iDreamPost
iDreamPost
ఇప్పుడంటే ఓటిటిల వల్ల సైకో కిల్లర్ల కథలు సినిమాలుగా వెబ్ సిరీస్ లుగా ఎక్కువ చూస్తున్నాం కానీ ఎనభై తొంబై దశకంలో కమర్షియల్ హీరోలు రాజ్యమేలుతున్న టైంలోనే ఇలాంటివి చేసి సక్సెస్ అయిన దర్శకులు ఉన్నారు. అందులో ఒకరు మణివణ్ణన్. 1984లో తమిళ్ లో ‘నూరవతు నాళ్’ అనే మూవీ వచ్చింది. తెలుగులో ‘నూరవ రోజు’గా డబ్బింగ్ చేసి విడుదల చేశారు. 1977లో వచ్చిన ఒక ఇటాలియన్ చిత్రాన్ని ఆధారంగా చేసుకుని ఈ కథను రాసుకున్నారు. దేవి(నళిని)కి ఓ రోజు తన అక్కయ్యను ఎవరో హత్య చేసినట్టుగా కల వస్తుంది. తీరా చూస్తే కొద్దిరోజుల తర్వాత ఆమె నిజంగానే కనిపించకుండా పోతుంది.
వ్యాపారవేత్త రామ్(మోహన్)ని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ అలాంటి కలలు రావడం మొదలవుతుంది. ఈలోగా వీళ్ళుంటున్న బంగాళాలో గోడల వెనుక ఓ శవం బయటపడుతుంది. కట్ చేస్తే అక్కను హత్య చేసినవాడు ఇంకొన్ని మర్డర్లు చేయబోతున్నాడని దేవికి తెలుస్తుంది. అతనెవరో కనిపెట్టడం కోసం దేవి స్నేహితుడు రాజ్(విజయ్ కాంత్)రంగంలోకి దిగుతాడు. ఊహించని రీతిలో వీటి వెనుక ఉన్న వ్యక్తి ఓ సైకో కిల్లర్(సత్య రాజ్)గా బయట పడుతుంది. కానీ చేయించిన వాడు ఎవరో తెలిశాక అందరూ షాక్ తింటారు. అదే నూరవ రోజు. అప్పట్లో ఈ సినిమా బ్లాక్ బస్టర్. క్రిటిక్స్ హాలీవుడ్ స్టయిల్ లో ఉందని ప్రశంసించారు
తమిళనాడులో కొన్ని కేంద్రాల్లో ఏకంగా రెండు వందల రోజులు ప్రదర్శింపబడటం ఓ రికార్డు. తెలుగులోనూ ఆరు సెంటర్లలో శతదినోత్సవం జరుపుకోవడం సంచలనమే. ఇళయరాజా సంగీతం దీనికి చాలా ప్లస్ అయ్యింది. నూరవ రోజు సక్సెస్ కు ప్రధాన కారణం విలన్ ఎవరో అంతుచిక్కకుండా ప్రేక్షకులను విపరీతమైన ఉత్కంఠకు గురి చేసే స్క్రీన్ ప్లే. కిల్లర్ గా నటించిన సత్యరాజ్(బాహుబలి కట్టప్ప) ఇందులోనూ మొదటిసారి గుండుతో నటించి నిజంగా భయపెట్టేశారు. తర్వాత 1991లో మాధురి దీక్షిత్, జాకీ ష్రాఫ్ లతో పార్థో గోష్ దర్శకుడిగా ‘100 డేస్’ టైటిల్ తో రీమేక్ చేస్తే అక్కడా సూపర్ హిట్ కావడం కంటెంట్ ఎంత బలమయ్యిందో ఋజువు చేస్తుంది.