iDreamPost
iDreamPost
తూర్పు గోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం లోదొడ్డిలో ఈ నెల రెండో తేదీన కల్తీ జీలుగు కల్లు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటనను రాజకీయంగా తనకు అనుకూలంగా మలచుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన ప్రయత్నం దారుణంగా ఎదురుతన్నింది. ఘటన విషయం తెలియగానే ఆయన ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేశారు. ప్రజల ప్రాణాలు పోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ నేతృత్వంలో ఒక నిజనిర్ధారణ కమిటీని వేశారు. ఆ కమిటీ నిజాలను నిర్ధారించడానికి ముందే రాజకీయ విమర్శలు చేసింది. మృతులు తెలుగుదేశం పార్టీకి చెందినవారు కావడంతో బాధిత కుటుంబాలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వలేదని, ప్రభుత్వ అసమర్థత వల్ల ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆరోపణలు చేసేసింది.
జరిగింది ఇదీ..
రంపచోడవరం టీడీపీ ఇన్చార్జీ వంతల రాజేశ్వరికి వరుసకు సోదరుడైన వంతల రాంబాబు జీలుగు కల్లు కుండలో గడ్డి మందు కలపడం వల్లే ఐదుగురూ మృతి చెందారని జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ప్రకటించారు. మృతుడి భార్యతో రాంబాబుకు ఉన్న వివాహేతర సంబంధమే ఈ ఘటనకు కారణమని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని ఎస్పీ చెప్పారు. నిందితుడు రాంబాబు చేసిన పనివల్ల కల్లు తాగిన ఐదుగురు మృత్యువాత పడ్డారు.
పోలీసుల దర్యాప్తులో వాస్తవాలు వెలుగు చూడడంతో ఇన్నాళ్ళూ హంగామా చేసిన టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ నోరు మెదపడం లేదు. దున్నపోతు ఈనింది అంటే దూడను కట్టేయండి అన్నట్టు రాష్ట్రంలో ఏ ఘటన జరిగినా ప్రభుత్వంపై, ముఖ్యమంత్రిపై నోరు పారేసుకోవడం, నిజ నిర్ధారణ కమిటీ అంటూ హంగామా చేయడం టీడీపీకి అలవాటుగా మారింది. చంద్రబాబు అయితే ఈ ప్రభుత్వ మద్యం విధానంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని విమర్శలు గుప్పించేశారు. ఇన్నాళ్లూ ప్రభుత్వాన్ని ఆడిపోసుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు నిందితుడు తెలుగుదేశం పార్టీ వ్యక్తి అని తేలిన నేపథ్యంలో ఎలా స్పందిస్తారో మరి?