iDreamPost
android-app
ios-app

వాలంటీర్లు కాదు ముఖ్యమంత్రి నియమించిన వారియర్స్‌..

వాలంటీర్లు కాదు ముఖ్యమంత్రి నియమించిన వారియర్స్‌..

స్థానిక సంస్థల ఎన్నికలు ప్రారంభమవుతున్న వేళ ప్రతిపక్ష పార్టీలకు ప్రధాన టార్గెట్‌గా మారిన వారిలో వాలంటీర్లు మొదటి స్థానంలో నిలుస్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి స్థానిక టీడీపీ నేతల వరకు ప్రతి ఒక్కరూ వలంటీర్లపై పడి శోకాలు పెడుతున్నారు. అధికార పార్టీ నాయకులపై కంటే కూడా వలంటీర్లపైనే విమర్శలు ఎక్కు పెడుతున్నారు.

కేవలం రూ. 5వేల జీతంతో చిరుద్యోగం చేసుకుంటున్న వలంటీర్లపై టీడీపీ నేతలకు ఎందుకు అంత అక్కసు వస్తోంది?

40 ఏళ్ల ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు సైతం ఎందుకు తన స్థాయిని మరిచి వాలంటీర్లపై దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారు? ‘‘దండుపాళ్యం గ్యాంగ్, రౌడీలు, ఇంట్లో ఆడవాళ్లు లేనప్పుడు తలుపులు కొడుతున్నారు..’’ లాంటి చౌకబారు మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు?

ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం.. వలంటీర్ల వ్యవస్థ గ్రాండ్‌ సక్సెస్‌ కావడమే. దీన్ని జీర్ణించుకోలేని టీడీపీ నాయకులు వలంటీర్లను మానసికంగా ఇబ్బంది పెట్టడానికి టార్గెట్‌గా చేసుకున్నారు. అయినా సరే వలంటీర్లు వారియర్స్‌గా పనిచేస్తూ ముందుకు సాగుతున్నారు.

గత తెలుగుదేశం ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో జన్మభూమి కమిటీల పేరుతో దాదాపుగా తమ వారికే పథకాలు అందేలా చేసుకున్నారు. అయితే వలంటీర్ల వ్యవస్థ అందుకు పూర్తి విరుద్ధంగా ఉంది. తెలుగుదేశం కార్యకర్తల ఇళ్లకు సైతం వెళుతూ ప్రభుత్వ పథకాలను అందిస్తున్నారు. అర్హత ఉన్న వారికి పింఛన్లు, రేషన్‌కార్డుల కోసం వలంటీర్లే దరఖాస్తు చేస్తున్నారు. ఇంటికి వెళ్లి మరీ పింఛన్లను అందిస్తున్నారు. దీంతో గ్రామ స్థాయిలో వలంటీర్లకు ప్రజల నుంచి మంచి కితాబులు వస్తున్నాయి. ప్రభుత్వ పనితీరుపై స్థానిక టీడీపీ కార్యకర్తల్లో కూడా సానుకూలత ఏర్పడుతోంది. ఇప్పుడు ఇదే టీడీపీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అందుకే వాలంటీర్లపై అనవసరంగా విమర్శలు చేస్తున్నారు. కొన్ని చోట్ల మహిళా వలంటీర్లపై దాడులు కూడా చేస్తున్నారు.

సాధారణంగా వాలంటీర్లు అంటే.. స్వచ్ఛందంగా పనిచేసేవారు. అయితే ఇలా స్వచ్ఛందంగా పనిచేయడంలో అలసత్వం ఉంటుందనే భావనతో సీఎం వైఎస్‌ జగన్‌ రూ. 5వేల గౌరవ వేతనం ఇచ్చే ఏర్పాటు చేశారు. ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్‌ను పెట్టి ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిని ఏర్పాటు చేశారు. ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేయడం, ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందివ్వడంలో వలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. గతేడాది ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థ ప్రారంభం సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ వలంటీర్లకు కొన్ని సూచనలు చేశారు. లంచాలు తీసుకోకూడదని, పథకాల అందజేతలో తన, మన బేధం ఉండకూడదని, అందరికీ పథకాలు అందాలని స్పష్టం చేశారు. తన దగ్గర మొదలైన ‘నేను విన్నాను, నేను ఉన్నాను’ అనే మాట వలంటీర్లు భుజానికెత్తుకోవాలని సూచించారు. ఈ మాటలను వలంటీర్లను మనసా వాచా తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు.

మొదటగా వైఎస్సార్‌ నవశకం పేరుతో మొదలైన కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికీ వెళ్లి పథకాల లబ్ధిదారులను గుర్తించారు. ఇందులో పార్టీలను, మతాలను, కులాలను చూడలేదు. లక్షలు జీతాలు తీసుకుంటూ ఒక గంట ఎక్కువ పని చేయడానికి కూడా ఇష్టపడని అధికార వ్యవస్థ ఉన్న సమాజంలో.. వాలంటీర్లు ఆదివారాలు సైతం పనిచేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటికే పింఛన్ల కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా పూర్తి చేస్తున్నారు. అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్న వారికి సైతం అక్కడికే వెళ్లి పింఛన్లు అందజేస్తున్నారు. ఇలా ఒకటా రెండా.. ప్రభుత్వం ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని చిత్తశుద్ధితో పూర్తి చేస్తున్నారు. ఒక్క పక్క టీడీపీ నాయకుల చీత్కరింపులు, దాడులు ఎదురవుతున్నా భయపడకుండా ధైర్యంగా తమకిచ్చిన పనులను పూర్తి చేస్తున్నారు. వాలంటీర్లలో దాదాపు 55 శాతం మహిళలనే విషయం మరిచి చంద్రబాబు.. ఇంటికెళ్లి తలుపు కొడుతున్నారంటూ దుర్మార్గపు వ్యాఖ్యలు చేస్తున్నా వాలంటీర్లు భరిస్తున్నారు. 5వేల జీతగాళ్లకు పెళ్లిల్లు కావంటూ హేళన చేస్తున్నా పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నారు.
ఇలాంటి వారిని వారియర్స్‌ అనడంలో అతిశయోక్తి ఏమాత్రం లేదేమో!