iDreamPost
android-app
ios-app

ఇప్పుడు 500 నోట్లు కనిపించవా..?

  • Published Aug 27, 2020 | 7:48 AM Updated Updated Aug 27, 2020 | 7:48 AM
ఇప్పుడు 500 నోట్లు కనిపించవా..?

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సమాచారం నేపథ్యంలో ఇకపై మార్కెట్‌లో 500 నోట్ల చలామాణీ తగ్గుతుందా? అన్న అనుమానాలు సామాన్య జనం నుంచి వ్యక్తమవుతున్నాయి. దాదాపు రెండేళ్ళుగా మార్కెట్‌లో రెండువేల రూపాయల నోట్ల అతి తక్కువగా మాత్రమే కన్పిస్తోందన్నది ప్రజల నుంచి బలంగా విన్పిస్తున్న మాట. ఈ విషయం భారతీయ రిజర్వ్‌ బ్యాంకు కూడా ఇటీవల ధృవీకరించింది.

2016లో పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించారు. ఆ తరువాత తమ వద్ద నున్న పాత నోట్లను మార్చుకునేందుకు చిన్నా, పెద్దా వయస్సులతో సంబంధం లేకుండా జనం బ్యాంకుల వద్ద క్యూలు కట్టారు. అక్రమ సొమ్మును అరికట్టడం, దొంగనోట్లు తొలగించడం, టెర్రరిస్టులకు నిధులు అందకుండా చేయడం వంటి పలు కారణాలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు. అంత వరకు బాగానే ఉంది. అయితే అప్పటి వరకు ఉన్న 500, 1000 కంటే ఎక్కువ విలువ గల 2000 నోటును మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. దీంతో గంటల తరబడి లైన్లో నుంచున్న సగటు మనిషి నుంచి తీవ్ర విమర్శలే విన్పించాయని చెప్పాలి. రెండువేల నోటు అవసరం తమకు లేదని అప్పట్లో సగటు జనం నుంచి ఖచ్చితమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి కూడా.

అప్పట్నుంచి దాదాపు నాలుగేళ్ళుగా 2000 నోటు మార్కెట్‌లో చెలామణీ అవుతోంది. నోటు వచ్చిన కొత్తలో రెండువేల రూపాయల నోటు పట్టుకుని చిల్లరకోసం నానా పాట్లు పడాల్సిన పరిస్థితి ఉండేది. రాన్రాను రెండువేల నోటు మార్కెట్‌లో కన్పించడం తగ్గిపోయింది. దీనికి వీటి ముద్రణ నిలిపివేయడమే కారణం అనిచెబుతున్నప్పటికీ.. అక్రమార్కులు రూ. 2000 నోటును పదిల పర్చుకున్నారన్న అభిప్రాయం జనం నుంచి వ్యక్తమయ్యింది.

అయితే ఇటీవల ఆర్బీపై నివేదిక ప్రకారం గత ఆర్ధిక సంవత్సరంలో రెండువేల నోటు ముద్రణ నిలిపివేసారన్నది బైటపడింది. దాదాపు 33 లక్షలకు పైగా రెండువేల నోట్లను ఆర్బీఐ ముద్రించి మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఇవన్నీ ఇప్పటి వరకు మార్కెట్‌లో చలామణీలో ఉన్నట్లు పేర్కొంది. అయితే వాస్తవానికి మార్కెట్‌లో వీటి జాడమాత్రం పెద్దగా కన్పిస్తున్న దాఖలాల్లేవు. ఇప్పటి వరకు మొత్తం ఆర్ధిక వ్యవస్థలో రెండువేల రూపాయల నోట్లు 3.3శాతం మాత్రమేనని నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.

రెండు వేల రూపాలయ నోట్లు ప్రవేశపెట్టిన మొదట్లోనే విచ్చలవిడిగా కన్పించిన ఈ నోట్లు ఇప్పుడెందుకు కన్పించడం లేదన్న సందేహం జనాన్ని పట్టిపీడిస్తోంది. వారి అభిప్రాయం ప్రకారం వీటిని అక్రమార్కులు జాగ్రత్త చేసుకున్నారన్నది స్పష్టం చేస్తోంది. తాజాగా ఆర్బీఐ వీటి వినియోగాన్ని తగ్గిస్తామని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు రెండువేల నోట్లు మార్కెట్‌ను ముంచెత్తుతాయని సగటు జనం అభిప్రాయపడుతున్నారు.

అయితే రెండువేల నోటును మినహాయిస్తే ఆ తరువాత పెద్ద నోటైన 500 నోటుకు ఇప్పుడు మార్కెట్‌ నుంచి కన్పించకుండా పోతుందన్న అభిప్రాయం కూడా వ్యక్తం చేస్తున్నారు. దీనికి రెండువేల నోటు విషయంలో ఎదురైన అనుభవాన్నే నిదర్శనంగా చెబుతున్నారు. జనం లెక్కలు ఎలా ఉన్నప్పటికీ.. మార్కెట్‌లో చలామణి కావాల్సిన నోట్లు ఇలా అక్రమార్కుల నీడకు వెళ్ళిపోతుంటే ఆర్బీఐ ఏం చర్యలు తీసుకుంటుందన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఆర్బీఐ ఏం చర్యలు చేపడుతుంది? ప్రజలు అనుకున్నదే నిజం అవుతుందా? అన్నది రాబోయే రోజుల్లోనే తేలాల్సి ఉంది. అయితే ఆర్ధిక వ్యవస్థలోని అన్ని జబ్బులకూ నోట్ల రద్దే మార్గమని, ఆ విధానాన్ని అమలు చేసిన విషయం విదితమే. అయినప్పటికీ గత ఆర్ధిక సంవత్సరంలో మార్కెట్‌లో చలామణీలో ఉన్న నోట్లలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా నకిలీ నోట్ల ఉన్నట్లు రిజర్వు బ్యాంకే తమ నివేదికలో పేర్కొంది. అన్నిటికీ నోట్లరద్దే మందైనప్పుడు ఈ నకిలీ నోట్లు ఎలా వచ్చి చేరుతున్నాయన్నదానికి ఆర్బీఐ సమాధానం చెప్పాల్సి అవసరం ఎంతైనా ఉంది.