iDreamPost
android-app
ios-app

త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌?

త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటుకు నోటిఫికేషన్‌?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ప్ర‌క్రియ విషయంలో కీలక ముందడుగు పడనుంది. ఈ అంశానికి సంబంధించి రెండు రోజుల్లో ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేయ‌నున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించి కసరత్తు అంతా పూర్తయినట్టు తెలుస్తోంది. గతంలో ఈ కొత్త జిల్లాల ఏర్పాటు సీఎం జగన్ ఏర్పాటు చేసిన కొత్త జిల్లాలపై స్టేట్ లెవల్ కమిటీ, సబ్ కమటీలు, డిస్ట్రిక్ట్ లెవల్ కమిటీలను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు కొత్త జిల్లాలపై సమావేశాలు కూడా నిర్వహించాయి. వాటి నివేదిక ఆధారంగానే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

జిల్లాల ఏర్పాటు విషయంలో సరిహద్దులు, సాంకేతిక అంశాలను కూడ ఈ కమిటి అధ్యయనం చేసింది. 2021 మార్చి 31వ తేదీ నాటికి కొత్త జిల్లాలను ఏర్పాటును పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.అయితే అనేక కారణాలతో ఈ ప్రక్రియ ఆలస్యమైంది. ప్రభుత్వ వర్గాల సమాచారం మేరకు రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటు చేస్తున్నట్టు చెబుతున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న వైసీపీ ఎంపీలకు కేంద్రం దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది. ప్ర‌తి లోక్‌స‌భ నియోజ‌క వ‌ర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేస్తామంటూ ఎన్నికల మేనిఫెస్టోలో వైఎస్సార్సీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ హామీని నెరవేర్చే దిశగా ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పుడు అడుగులు వేయనున్నారు. రాష్ట్రంలో మొత్తం 25 లోక్‌స‌భ‌ నియోజ‌క‌వ‌ర్గాలుంటే 26 కొత్త జిల్లాలు ఏర్పాటు చేసే దిశ‌గా ప్ర‌క్రియ‌ ప్రారంభ‌మైన‌ట్టు చెబుతున్నారు. అర‌కు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ భౌగోళిక రీత్యా చాలా పెద్దది కావ‌డంతో ఆ నియోజ‌క‌వ‌ర్గాన్ని రెండు జిల్లాలుగా చేసే అవ‌కాశాలు స్ప‌ష్టంగా క‌నిపిస్తున్నాయి. కొత్త జిల్లాలు ఏర్పడితే కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు కూడా వస్తాయని చెబుతున్నారు. ప్రస్తుతం ప్రతి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే అరకు విషయంలోనే ఎలా విభజన చేయనున్నారు అనేది చూడాలి.