టీడీపీ నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ తనను చంపడానికి ప్రయత్నిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు గతంలో రాజేంద్రప్రసాద్ కరస్పాండెంట్ గా ఉన్న విద్యా సంస్థల్లో పనిచేసిన ఒక వ్యక్తి. గతంలో తెనాలి ఎమ్మెల్యేగా పనిచేసి, ఇప్పుడు గుంటూరు జిల్లా టీడీపీలోనే కాక రాష్ట్రస్థాయిలో చాలా యాక్టివ్ గా ఉండే ఆలపాటి రాజేంద్రప్రసాద్ 2019 ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి కూడా ఆయన నియోజకవర్గంలో కంటే ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఆ విషయం పక్కన పెడితే రాజేంద్రప్రసాద్ నుంచి తన కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని గతంలో తిరుపతి బ్రాంచ్ ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు సీఈఓగా పనిచేసిన డాక్టర్ శ్రీధర్ మీడియా ముందుకు వచ్చారు. తిరుపతి ఎన్.ఆర్.ఐ విద్యాసంస్థలు నుంచి సీఈఓగా పనిచేసిన తర్వాత రాజీనామా చేసి బయటకు వచ్చానని ఆయన చెబుతున్నారు.
అక్కడ పని చేసి బయటకు వస్తున్నట్లు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన చెబుతున్నారు. అయితే తాను బయటకు వచ్చాక నేను సంస్థకు ఏదో అన్యాయం చేశానని తన మీద తప్పుడు ప్రచారం చేస్తూ వస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల పాటు తిరుపతి ఎన్ఆర్ఐలో పని చేసిన తర్వాత సొంతంగా శ్రీధర్ మెడికల్ అకాడమీ మొదలుపెట్టానని, దానికి ఆదరణ పెరుగుతూ ఉండటం చూడలేక ఆలపాటి రాజేంద్రప్రసాద్ పత్రికల్లో తప్పుడు ప్రకటనలు చేయిస్తున్నారని చెబుతున్నారు. తన కుటుంబానికి ప్రాణహాని ఉందని పేర్కొన్న శ్రీధర్ తనకు గానీ తన కుటుంబానికి గానీ ఏం జరిగినా ఆలపాటి రాజేంద్రప్రసాద్ దే బాధ్యత అని పేర్కొన్నారు.
Also Read : కరెంటు పేరుతో విపక్షం కోతలు, విస్మయంతో సామాన్యులు
తాను సొంతంగా మెడికల్ అకాడమీ పెట్టుకోవడమే తన పాపం అయిపోయింది అన్నట్టు ఆయన వెల్లడించారు. అంతేకాక ఆయన సీఈవో గా ఉన్న సమయంలో జరిగిన కొన్ని విషయాలు కూడా శ్రీధర్ ఇప్పుడు బయట పెట్టారు. ఆయన అకాడమీలో చేరిన సమయంలో లాభాల్లో ఐదు శాతం వాటా ఇస్తామని చేర్చుకున్నారు కానీ లాభాల్లో వాటా మాత్రం ఇవ్వలేదట. అలాగే కరోనా సమయంలో 30 శాతం ఫీజులు తగ్గించమని ప్రభుత్వం ఆదేశిస్తే అది పట్టించుకోకుండా పూర్తిస్థాయిలో ఫీజులు కూడా వసూలు చేశారట. పైపెచ్చు సిబ్బందికి మాత్రం 50 శాతం జీతాలు మాత్రమే వేశారని శ్రీధర్ ఆరోపించారు.
2021 సెప్టెంబర్ నెలలో రాజీనామా చేసి బయటకు వస్తే ఇప్పుడు తాను ఏదో సంస్థకు ద్రోహం చేసినట్లు పత్రికల్లో ప్రకటనలు చేయిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఎన్ఆర్ఐ అకాడమీ కూడా కొన్నాళ్ల క్రితం వివాదాస్పద అంశంతో వార్తల్లోకి వచ్చింది. మంగళగిరి రూరల్ లో ఉన్న ఈ సంస్థ హాస్పిటల్ లో రెండు గ్రూపులకు సంబంధించి గొడవలు జరగగా ఒక మహిళ డాక్టర్ ని ఆమె ఉంటున్న క్వార్టర్స్ నుంచి ఖాళీ చేయించేందుకు మరో గ్రూపు ప్రయత్నించిన వ్యవహారం మీడియా వరకు కూడా వెళ్ళింది. ఈ క్రమంలో అప్పట్లోనే ఎన్ఆర్ఐ యాజమాన్యం చేతులు మారే అవకాశం ఉందని ప్రచారం జరిగినా అది మాత్రం జరగలేదు. అయితే ఇప్పుడు మాత్రం ఏకంగా ఆ రాజేంద్రప్రసాద్ హత్యా ప్రయత్నం చేయించాడని ఆరోపణలు రావడం సంచలంగా మారింది.
Also Read : TDP – షరీఫ్‌ను ఆ విధంగా సెట్ చేశారు