iDreamPost
android-app
ios-app

కోవిడ్ మీద ఏ మందూ పని చేయడం లేదట!!

కోవిడ్ మీద ఏ మందూ పని చేయడం లేదట!!

కరోనా వైరస్ చైనా నుంచి బయటకొచ్చి ప్రపంచమంతా వ్యాపించి తన కరాళనృత్యం మొదలుపెట్టే సమయానికి దానిమీద పని చేసే మందులు ఏవీ వైద్యులకు అందుబాటులో లేవు. జబ్బు తీవ్రంగా ఉన్న వారిని ఆసుపత్రికి తరలించి అవసరమైతే ఆక్సిజన్ పెట్టడం, యాంటిబయాటిక్స్, స్టీరాయిడ్స్ ఇచ్చి వైద్యం చేసి రోగి తాలూకు రోగనిరోధక శక్తి మీద భారం వేసేవారు. ఆ తరువాత మలేరియాకి వాడే క్లోరోక్విన్ ఉపయోగపడుతుందని కొందరు పరిశోధకులు చెప్తే దాన్ని వాడారు. అప్పుడే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు బెదిరించినంత పనిచేసి భారతదేశం నుంచి పెద్ద ఎత్తున క్లోరోక్విన్ దిగుమతి చేసుకున్నాడు. అయితే ఈ మందు కోవిడ్ మీద పనిచేయడం లేదని కొన్ని రోజుల్లోనే తెలిసిపోయింది.

రెమెడిసివిర్

కరోనా వైరస్ మీద పోరాటంలో వైద్యులకు ఆశాకిరణంలా కనిపించిన ఔషధం రెమెడిసివిర్. అమెరికాలో మే1న తీవ్రమైన వ్యాధితో బాధపడుతున్న వారికి రెమెడిసివిర్ వాడవచ్చని నిపుణులు సిఫార్సు చేశారు. ఆగస్టులో అందరికీ వాడవచ్చని మార్గదర్శకాలు మార్చారు. అప్పటినుంచి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని లక్షల మందికి రెమెడిసివిర్ ఇస్తూ వచ్చారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కోవిడ్ సెంటర్లలో రెమెడిసివిర్ అందుబాటులో ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఒక డోసు దాదాపు అయిదు వేల రూపాయలు ఉన్న ఈ ఇంజెక్షన్ కొన్ని చోట్ల బ్లాక్ లో కూడా అమ్ముడుపోయింది. తెలంగాణ రాష్ట్రంలో ఒక ఇంజెక్షన్ డెభ్బై వేలకు అమ్మడానికి ఒప్పుకొని తీరా అమ్మే సమయంలో లక్ష రూపాయలు చేయడంతో గొడవ జరిగి వార్తల్లోకి ఎక్కింది.

ఆ తరువాత లోపినావిర్, రిటోనావిర్ అనే రెండు ఎయిడ్స్ కోసం వాడే డ్రగ్స్ , కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులకు వాడే ఇంటర్ ఫెరాన్స్ కూడా కరోనా మీద పని చేస్తాయని కొన్ని సెంటర్లలో పరిశోధకులు చెప్పడంతో చాలా కోవిడ్ సెంటర్లలో వీటిని కూడా వాడుతున్నారు. భారతదేశంలో చాలా ప్రైవేటు కోవిడ్ సెంటర్లలో రోజుకు యాభై వేల రూపాయలు బిల్లుల వెనుక మూలస్థంభం రెమెడిసివిర్ ఇంజక్షన్లే.

సాలిడారిటీ ట్రయల్స్

ప్రపంచ వ్యాప్తంగా విచ్చలవిడిగా వాడుతున్న ఈ మందులకు కరోనా విధ్వంసం దృష్ట్యా హడావుడిగా అనుమతులు ఇచ్చిన నేపధ్యంలో కరోనా వైరస్ మీద ఇవి నిజంగా పని చేస్తున్నాయో లేదో తేల్చడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ నడుం కట్టింది. ప్రపంచ వ్యాప్తంగా 35 దేశాల్లో, నాలుగు వందల కోవిడ్ సెంటర్లలోని పన్నెండు వేలమంది కోవిడ్ పేషంట్లమీద ఈ నాలుగు మందుల ప్రభావం గురించి సాలిడారిటి ట్రయల్స్ పేరిట చేసిన పరిశోధనల్లో నిరాశ కలిగించే ఫలితాలు వెల్లడి అయ్యాయి.

జబ్బు లక్షణాలు తగ్గించడంలో కానీ, మరణాలను నివారించడంలో కానీ, త్వరగా కోలుకునేలా చేయడంలో కానీ, ఇతర కాంప్లికేషన్లను నివారించడంలో కానీ ఈ మందులు ఎలాంటి ప్రభావం చూపలేకపోతున్నాయని, ఈ మందులేవీ వాడకుండా వైద్యం చేసిన రోగులకీ, ఈ మందులు వాడిన రోగులకీ కోలుకోవడంలో ఏమాత్రం తేడా లేదన్న వాస్తవాన్ని ఈ ట్రయల్స్ బయట పెట్టాయి.

అయితే రెమెడిసివిర్ కోసం దాని మీద పేటెంట్ హక్కులు ఉన్న అమెరికా కంపెనీ గిలియడ్ తో యూరోపియన్ యూనియన్ బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకున్న నేపధ్యంలో అ కంపెనీ ఈ ట్రయల్స్ లో లోపాలున్నాయని కొట్టిపారేసింది. కరోనా మీద రెమెడిసివిర్ ఒక్కటే సమర్ధవంతంగా పనిచేసే డ్రగ్ అని వాదిస్తూ ఉంది.

ప్రత్యామ్నాయం కోసం అన్వేషణ

ఈ సంవత్సరం చివరిలోనో, వచ్చే సంవత్సరం మొదటిలోనో అందరికీ అందుబాటులోకి రావడానికి చైనా వాక్సీన్, సైనోవాక్, రష్యా వాక్సీన్ స్పుత్నిక్ V సిద్ధంగా ఉన్నా, అవి అందరికీ అందుబాటులోకి ఎప్పుడు వస్తాయో, వచ్చినా ఎంత సమర్ధవంతంగా కరోనాని నివారించగలవో ఎవరూ చెప్పలేని పరిస్థితిలో ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా దాదాపు పదకొండు లక్షల మందికి పైగాపొట్టన పెట్టుకున్న కరోనా మహమ్మారితో పోరాడడానికి డాక్టర్లకు ఒక సమర్ధవంతమైన ఔషధం అవసరం. ఈ దశగా వివిధ దశల్లో అనేక పాత, కొత్త డ్రగ్స్ మీద పరిశోధనలు జరుగుతున్నాయి.

కొన్ని యాంటీ వైరల్ డ్రగ్స్ తో సహా కడుపు మంట కోసం వాడే రూపాయి కన్నా తక్కువ ధర ఉన్న ఫామోటిడిన్, ఫంగస్ సంబంధిత వ్యాధుల చికిత్సలో వాడే ఇట్రాకొనజోల్ లాంటి వాటితో సహా అనేక ఔషధాలు వివిధ దశల్లో ట్రయల్స్ లో ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి సమర్ధవంతమైన మందు అందరికీ అందుబాటులోకి వచ్చే వరకూ నిరోధమే మంచి వైద్యం (prevention is the best cure) అని గుర్తు పెట్టుకొని తగిన జాగ్రత్తలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా ఉండడం మినహా చేయగలిగింది లేదు.