iDreamPost
iDreamPost
కరోనా విషయంలో ఏపీ సీఎం చాలా క్లారిటీతో ఉన్నారు. రెండేళ్లకు పూర్వమే ఆయన కరోనాతో సహజీవనం అని ఫిక్స్ అయిపోయారు. అంతేగాకుండా విద్యార్థుల భవిష్యత్తు విషయంలో ప్రాధాన్యతనిచ్చారు. పిల్లల చదువులు కాపాడాలనే సంకల్పంతో వ్యవహరించారు. కరోనా అనివార్యం కాబట్టి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇప్పటికే గడిచిన రెండు విద్యాసంవత్సరాల విషయంలో అదే జరిగింది. చివరకు పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఎంతో ప్రయత్నించింది. ప్రతిపక్షాలు నానా రచ్చ చేసి కొన్ని పరీక్షలు వాయిదా వేయించగలిగినా పిల్లల చదువుల పరిరక్షణే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేసింది. కరోనా విపత్తులో కూడా ఉక్కు సంకల్పంతో వ్యవహరించింది.
ప్రస్తుతం తెలంగాణా ప్రభుత్వం సెలవులు పొడగించడంతో అందరి దృష్టి ఏపీ వైపు మళ్లింది. కానీ విద్యాశాఖ మంత్రి స్పష్టత ఇచ్చేశారు.ఏపీలో యధావిధిగా పాఠశాలలు తెరుచుకుంటున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు. ఇది మరోసారి ఏపీ ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుతోంది. ముఖ్యంగా కరోనా సమయంలో సినిమా హాళ్లు పరిమితులతోనయినా తెరుస్తున్నారు. రైళ్లు, బస్సులు నడుపుతున్నారు. అన్నింటికీ మించి మద్యం దుకాణాలు ఇతర వ్యవహారాలు సాగుతున్నాయి. అయినా స్కూళ్లకు మాత్రం సెలవులు ప్రకటించడంలో హేతుబద్ధత ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్న తరుణంలో ఏపీ ప్రభుత్వం విద్యాసంస్థల మూసివేతకు నిరాకరించింది.
ఇప్పటికే రెండు విద్యాసంవత్సరాలు కోల్పోయిన తరం అనేక అవస్థలు పడుతోంది. ఆన్ లైన్ విద్యావిధానం అంతంతమాత్రం కావడంతో అనేక రకాలుగా నష్టపోతున్న విషయం తల్లిదండ్రులు కూడా గుర్తించారు. పిల్లల తమ పాఠాలు మరచిపోవడం ఓవైపు, మోబైళ్లకు అంకితమయిపోవడం ఇంకోవైపు అన్నట్టుగా సాగుతోంది. ఇలాంటి సమయంలో విద్యాసంస్థల నిర్వహణను పగడ్బందీ చర్యలతో చేపట్టడం ఆహ్వానించాల్సిన విషయం. అందులోనూ విద్యాసంవత్సరం తుది దశకు వచ్చింది. మరో మూడు నెలల్లో పరీక్షలయిపోతాయి. ఈ సమయంలో బళ్లు తెరవకుండా ఇళ్లకే పరిమితం చేస్తే పిల్లల భవితవ్యం దెబ్బతింటుంది. వరుసగా రెండేళ్ల పాటు పరీక్షలు లేకుండా ప్రమోట్ అయిన సెక్షన్ మూడో సంవత్సరం కూడా అదే చేస్తే ఇక వారి స్థాయి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా విద్యాసంస్థల మూసివేతను సమర్థించలేమని చెప్పేసింది. విద్యాసంస్థల మూసివేత ద్వారా కరోనా వ్యాప్తిని అరికట్టే అవకాశాలు స్వల్పమని ప్రకటించింది. దాంతో ఏపీ ప్రభుత్వ చర్య అందరికీ ఆదర్శంగా మారుతోంది. చిత్తశుద్ధి తో అన్ని జాగ్రత్తలు పాటిస్తూ పాఠ్యాంశాల బోధన కొనసాగించడం ఉత్తమమని తేలింది. విద్యార్థులకు ఇక్కట్లు కల్పించే ఆన్ లైన్ విధానం కాకుండా ఆఫ్ లైన్ చదువులతోనే భవిష్యత్తు ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామంగా చెప్పాలి. చివరకు సెలవులు పొడిగించిన తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వ చొరవను ప్రస్తావిస్తుండడం విశేషం.