌గా గెలుస్తాడు. అయితే అతని నిజాయతీ నచ్చని కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం పెట్టి దించేస్తారు. నిజ జీవితంలో ముఖ్యమంత్రిగా ఈ పరిస్థితి ఎదుర్కొంటానని అప్పటికి ఆయన ఊహించి వుండరు. NTRని రాజకీయాల్లో జనం నెత్తిన పెట్టుకోడానికి ఆయన వేసిన పాత్రలు కారణం. ఈ సినిమాలో అవినీతిని ఎదిరించే హీరోగా సీరియస్‌గా వుంటాడు. అయితే క్లైమాక్స్‌లో రొటీన్ మారువేషాలు వేయడంతో సీరియస్‌నెస్ పోయింది. అయితే 50 ఏళ్ల క్రితం ప్రేక్షకుడు అలాంటి మసాలానే కోరుకునే వాడు. దానికి తగినట్టుగానే ముళ్లపూడి వెంకటరమణ కథ ఇచ్చారు. భమిడిపాటి రాధాకృష్ణ వ్యంగ్యంతో డైలాగ్‌లు పండించాడు. ముఖ్యంగా నాగభూషణం తన స్టైల్‌లో పేల్చాడు. హీరో పేరు సారథి.
మున్సిపల్ ఆఫీస్‌లో క్లర్క్. తన పనులకి అడ్డొస్తున్నాడని విలన్ నాగభూషణం మున్సిపల్ అధికారికి ఫోన్ చేసి ఉద్యోగంలోంచి NTRని తీసేయమని చెబుతాడు.
“అతను కరెక్ట్‌గా పనిచేస్తాడండి, ఎలా తీసేయడం?” అంటాడు అధికారి.
“కరెక్ట్‌గా పనిచేసేవాళ్లని తీసేయడానికే కదా నిన్ను ఇక్కడ ఉద్యోగంలో పెట్టింది”… ఇది భమిడిపాటి చమత్కారం.
69 నాటికి స్వాతంత్ర్యం వచ్చి 22 ఏళ్లైంది. కల్తీ పెరిగింది, ధరలు పెరిగాయి. అవినీతి పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ కథ అందరికీ నచ్చింది. దానికి తోడు అన్నీ హిట్ సాంగ్స్. చివర ఒక పాట కలర్‌లో.
విశేషం ఏమంటే హీరో NTR , హీరోయిన్ జయలలిత ఇద్దరూ తర్వాత రోజుల్లో ముఖ్యమంత్రులు కావడం. తేనెమనసులు సినిమా ఆడిషన్‌లో రిజెక్ట్ అయిన జయలలిత, హేమమాలిని ఇద్దరూ దేశంలోనే పేరు మోసిన వ్యక్తులు కావడం, ఇద్దరూ రాజకీయాల్లో కొనసాగడం విశేషమైతే, ఆ సినిమాకి సెలెక్ట్ అయిన సుకన్య, సంధ్య ఇద్దరూ అడ్రస్ లేకుండా పోవడం విషాదం.
ఇపుడైతే హీరోయిన్లు మాస్ పాత్రలు ఒప్పుకోరు కానీ, జయలలిత ఈ సినిమాలో వీధిలో బండిమీద జామకాయలు అమ్మే పిల్లగా నటించింది. అప్పటి సినిమాల్లో సపరేట్ కామెడీ ట్రాక్ రాసుకునే పద్ధతి వుండేది. దీంట్లో కూడా కథతో సంబంధం లేకుండా పద్మనాభం , రాజబాబు ఇల్లరికం అల్లుళ్ల సీన్స్ వుంటాయి.
విలన్ల అవినీతికి వ్యతిరేకంగా పోరాడిన హీరోని మున్సిపల్ ఆఫీస్‌లో ఉద్యోగం నుంచి తీసేయిస్తారు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి చైర్మన్ అవుతాడు. తర్వాత కుట్ర చేసి చైర్మన్‌గా దించేస్తారు. కొట్టి రోడ్డు మీద పడేస్తారు.
ఇక లాభం లేదనుకుని హీరో ఒక పిల్లి గడ్డం తగిలించుకుని విచిత్రమైన తెలుగు మాట్లాడుతూ కోటీశ్వరుడిలా మారు వేషం వేస్తాడు. సినిమా అంతటా పెద్దపెద్ద డైలాగ్‌లు చెప్పే నాగభూషణం హీరో విగ్గుని, గడ్డాన్ని కనిపెట్టలేడు. దీన్ని రచయితలు సినిమా లిబర్టీ అంటారు.
ఏమైతేనేం సినిమా హిట్. 13 ఏళ్ల తర్వాత NTR పార్టీ పెట్టాడు. ఈ సారి విలన్ నాగభూషణం కాదు. ఎవరో మీకు తెలుసు.